అంతా ఆన్ లైన్లోనే
కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా, కాకినాడ జిల్లాలు
కౌలు రైతులకు అవకాశం లేదు
ప్రజాశక్తి - కృష్ణా, కాకినాడ ప్రతినిధుల : రైతులకు ఇచ్చే ఎరువుల రాయితీని మరింతగా కుదించడానికి కేంద్ర ప్రభుత్వం స్కెచ్ వేసింది. అందులో భాగంగా ‘ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఫెర్టిలైజర్ సేల్’ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఈ విధానం ద్వారా ఎరువులు అమ్మేందుకు సన్నద్ధమైంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కాకినాడ, కృష్ణా జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. గత ఏడాది అవసరమైన మేర ఎరువులు ముఖ్యంగా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు సొసైటీలు, రైతు భరోసా కేంద్రాల వద్ద బారులు తీరాల్సి వచ్చింది. పంటకు ఎరువు వేయడానికి అదును తప్పుతుందనే ఆందోళనతో అత్యధికమంది రైతులు బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుగోలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికే కొత్త విధానాన్ని తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా, సమస్య మరింత జటిలం అయ్యేలా ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వినియోగాన్ని నిరుత్సాహ పర్చి సబ్సిడీ మరింత తగ్గించుకొనే ఎత్తుగడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లాకు ఏడు వేల టన్నుల మేర ఎరువులను ప్రభుత్వం కోత పెట్టింది. కొత్త విధానం వల్ల ఈ ఏడాది మరింతగా కోత పడనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏమిటీ కొత్త విధానం
‘ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఫెర్టిలైజర్ సేల్’ విధానంలో భాగంగా తీసుకొచ్చిన యాప్ ను రైతు డౌన్ లోడ్ చేసుకోగానే లొకేషన్, కెమెరా యాక్సిస్ అవుతాయి. నోటిఫికేషన్స్ కోసం పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చిన తరువాత ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. రైతుల పాసుపుస్తకాల్లో నమోదైన భూముల ఆధారంగా ఎరువుల కేటాయింపు కనిపిస్తుంది. దీనికి అనుగుణంగా తమకు అవసరమైన ఎరువులను రైతులు బుక్ చేసుకోవాలి. కేంద్రం రాయితీ ఇస్తున్న యూరియా, డిఎపితోపాటు ఇతర కాంప్లెక్స్, పొటాష్ ఎరువులను ఈ యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత రైతు మొబైల్‌కు ఒటిపి వస్తుంది. దీనిని చూపి నిర్దేశించిన మొత్తంలో కేటాయించిన ఎరువులను ప్రయివేటు దుకాణాల్లో కొనుగోలు చేయాలి. ఇటీవల వర్షాలు కురవడం, సాగునీటి విడుదలతో కృష్ణా, కాకినాడ జిల్లాల్లో ఖరీఫ్ వరి నారుమళ్లు వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో వెద పద్ధతిలో వరి సాగుకు పూనుకున్నారు. అయితే మొబైల్ యాప్‌లు, ఒటిపిలపై అవగాహన లేని అనేక మంది రైతులు ఎరువుల కోసం ముప్పతిప్పలు పడాల్సి వస్తోంది.
భూయజమానికి వచ్చిన ఒటిపి చెప్తేనే కౌలు రైతుకు ఎరువులు
కౌలు రైతులకు ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా ఎరువులు కొనుగోలుకు అవకాశాన్ని కల్పించలేదు. భూ యజమాని ఆధార్ సంఖ్యకు అనుసంధానమైన మొబైల్‌కు వచ్చిన ఒటిపిని చెప్పిన తర్వాతే కౌలు రైతులు ఎరువులు తీసుకోవాల్సి వస్తోంది.
సీజన్ ప్రారంభంలోనే ఇబ్బందులు
కొత్త విధానంతో సీజన్ ప్రారంభలోనే రైతులు ఎరువుల కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యాప్‌లో భూమి అనుసంధాన సమస్యలు ఉండటంతో రైతులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఒకటికి రెండుసార్లు ఆర్‌ఎస్‌కెలు, సొసైటీలు, ఎరువుల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. మరోపక్క భూ యజమాని ఆమోదం లేకుండా కౌలు కార్డుతోపాటు ఎరువులు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని కౌలు రైతులు వాపోతున్నారు.
ఎరువు అవసరం ఎక్కువ... ఇచ్చేది తక్కువ
సముద్ర తీర ప్రాంతాల్లోని వేలాది ఎకరాల చౌడు భూములు, నదీతీరంలోని ఇసుక భూములు, మెట్ట ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో ఎకరా వరి సాగుకు 150 నుంచి 200 కిలోలకుపైగా యూరియా, 75 కిలోలకుపైగా డిఎపి అవసరం. ఎకరం భూమికి రెండు బస్తాల (90 కిలోలు) యూరియా, 50 కిలోల డిఎపి మాత్రమే సబ్సిడీపై మూడు దఫాలుగా ఇస్తున్నారు. అర ఎకరం ఉంటే ఒక బస్తా యూరియా మాత్రమే ఇవ్వనున్నారు. డిఎపి ఇవ్వరు. చెరకు, కంద, అరటి, పసుపు, తమలపాకు, కూరగాయలు తదితర పంటలకు అధిక మొత్తంలో ఎరువులు అవసరం ఉంటుంది. ఈ పంటలకు కూడా ఇంతే మొత్తంలో యూరియా, డిఎపిని ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం రాయితీ ఇస్తున్న డిఎపి, యూరియా, పొటాష్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ప్రభుత్వం యూరియా, డిఎపి కుదించడంతో మిశ్రమ ఎరువులను రైతులు అధిక ధరలకు కొనాల్సి వస్తుంది. దీంతో పంటల సాగు పెట్టుబడి మరింత పెరగనుంది.
భూ విస్తీర్ణం ఆన్లైన్లో కనిపిస్తేనే ఎరువులు
కృష్ణా జిల్లా నందివాడ మండలం జొన్నపాడుకు కొందరు రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో పూర్తిగా కనిపించడం లేదు. ఎకరం ఉన్న వారికి అర ఎకరం, రెండెకరాలు ఉన్న వారికి ఎకరం మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఎరువుల యాప్‌తో ఒక్కో రైతు ఒక్కో రకమైన సమస్య ఎదుర్కొంటున్నారు. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని ఎరువులు ఇవ్వడానికి కొందరు దుకాణాల యజమానులు నిరాకరిస్తున్నారు. కొందరి రైతుల భూముల విస్తీర్ణం ఆన్‌లైన్‌లో తక్కువగా కనిపిస్తోంది. దీంతో, యాప్‌లో బుక్ చేసి ఒటిపి వచ్చిన తర్వాత కూడా ఎరువుల తీసుకోవడానికి దుకాణాలకు వెళ్లిన అనేక మంది రైతులు తిరిగి ఆర్‌ఎస్‌కెలకు రావాల్సి వస్తోంది.

89 ఏళ్ల వయసులో రైతు కష్టాలు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోటకు చెందిన 89 ఏళ్ల రైతు వేమూరి నాగభూషణానికి చిట్టూర్పు గ్రామంలో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుత ఖరీప్ సీజన్‌లో అవసరమైన ఎరువుల కోసం చిట్టూర్పులోని ఆర్‌ఎస్‌కెలో ఎరువుల కార్డు తీసుకున్నారు. మొదటి విడతగా ఒక యూరియా బ్యాగ్, ఒక డిఎపి బ్యాగ్‌ను ఇవ్వాలని ఎరువుల కార్డులో ఆర్‌ఎస్‌కె సిబ్బంది రాశారు. రైతు ఈ కార్డుతో ఎరువులు తీసుకోవడానికి సోమవారం దేవరకోట నుంచి ఘంటసాలలోని ‘మన గ్రోమోర్’ దుకాణానికి వెళ్లారు. అయితే, భూ విస్తీర్ణం ఆన్‌లైన్‌లో చూపడం లేదంటూ ఎరువులు ఇవ్వలేదు. దీంతో, ఆ రైతు ఘంటసాల నుంచి తిరిగి చిట్టూర్పు ఆర్‌ఎస్‌కెకు వచ్చారు. భూదార్‌లో నమోదు కాకపోవడంతో ఆన్‌లైన్‌లో రైతు భూమి కనిపించడం లేదని ఆర్‌ఎస్‌కె సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత సంబంధిత రైతు భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఎరువుల కోసం మరోసారి ఘంటసాల వెళ్లారు. ఇలా 89 ఏళ్ల వయస్సులో ఆ రైతు ఎరువుల కోసం దేవరకోట నుంచి చిట్టూర్పు, ఘంటసాలకు రెండుసార్లు తిరగాల్సి వచ్చింది.
భూముల సమస్యలను యాప్‌లో మాన్యువల్ గా సవరించుకునే అవకాశం : -కె.జ్యోతిరమణి, కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలో ప్రతి రైతు యాప్ ద్వారానే అవసరమైన ఎరువులను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్ వెబ్‌ల్యాండ్, అడంగల్‌లో భూములు కనిపించకపోవడం, భూమి విస్తీర్ణం తక్కువగా చూపడం, కౌలు రైతులకు ఎరువులు సరఫరా చేయడం సమస్యగా ఉంది. దేవాలయ భూములు, 22 'ఎ` భూములు, ప్రభుత్వ భూములు తదితరాలకు సంబంధించి వివరాలు యాప్‌లో కనిపించడం లేదు. ఈ సమస్యలను టెక్నికల్ టీం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు భూముల సమస్యలను యాప్‌లో మాన్యువల్ గా సవరించుకునే అవకాశం కల్పించారు.
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు : కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్
యాప్ ద్వారా ఎరువులు పంపిణీలో ఎదురవుతున్న క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. యాప్ ద్వారా ఇప్పటివరకు సుమారు 2,500 మెట్రిక్ టన్నుల వివిధ ఎరువులను పంపిణీ చేశాం. రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను, అనుమానాలను అధికారులు, సిబ్బంది నివృత్తి చేసేలా చర్యలు తీసుకున్నాం.









కామెంట్‌లు (0)