• ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయోపరిమితి 62 ఏళ్లకు పెంపు
• మరో 5 జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు
• 3న కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
• మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారధి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కోసం కృష్ణా, ఎన్టీఆర్, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతులు మంజూరు చేసింది. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలతోపాటు, తక్కువ ధరలకే ప్రభుత్వ భూములు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐపిబి ఆమోదించిన వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులు, తిరుపతి మినహా అన్ని విమానాశ్రయాల్లో బార్లకు అనుమతులు, అమరావతి సహా, వివిధ నగరాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణానికి వివిధ సంస్థలకు రాయితీలు, పోత్సాహకాలు ఇవ్వడం, రాజధానిలోని వివిధ అభివృద్ధి పనులకు ఆమోదం వంటి 87 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించి ఆమోదం తెలిపారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరిస్తూ.. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, డేటా సెంటర్ల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, యువతకు భారీ ఉపాధి అవకాశాల కల్పన అనే లక్ష్యాలతో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోందని, ఇప్పటికే కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా, మరికొన్ని సంస్థలు నిర్మాణ పనులను పూర్తి చేసి త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో కాలుష్యం పెరుగుతుందనే అనుమానాలు వద్దన్నారు. ఎస్‌ఐపిబి ఆమోదించిన ప్రతిపాదనలతో వల్ల రూ.30355 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 34,610 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2004కు ముందు నోటిఫికేషన్ వెలువడి, 2004 అనంతరం నియామకం పొందిన డిఎస్సి ఉపాధ్యాయులు, గ్రూప్ 1 ఉద్యోగులు 10,715 మంది ఉద్యోగులకు సిపిఎస్ నుండి ఒపిఎస్‌లోకి మారేందుకు వన్-టైమ్ ఆప్షన్ కల్పించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రతిపాదన అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.34,850.83 కోట్ల నికర ఆర్థిక భారం పడుతుందన్నారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు పరిధిని 64 కిలో మీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తీరప్రాంతానికి, అలాగే ప్రకాశం జిల్లా పరిధిని 51 కి.మీ నుండి 15 కి.మీ తీరప్రాంతానికి కుదింపునకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఎపి మోటారు వాహనాల పన్నుల చట్టానికి సవరణ చేస్తూ, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్లతో కాంట్రాక్ట్ క్యారేజీలుగా నడిచే 12 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణికుల సామర్థ్యం గల వాహనాల్లో ప్రతి సీటు, బెర్తుకు ప్రస్తుతం ఉన్న రూ. 4 వేల నుండి రూ. 2,500 లకు తగ్గించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టంలో షెడ్యూల్ 9, 10లలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలోని రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు. దీనిని 2022 జనవరి 1 నుండి పాత తేదీతో వర్తింపజేస్తూ, అప్పటి నుండి విశ్రాంతి పొందిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సర్వీస్ రూల్స్ సవరించడానికి మంత్రి మండలి ఆమోదించిందన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల కలెక్టర్లను గిరిజన ప్రాంతాలకు "ప్రభుత్వ ఏజెంట్లుగా" నియమించేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. అమరావతి పరిధిలోని పిచ్చుకలపాలెంలో ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ పనులను, అంచనా వ్యయం కంటే 3.89 శాతం ఎక్కువగా రూ. 130.38 కోట్లలతో అత్యల్ప ధరకు కోట్ చేసిన బిడ్డర్‌కు అప్పగించేందుకు ఆమోదించిందని వెల్లడించారు. సిఆర్ డిఎ ప్రవేశపెట్టిన ప్లాట్ కోడ్‌ల నామకరణ విధానంలో మార్పుల కారణంగా నమోదిత పత్రాలలో తలెత్తిన ప్లాట్ కోడ్‌లు, ప్లాట్ సరిహద్దుల తప్పులను సవరణకు, ఇందుకోసం చేయాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు ఆమోదం తెలిపిం దన్నారు. ఉండవల్లి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల పనుల కొరకు, రూ. 426.46 కోట్ చేసిన బిడ్డర్ టెండర్లకు ఆమోదం లభించిందన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేందుకు హోమ్‌స్టేలు, బెడ్, బ్రేక్‌ఫాస్ట్‌ల స్థాపనను ప్రోత్సహించేందుకు పర్యాటక విధానంలో మార్పులకు ఆమోదం తెలిపిందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 54 బిసి సంక్షేమ వసతి గృహాలలోని 216 పోస్టులను రద్దు చేస్తూ, వాటి స్థానంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ఆమోదించినట్లు తెలిపారు. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ వరకు గల ప్రధాన కాలువల వ్యవస్థ ఆధునీకరణ పనులకు సంబంధించి మొత్తం రూ.768.07 కోట్ల విలువైన రెండు అనుబంధ ఒప్పందాలపై తీసుకున్న చర్యలను అధికారికంగా ధృవీకరిస్తూ క్రమబద్ధీకరించడానికి అంగీకారం తెలిపిందన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌కు వచ్చే నెల 3న శంకుస్థాపన, రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామన్నారు. క్వాంటం వ్యాలీలో పెట్టుబడులకు 11 సంస్థలు ముందుకు వచ్చాయని వెల్లడించారు.








కామెంట్‌లు (0)