‘ఎస్‌ఐఆర్’కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : ఎస్‌ఐఆర్‌ను అడ్డం పెట్టుకుని రాష్ట్రాల్లో దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని బిజెపి కుట్రలు చేస్తోందని అఖిలపక్ష నాయకులు అన్నారు. సర్ పేరుతో బిజెపి వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి అప్రజాస్వామిక విధానాలపై నిర్వహించే పోరాటాలకు మద్దతివ్వాలని ప్రజలకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జనం రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్లకార్డులు, పెక్సీలు, జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్ వరకు సాగిన భారీ ర్యాలీలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్) మాస్, ఎం సిపిఐ, ఎస్‌యుసి ఇతర వామపక్షాలు, టిజెఎస్ శ్రేణులు కదం తొక్కాయి. పిఎం డౌన్ డౌన్..., ఎస్‌ఐఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆయా పార్టీలకు చెందిన సాంస్కృతిక బృందాలు కళజాతా ప్రదర్శన చేసాయి. విద్యార్థులు, యువజనులు, మహిళలు, పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లోపాలున్నాయంటూ అఖిలపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు నినదించారు. ఈ ర్యాలీలో తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డి అబ్బాస్, కాంగ్రెస్ ఎంపి మల్లు రవి, తెలంగాణ సిపిఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, టి.జె.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎం.కోదండరామ్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ జి.వెన్నెల, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతి, సిపిఐ (ఎంఎల్) మాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హన్మేష్, ఎస్.యుసిఐ నాయకులు భరత్, వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం అఖిలపక్ష ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అదనపు సిఇఒ వాసం వెంకటేశ్వర రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలని విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు అఖిలపక్ష నేతలు రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చే కుట్ర: జాన్‌వెస్లీ
బిజెపి కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. సర్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండి, తమ ఒట్లను కాపాడుకోవాలననీ, దీనికి సిపిఎం సహకరిస్తుందన్నారు. కేంద్రం, ఎన్నికల కమిషన్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నాయి.
అర్హులను తొలగిస్తే ప్రతిఘటిస్తాం: కూనంనేని
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ ఎలాంటి పక్షపాతం లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి, సర్ విధానంలోనే లోపాలు ఉన్నాయి. వాటిని వెంటనే సరిదిద్దాలి.








కామెంట్‌లు (0)