'ఓ కూతురు తండ్రితో నెలసరి విషయాలు చర్చించగలదా?` అంటే 'లేదు` అనే ఠక్కున సమాధానం వస్తుంది. అసలు నాన్న ముందు ఆ విషయం మాట్లాడే ధైర్యం ఆడపిల్లకు ఉందా? అన్నా అదే సమాధానం. అయితే ఢిల్లీకి చెందిన ఖ్యాతి వాళ్ల నాన్న అరుణ్ మాత్రం ఆ తండ్రుల లాంటి వారు కాదు. కూతురు ఖ్యాతి నెలసరి గురించి తనతో మాట్లాడినప్పుడు ఎంతో సానుకూలంగా విన్నారు. దాని చుట్టూ ఉన్న అపోహలను పోగొట్టాలని, దాని కోసం ఏదైనా చేయాలని కూతురు ఎంతో ఉత్సాహంగా చెబుతుంటే ఆ దిశగా తనను ప్రోత్సాహించాలి అనుకున్నారు. ఆ తండ్రి ఆరోజు అనుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ఉద్యమంలా మారింది. ఈ ప్రయాణంలో ఖ్యాతి చదువు, ఉద్యోగంలో బిజీ అయినా అరుణ్ మాత్రం కెరీర్ ను వదిలిపెట్టి మరీ కూతురు ఆకాంక్షను ముందుకు నడిపిస్తున్నారు.
అరుణ్ రెండు దశాబ్దాల పాటు ఐబిఎం, డెల్ కంపెనీలతో కలిసి పనిచేశారు. ఆ తరువాత సొంత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఉజ్వలంగా దాన్ని నడిపిస్తున్నారు. అప్పుడే ఖ్యాతి తన ఆలోచనను తండ్రి ముందు పెట్టింది. దీని గురించి ఆమె ఇలా చెప్పింది. ‘నాన్న నా మాటలను తేలిగ్గా కొట్టిపారేయవచ్చు. కానీ అలా చేయలేదు. దీని వెనుక ఉన్న లక్ష్యాన్ని ఆయన గుర్తించారు. పిల్లల ఆలోచనలకు విలువ ఇచ్చి వాళ్లను గుడ్డిగా అనుసరించే నాన్నలు చాలా అరుదుగా ఉంటారు` అంటోంది.
2017లో అరుణ్, ఖ్యాతి 'పింకిషి` పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ 9 ఏళ్ల కాలంలో 7 లక్షల మందికి పైగా విద్యార్థులను, మహిళలను ఈ సంస్థ కలిసింది. 5 వేలకు పైగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. వెయ్యికి పైగా పాఠశాలలను సందర్శించింది. 41 లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాల్లోని 150 జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించింది. వందకు పైగా స్వచ్ఛంద సంస్థలు, 50 మందికి పైగా కార్పొరేట్ భాగస్వాములు ‘పింకిషి’తో కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఖ్యాతి ఇంటి నుండే పడింది. ఆ అనుభవాన్ని ఆమె ఇలా పంచుకుంది.
‘ఒకసారి మా ఇంట్లో పనిచేసే అమ్మాయి నెలసరిలో ఉన్నట్లు నాకు చాలా స్పష్టంగా తెలిసింది. ఆమె దుస్తులపై మరకలు కనిపించాయి. అప్పుడు 'నువ్వు శానిటరీ ప్యాడ్లు ఉపయోగించవా?` అని తనను అడిగాను. 'అవేంటో కూడా తమకు తెలియవని, వాటిని కొనే శక్తి మాకు లేద`ని ఆ అమ్మాయి వాళ్ల అమ్మ చెప్పింది. ఆ మాటలు నాపై తీవ్రంగా ప్రభావం చూపాయి. అప్పుడే నాన్నను కలిసి 'ఈ విషయంలో ఏదైనా చేయాలి` అని చెప్పాను` అని ఖ్యాతి తన మొదటి అడుగును గుర్తు చేసుకున్నారు.

అరుణ్ తో ఖ్యాతి ఈ విషయం చెప్పిన్పుడు మొదట్లో ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఇదంతా జెన్ జెడ్ పిల్లల తాలూకు భావోద్వేగం అని కొట్టిపారేశారు. కానీ విషయం లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఇది అత్యవసరంగా అందాల్సిన సేవగా అరుణ్ భావించారు. కెరీర్ ను వదిలేసి మరీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజానకెత్తుకున్నారు.
మొదట ఫేస్ బుక్ ద్వారా సంస్థ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆరునెలల వ్యవధిలోనే 2017 డిసెంబరు నాటికి రెండు లక్షల మంది ఫేస్ బుక్ పేజీని అనుసరించారు. ఆ ఉత్సాహంతో దేశవ్యాప్తంగా 50 బ్రాంచీలు మొదలుపెట్టారు. కాశ్మీర్ నుండి గ్వాలియర్, అంబాలా, చంఢీగఢ్, పాట్నా, గోరఖ్ పూర్ లో వాలంటీర్ల బృందాలతో కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు. ‘పింక్ సర్కిల్స్’ అని పిలవబడే ఈ బృందాలకు ఫేస్ బుక్ యాజమాన్యం 'కమ్యూనిటీ యాక్సిలేటర్` అవార్డును కూడా ఇచ్చింది.
ఈ బృందాలు ఫార్మసీల ముందు నుంచొని ‘ఒక్క శానిటరీ ప్యాక్’ ను విరాళంగా ఇవ్వమని కోరుతుంది. మొదట్లో ప్రజలు వీళ్లను ఆశ్చర్యంగా చూశారు. క్రమంగా విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. అలా సేకరించిన ప్యాడ్లను 2018లో వరదలతో అతలాకుతలమైన కేరళకు అరుణ్ ట్రక్కుల్లో పంపించారు. ఆ తరువాత కోవిడ్ సమయంలో పోలీసులతో సాయంతో పలు చోట్ల పంచిపెట్టారు.
అవమానాలు ఎదురయ్యాయి..
వారణాసి వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు అరుణ్ కు స్థానిక పురుషులు అడ్డుచెప్పారు. ‘మీరు వచ్చి మా మహిళల బుర్రలు పాడుచేయవద్దు` అని అడ్డగించారు. అప్పుడే ఈ కార్యక్రమాల్లో మహిళలను భాగం చేసుకోవాలని అరుణ్ భావించారు. ఆ ఆలోచన నుండే 'శక్తి శాల` పుట్టుకొచ్చింది. మూడేళ్ల పాటు నిర్వహించే ఈ ప్రాజెక్టును తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లో మొదట ప్రారంభించారు. ఇందులో భాగంగా స్కూళ్లల్లో సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వెండింగ్ మిషన్ సాయంతో ప్యాడ్ బ్యాంకు నిర్వహించేందుకు ఆయా స్కూళ్లల్లోని టీచర్లు, విద్యార్థినులను ఇందులో భాగం చేసుకున్నారు. నెలసరి విషయంలో పిల్లలకు ఉన్న అనుమానాలు, అపోహలు తొలగించడం కూడా ప్రాజెక్టు పనుల్లో కీలకంగా పనిచేస్తోంది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లను కూడా కలుపుకుని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ‘నుక్కడ్ నాటక్` పేరుతో అబ్బాయిలను కూడా ఇందులో భాగం చేసి అవగాహన ఇస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది ఓ కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసుకుని 'పింకిషి` ముందుకు వెళుతోంది.
తెలంగాణలో..
తెలంగాణలో ఆసిఫాబాద్, అదిలాబాద్ లో గిరిజనుల్లో అవగాహన కల్పించడం కోసం ‘పింకిషి’ బృందం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఆ అనుభవాన్ని ఖ్యాతి ఇలా చెప్పింది. ‘అదిలాబాద్ లోని ఓ గ్రామంలో పీరియడ్ లో ఉన్న మహిళలను గ్రామంలోకి అనుమతించరు. మేం అక్కడికి వెళ్లినప్పుడు 'మాలో ఎవరైనా నెలసరిలో ఉన్నారా?` అని వాళ్లు అడిగారు. అక్కడ మేం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వల్ల సంవత్సరం తరువాత ఆ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది` అంటోంది. అదిలాబాద్ స్కూళ్లల్లో పింకిషి నిర్వహించిన కార్యక్రమాల వల్ల బాలికల హాజరుశాతం పెరిగిందని స్థానిక వార్తాపత్రికలు ప్రచురించాయి కూడా. ప్రస్తుతం పింకిషి సంస్థ అమెజాన్, ఇండస్ టవర్స్, ఫ్లిప్ కార్ట్ ఫౌండేషన్ వంటి 50 ప్రముఖ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ఈ సంస్థ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లో నమోదైంది. జులైలో దీని లిస్టింగ్ ఉంటుందని భావిస్తున్నారు.
దేశంలో ఎక్కడో ఓ ఇంట్లో తండ్రికూతుళ్ల సంభాషణలోంచి పుట్టుకొచ్చిన ఒక ఆలోచన ఇది. సంకల్పం గట్టిగా ఉంటే.. ఫలితాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో అనడానికి 'పింకిషి` ప్రయాణం ఒక ఉదాహరణ. దశాబ్దానికి దగ్గరవుతున్న తమ ప్రయాణంలో నెలసరి విషయంపై అవగాహన కల్పించేందుకు భవిష్యత్తు లో ఏ సంస్థకు అవసరం రాకుండా ఉండాలని అరుణ్ కోరుకుంటున్నారు.








కామెంట్‌లు (0)