పొగాకు సాగు రైతులను పగ బట్టిందని ఏటికేడు దిగజారుతున్న పంట ధరలు తెలియజేస్తున్నాయి. నిరుడు అనుమతుల్లేని నల్ల బర్లీ పేరిట ధరల్లేక ఆ రకాన్ని సాగు చేసిన రైతాంగం ఆర్థిక నష్టాలతో ఆగమాగమయింది. ఈ ఏట అనుమతులు కలిగిన వర్జీనియా పొగాకునకు ధరలు దారుణంగా పతనమవడం పంట పండించిన రైతుల పాలిట విపత్తుగానే భావించాలి. గడచిన రెండు మూడు వారాలుగా కిలో పొగాకు సరాసరి ధర రూ.200 కంటే తక్కువే. ఆ రేటు తమకు ఏ మాత్రం సరిపోదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికోగాని స్పందించిన ముఖ్యమంత్రి, రైతులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించి, కిలోకు రూ.200 కు తగ్గడానికి వీల్లేదని ఆదేశించారు. కంపెనీలు రైతుల నుంచి కొనాల్సిందేనని, మార్కెట్‌కు రైతులు తెచ్చిన పంటను తిప్పి పంపొద్దని, పొగాకు బోర్డు వెలుపల కొనుగోళ్లు జరిపితే అరెస్టుల వంటి కఠిన చర్యలు తప్పవని, నో బిడ్, లో బిడ్‌కు ఆస్కారం లేదని స్పష్టం చేసినా అవన్నీ అంతకు ముందరిలాగే కొనసాగుతున్నాయి. కేంద్రం వద్దకు బృందాన్ని పంపుతామనగా అతీగతి లేదు. ప్రభుత్వమే కనీస ధర రూ.200 అనడంతో, అప్పటి వరకు అక్కడక్కడ రూ.200 ఇచ్చిన కంపెనీలు, ఆ లోపునకు ధరలు తగ్గించిపడేశాయి. సిఎం ఆదేశాలు అమలు కాకపోగా రేట్లు ఇంకా పడిపోవడంతో ఆ మరుసటి రోజు ఏనాడూ లేని రీతిలో ఒంగోలులో రైతులు భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. శనివారంనాడు మార్కాపురం జిల్లా పొదిలిలో వేలం కేంద్రం షట్టర్లు దించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు.
పొగాకు పంట దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనే ఎక్కువ సాగవుతుంది. ఎ.పి.లో సాధారణ సాగు 1.85 లక్షల ఎకరాలు కాగా నిరుడు 3.02 లక్షల ఎకరాలు, ఈ ఏడాది 2.92 లక్షల ఎకరాల్లో రైతులు వేశారు. ఈ తడవ 260 మిలియన్ కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా. పొగాకు పంటను రైతులు వారికి వారు వేసేది కాదు. పొగాకు బోర్డు నియంత్రణ ఉంటుంది. రైతులు వేసిన పంటలు కొంటామని బోర్డు రైతులకు బాండ్లు జారీ చేస్తుంది. కాని కంపెనీలు ధరలు తగ్గించేందుకు అనధికారికంగా పొగాకు సాగు చేయించి ఉత్పత్తి ఎక్కువ వచ్చింది కాబట్టి ధరలు తగ్గిస్తున్నామని రైతులను దోపిడీ చేస్తున్నాయి. బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలతో కుమ్మక్కు కావడం వల్లనే పొగాకు రైతులు ప్రతి ఏటా దగా పడుతున్నారు. వారి బతుకులు పొగ చూరుతున్నాయి. ఈ వాస్తవాన్ని పాలకులు కావాలనే దాచిపెడుతున్నారు.
పొగాకుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రూ.లక్ష కోట్ల వరకు పన్నులు, సెస్సుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. అంతేసి ఆదాయం మూటగట్టుకుంటున్న ప్రభుత్వాలు కనీసం వెయ్యి కోట్లు కేటాయించి ఎస్‌టిసి, మార్క్ ఫెడ్, తదితర ప్రభుత్వరంగ సంస్థలతో పొగాకును కొనిపించలేవా అనే రైతుల ప్రశ్నకు సమాధానం లేదు. దీన్నిబట్టే ఈ ప్రభుత్వాలు రైతుల పక్షం కాదని తెలిసిపోతుంది. నిరుడు రాష్ట్ర ప్రభుత్వం 20 మిలియన్ కిలోలు కొంటామని చెప్పి 10 మిలియన్ కిలోలకు పరిమితమై రైతులను వారి మానాన వారిని వదిలేసింది. కిలో పొగాకు ఉత్పత్తికి రైతులకు అయ్యే ఖర్చు రూ.250కి చేరుకుందని, కనీసం రూ.300 అన్నా ధర ఉంటే నెట్టుకొస్తామన్న రైతుల కోర్కె న్యాయ సమ్మతమైనది. కేంద్రం సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై జిఎస్‌టి 28-40 శాతం, మరికొన్ని ట్యాక్స్‌లు పెంచినందున తమకు గిట్టుబాటు కాదన్న కంపెనీల బీద అరుపుల్లో సహేతుకత లేదు. అన్నీ కలుపుకున్నా పెరిగింది 22 శాతమే. ఈ కాలంలో సిగరెట్ల ధరలను కంపెనీలు 20 శాతం దాకా పెంచాయి. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ పతనమైనందున ఎగుమతుల్లో విపరీతంగా లాభాలు పోగేసుకుంటున్నాయి. వీటన్నింటితో పోల్చితే కంపెనీలకు నష్టాలనడం అసంబద్ధ వాదన. కేవలం రైతులకు ధర ఇవ్వకుండా సొమ్ము చేసుకునే ఎత్తు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షాన నిలబడాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు చేపట్టాలి. నిధులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేయించాలి.








కామెంట్‌లు (0)