సీతాపురంలో ఉండే చిన్నయ్యకు పాదరక్షల అంగడి ఉంది. చిన్నయ్య కుట్టే పాదరక్షలు ఎంతో మన్నికగా ఉంటాయి. అదే ఊరిలో ఉండే పెద్దయ్య, చిన్నయ్యకు వరసకు దూరపు బంధువు అవుతాడు. అతను కూడా పాదరక్షలు కుడతాడు కానీ అవి అంత మన్నికగా ఉండవు. ఒకసారి ఆ ఊరి జమీందారు పుట్టిన రోజు వచ్చింది. చిన్నయ్య, పెద్దయ్యలు తాము కుట్టిన పాదరక్షలను జమీందారుకు కానుకగా ఇచ్చారు. ‘నేను ఉచితంగా తీసుకొను’ అని వారికి వాటి ఖరీదును ఇచ్చి ‘ఈ పాదరక్షలలో ఏవి ఎక్కువ కాలం మన్నికగా వస్తే అవి కుట్టిన వారికి మంచి బహుమతి ఇస్తాను’ అన్నాడు జమీందారు. కాలం గడిచింది మళ్లీ జమీందారు పుట్టిన రోజు వచ్చింది. చిన్నయ్య,పెద్దయ్యలు జమీందారును కలిశారు. ‘ఈ చెప్పుల జత మీలో ఎవరు కుట్టారో కానీ ఇంకా కొత్త వాటిలాగా ఉన్నాయి’ అన్నాడు జమీందారు.
‘అవి నేను కుట్టినవి కావు అయ్యగారూ!’ అన్నాడు చిన్నయ్య. పెద్దయ్య ఏమీ మాట్లాడ లేదు. ‘అయితే ఇవి పెద్దయ్య కుట్టినట్టున్నాడు.. అన్న మాట ప్రకారం ఇవిగో నీకు బహుమతిగా రెండు బంగారు నాణేలు ఇస్తున్నాను’ అని పెద్దయ్యకు ఇచ్చాడు జమీందారు. ‘చిన్నయ్యా!.. నీవు కుట్టిన పాదరక్షలు కూడా బాగానే మన్నాయి’ అని చిన్నయ్యకు కూడా ఒక బంగారు నాణెం ఇచ్చాడు జమీందారు. ‘ధన్యవాదాలు అయ్యగారూ’ అని ఇద్దరూ బయలుదేరారు. దారిలో ‘చిన్నయ్యా.. ఆ పాదరక్షలు నేను కుట్టినవి కావు.. జమిందారు గారు అడుగుతుంటే ఎందుకు నిజం చెప్పలేదు’ అన్నాడు పెద్దయ్య.
‘పెద్దయ్యా!.. నువ్వు నీ కూతురు వివాహం పెట్టుకున్నావని తెలిసింది. అమ్మాయి పెళ్లికి, జమీందారు గారు ఇచ్చే బహుమతి నీకు ఉపయోగపడుతుందని.. ఆ పాదరక్షలు నేను కుట్టినవి కావు అని చెప్పాను’ అన్నాడు చిన్నయ్య. ‘నీ సాయం మరువలేనిది నీకు నా ధన్యవాదాలు. ఇకమీదట నేను కూడా మన్నికైన పాదరక్షలు కుడతాను. మా అమ్మాయి పెళ్లికి నేను, నా భార్య మీ ఇంటికి వచ్చి పిలుస్తాము’ అన్నాడు పెద్దయ్య. ‘అలాగే పెద్దయ్యా!’ అన్నాడు చిన్నయ్య.
- యు.విజయశేఖర రెడ్డి,
హైదరాబాద్.








కామెంట్‌లు (0)