mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్తు ... మహా విపత్తు!

2 గంటల క్రితం

ముప్పు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటే, ఆ యువత భవిష్యత్తు ఇప్పుడు డ్రగ్స్ మాయలో చిక్కుకునే ప్రమాదం పెరుగుతోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విస్తరిస్తుండగా, భారత్ కూడా దీనికి అతీతం కాదు. క్షణికానందం కోసం ప్రారంభమయ్యే ఈ వ్యసనం చివరకు వ్యక్తి జీవితాన్నే కాదు.. కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తోంది. అందుకే మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వాలతో పాటు కుటుంబాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలి.


​ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు 1987 నుంచి ప్రతి ఏడాది జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా "అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం" నిర్వహిస్తున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, వాటి వల్ల సమాజంపై పడుతున్న తీవ్ర ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్యాలు, నేరాల కార్యాలయం నివేదిక ప్రకారం ప్రపంచంలో సుమారు 29.2 కోట్ల మంది మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. గత దశాబ్దంలో ఈ సంఖ్య దాదాపు 20 శాతం పెరిగింది. గంజాయి, ఓపియాయిడ్స్, అంఫెటమిన్లు, కొకైన్, సింథటిక్ డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగం అనేక దేశాల్లో పెరుగుతోంది. ఈ జాడ ఇప్పుడు మన రాష్ట్రంలోనూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే, ఈ సమస్యను కేవలం పోలీసు చర్యలతోనే పరిష్కరించడం సాధ్యం కాదు. విద్యాసంస్థలు, మత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు, మీడియా, ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే ఈ ముప్పును అరికట్టడం సాధ్యమవుతుంది.

నిర్మూలనే కీలకం

ప్రస్తుతం కొందరు యువత పెడదోవ పట్టి సులభంగా మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవడం వల్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దెబ్బతింటోంది. క్షణికానందం కోసం ప్రారంభమైన ఈ వ్యసనం చివరకు చదువు, ఉపాధి, కెరీర్‌తో పాటు ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. వారిపై ఆధారపడిన కుటుంబాలు మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకే ముందుగా యువత, విద్యార్థి లోకాన్ని ఈ ముప్పు నుంచి కాపాడాలి. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే పూర్తి దృష్టి సారించాలి. చదువుతో పాటు ఖాళీ సమయాల్లో క్రీడలు, కళలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో చురుగ్గా పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలి. ఒత్తిడికి లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మత్తు పదార్థాల నివారణలో కేవలం పోలీసుల పాత్రే కాదు.. సమాజం మొత్తం భాగస్వామి కావాలి. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా లేదా వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించడం ప్రతి పౌరుడి బాధ్యత.​

సామాజిక బాధ్యతగా...

ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోలసానిపల్లిలోని బోస్కో డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా నవజీవన్ బాల భవన్ మాదక ద్రవ్యాలు, మద్యం, ఇతర వ్యసనాల బారిన పడిన వ్యక్తులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ కేంద్రంలో వ్యసన బాధితులకు సమగ్ర చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందుతున్నాయి. నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాదర్ పి. తంబి జోసెఫ్ నాయకత్వంలో ఈ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలు, బెట్టింగ్ యాప్‌లు, మొబైల్ వ్యసనాల దుష్పరిణామాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నాం. ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ మాయలో పడకుండా చూడడం మనందరి బాధ్యత. మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించరాదు. బెట్టింగ్ యాప్‌లకు కూడా ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. ఎవరైనా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నా లేదా వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.

​ఇవి పాటించాలి!

• పాఠశాల స్థాయి నుంచే జీవన నైపుణ్యాల విద్యను అందించాలి. డ్రగ్స్ ప్రమాదాలపై పాఠ్యాంశాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలను తప్పనిసరి చేయాలి.

• ప్రతి కళాశాలలో యాంటీ-డ్రగ్ క్లబ్‌లను ఏర్పాటు చేసి, విద్యార్థులనే అవగాహన రాయబారులుగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులకు డ్రగ్స్ వినియోగం ప్రారంభ సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక అవగాహన కల్పించాలి.

• సోషల్ మీడియా, డార్క్ వెబ్, ఆన్‌లైన్ డ్రగ్ నెట్‌వర్క్‌లపై నిఘా మరింత పెంచాలి. యువతకు క్రీడలు, కళలు, వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా సానుకూల అవకాశాలు కల్పించాలి.

• డీ-అడిక్షన్, పునరావాస కేంద్రాలను విస్తరించి, వ్యసనానికి గురైన వారిని నేరస్థులుగా కాకుండా చికిత్స అవసరమైన వ్యక్తులుగా చూడాలి. గ్రామ స్థాయిలో ప్రజలు, పోలీసులు, ఉపాధ్యాయులు కలిసి కమ్యూనిటీ విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టాలి.

జి.శేఖర్_ బాబు
– గోళ్ళమూడి శేఖర్ బాబు

ప్రోగ్రామ్ మేనేజర్, నవజీవన్ బాల భవన్, విజయవాడ


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్