mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెనిజులా విషాదం!

2 గంటల క్రితం

venezuela-earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

205వ కారబోబో యుద్ధ విజయ దినోత్సవ వేడుకలు జరుపుకున్న మరుసటి రోజునే వెనిజులా తీవ్ర విపత్తును ఎదుర్కోవాల్సి రావటం విషాదకరం. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున వెంటవెంటనే సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. రిక్టర్ స్కేలుపై 7కు పైగా నమోదైన వరుస ప్రకంపనలతో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు. 970 మందికిపైగా గాయపడ్డారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ నష్టం మరింత స్పష్టమవుతోంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, అనేక మంది శిథిలాల కింద ఉండి ఉండొచ్చని పరిశీలకుల మాట. ఇప్పటికే ఎన్నో సంక్షోభాలతో సతమతమవుతున్న వెనిజులా ప్రజలకు ఈ భూకంపం మరో తీవ్రమైన దెబ్బ. కరీబియన్ ప్లేట్, దక్షిణ అమెరికా ప్లేట్‌ల సరిహద్దులో వెనిజులా ఉండటంతో అక్కడ తరచూ భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతం భూకంపాలకు అత్యంత సున్నితమైనది. 1997లో కారియాకో ప్రాంతంలో సంభవించిన విధ్వంసకర భూకంపం తర్వాత మళ్లీ ఇంతటి తీవ్రతతో దేశం కుదేలవడం ఇదే!

సుమారు మూడు కోట్ల జనాభా కలిగిన వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక నిర్ధారిత చమురు నిల్వలు కలిగిన దేశం. అపార సహజ వనరులు ఉన్నప్పటికీ, చమురు కంపెనీల దోపిడీ, అమెరికా తరచూ సృష్టించే రాజకీయ అస్థిరత, ఆర్థిక ఆంక్షల కారణంగా దీర్ఘకాలిక సంక్షోభంలో చిక్కుకుంది. 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చమురు కంపెనీలను జాతీయం చేశారు. ఆ ఆదాయంతో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఈ పరిణామాలు నచ్చని అమెరికా నేరుగా జోక్యం చేసుకొని అనేక కుట్రలు రచించింది. తనకు అనుకూల శక్తులను పెంచి పోషించి, రాజకీయ అస్థిరత సృష్టించింది. అయినా, ప్రజలు వీధుల్లోకి వచ్చి చావెజ్‌కు అండగా నిలిచారు. 2013లో చావెజ్ మరణించిన తరువాత నికోలాస్ మదురో అధ్యక్షుడయ్యారు. అమెరికా తన కుట్రలు కొనసాగిస్తూనే ఉంది. ఆ సమయంలో చమురు ధరలు పడిపోవడం, ద్రవ్యోల్బణం, ఆహార-మందుల కొరత, అంతర్జాతీయ ఆంక్షలు కలిసి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి. 2026 జనవరి 3న అమెరికా బరితెగించి, అప్రజాస్వామిక సైనిక చర్యలో అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అపహరించుకుపోయింది. రాజకీయ అస్థిరతను సృష్టించి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక శక్తులను గద్దెనెక్కించాలని అనుకున్నా ఫలించలేదు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న రోడ్రిగ్‌ యే ఇప్పుడు పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. అమెరికా వివిధ ఒత్తిళ్లు తెచ్చి చమురు ఉత్పత్తి సంస్థలపై పెత్తనం చెలాయిస్తోంది. దేశంలో అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. ఆరోగ్య, విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు సంక్షోభంలో ఉన్నాయి. ఇప్పుడు సంభవించిన ప్రకృతి విపత్తు దేశంలోని ముఖ్య పట్టణాలను అతలాకుతలం చేసింది. పరిమిత వనరులతో నెట్టుకొస్తున్న దేశానికి ఇప్పుడు పునర్నిర్మాణం కూడా పెద్ద సవాలుగా అవుతుంది. కాగా, భారత్‌కు అత్యధిక ముడి చమురు సరఫరా చేసే దేశాల్లో వెనిజులా మూడో స్థానంలో ఉంది. అందువల్ల ఈ భూకంపం, దాని అనంతర పునర్నిర్మాణం చమురు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం చూపితే, మన దేశం కూడా సమస్యను ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ప్రపంచంలోనే అత్యధికంగా జపాన్‌లో ఏడాదికి 1,500 వరకు గుర్తించగలిగిన భూకంపాలు సంభవిస్తాయి. అయినప్పటికీ ప్రాణనష్టం అరుదుగానే జరుగుతుంది. భూకంపాన్ని ఎదుర్కొనే సంసిద్ధతను వారు జీవన విధానంలో భాగంగా మార్చుకోవడం అందుకు కారణం. భూకంప నిరోధక ప్రమాణాలతో భవనాల నిర్మాణం, అత్యాధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పాఠశాల స్థాయి నుంచే విపత్తు నిర్వహణపై శిక్షణ, తరచూ నిర్వహించే మాక్ డ్రిల్లులు, ప్రజల్లో అప్రమత్తత - ఇవన్నీ కలిసి నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. భూకంప సంభవిత ప్రాంతంలో ఉన్న వెనిజులా వంటి దేశాలు కూడా ఈ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వెనిజులాకు అత్యవసరంగా కావాల్సింది మానవతా సహాయం. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించడం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, తాగునీరు, ఆహారం, మందులు, వైద్య సేవలు అందించడం అత్యంత ప్రాధాన్యమైన పని. ఐక్యరాజ్యసమితి, రెడ్‌క్రాస్, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచ దేశాలు సహాయక చర్యలను వేగవంతం చేయాలి. సంక్షోభాలతో ఇప్పటికే అలసిపోయిన వెనిజులా ప్రజలను ఈ విపత్తు నుంచి గట్టెక్కించడం ప్రపంచ సమాజం పంచుకోవాల్సిన మానవీయ బాధ్యత. అదే సమయంలో అమెరికా, దాని వత్తాసు కంపెనీలు ఈ విపత్తును ఒక అవకాశంగా తీసుకొని మరిన్ని రంగాల్లోకి జొరబడకుండా అప్రమత్తత అవసరం!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్