" రాందేవు బాబా అంతటోడు ఒచ్చిన యోగా మీటింగ్లో, మన ' కెమెరామెన్ మంగతో రాంబాబు' (పవన్ సినిమా పేరు) రాకపోవడం ఏం బాగా లేదన్నా! ఎన్ని చానల్లు.. ఎన్ని కెమెరాలు..లైవులూ ..అబ్బబ్బబ్బా! ఏం పబ్లిసిటీ...రెండు రోజులూ! మనోడు శానా మిస్సయిపోతన్నాడు"
" ఈ మద్దిన బాగా బిజీ గదా! ఆంధ్రాలో ఒక్కాలూ.. తెలంగాణలో ఒక్కాలూ.. ఢిల్లీలో మరో కాలు! వోమనవతారమెత్తీసినాడు.. తీరికుండొద్దేటీ? ఎంతకి.. ఇమానాల్లో తిరిగినా..ఎక్కీ దిగడం ఎంత కష్టం? పువ్వు లాటి వొళ్ళు..పులిసిపోదేటీ!!"
" డిల్లీ వోళ్లకి పొల్యూషన్ వల్ల కళ్ళు ఆరుద్ర పురుగులైపోయి..ముక్కులు పండు మిరపగాయలైపోతుంటే.. ఇక్కడి గాఢత..సౌతోళ్లకి తెలీదంతాడేటీ! ఈ మద్దినే ముక్కాపరేషనూ..ఎలాగ..పసిగట్టీసినాడో! అంతా మనోడిదొక సిత్రం "-- విసుక్కున్నాడు పరదేశి.
" ఒరే! మణిపూరు ఆడోళ్ళని కట్టుబట్టల్లేకుండా, ఎంటబెట్టి కొడితేనే ఎళ్లి సూడని ప్రెధానమంత్రి.. మనోడి ముక్కు పరామర్శికి ఇంటికొచ్చేసినాడంటే.. దాని అర్థమేటీ ! మన పవర్ స్టార్ ముక్కుకున్న పవరు అలాటిదీ "-- నోట్లోనే సుట్టని సున్నాల్లాగా తిప్పుతూ, రింగెనక రింగ్..పొగలొదుల్తూ, తోట వైపు కదిలాడు నాయుడు.
" ఏటో! మోడీగోరి కోటు సెంటుకి ముక్కు సరిగా..పని సెయడం మానీసింది గావాలా!"--పచ్చగడ్డి మీద కూలబడ్డాడు పరదేశి.
నాయుడు కూడా పడక్కుర్చీలో నడుం చేరేశాడు.
"అవునన్నా! మన స్టీల్ ప్లాంట్లో తొమ్మండుగురు సచ్చిపోయినా రాలేదు.. క్రిష్ణలంకలో ఇద్దరు కుర్రోలు సచ్చినా ఇళ్లకెళ్లలేదు. సావు పరామర్శలకి మన పెద బాబు మరెళ్లడు గావాలా!"
"రెండు రోజులు యోగా ఎందుకు పనికొచ్చింది.. ఎళ్లకుండా ఉండడానికే! అయినా, మోడీ యోగం అవుసరం గానీ, సావు రాగం దేనికిరా? సినబాబుని ఒదులుతున్నాడు గదా.. అన్నిటికీ!"
" అవునవునూ.. ఆవూ దూడల్లాగా, దావోసెల్లిన నాటి నుంచి సూస్తన్నాను గదా! కేంద్ర మంత్రుల నుంచి బెంగాలు ముఖ్యమంత్రి వరకూ.. నిన్న రష్యా..రేపు కొరియా..తిరిగేస్తన్నాడు సింగిల్ గానే సినబాబు "
" కుర్సీ ఎక్కించే ముందు కూసు విజ్జెలన్నీ నేర్పాలి గదరా ఏ తండ్రయినా! "
" అదేనన్నా! మనోడు ఉప ముఖ్యమంత్రి గదా! ప్రోటోకాలున్నా ఎనకబడిపోతున్నడనే... నా బాధ"-- వెళ్లగక్కాడు పరదేశి.
" ఒరే ఎర్రోడా! ఆ పదవొక సింగారం. పేరుకి నాలుగు శాఖలు.. ఆటివల్ల ఒరిగిందేటి?.. నేనొక వంట సెయమంటాను.. ఊహించుకుని సేస్తావా?"...
తలూపాడు పరదేశి.
" ఎలిగించిన పొయ్యి మీద, కాసిన్ని నీళ్లతో కళాయి పెట్టి కొంతసేపు మరిగించు.. నూక ఏస్కో..నూనో..నెయ్యో ఏస్కో..శెనగ పలుకులో.. జీడిపప్పో ఏస్కో..పచ్చి మిరపగాయలు, ఉల్లిపాయల ముక్కలేస్కో.. గరిటెతో బాగా తిప్పు..ఏటయిందిప్పుడు?"
" ఏటయింది..ఉప్మా!"
" నాలుగు శాఖల ఉపముఖ్యమంత్రి అంటే అదే!"-- నవ్వాడు నాయుడు.
" సివరాఖరికి ఉప్మా ముఖ్యమంత్రా!"--మనసు
చివుక్కుమన్నది పరదేశికి.
" మరేటుంది ?
పంచాయితీ రాజ్యం.. పైసలు పూజ్యం.. గ్రామీణాభివృద్ధి .. సొమ్ములు లేవు.. సమృద్ధి.. సైన్సు, టెక్నాలజీ, పొల్యూషను.. ఎక్కడా దొరకని సొల్యూషను..
పేరుకి ఫారెస్ట్.. మైనింగూ, స్మగ్లింగూ.. పేద్ద వరస్ట్.. బాక్సయిటు బాక్సింగూ "
" ఆహా.. ఆహా.. అన్నా..ఏటన్నా..నీ నోట కయిత్వమా! ఎప్పుడొచ్చేసింది? కాళిదాసు నాలిక మీద అమ్మోరు బీజాచ్చరాలు రాసేసినట్టు.. రాత్రి గాని కలలో అలాగా అమ్మొచ్చి రాసేసినాదేటి!?"--దిగ్భ్రాంతుడై, చేతులు జోడించి, వలవల ఆనంద భాష్పాలు రాల్చాడు పరదేశి.
" ఓసీ..కయిత్వమంటే ఇదేనా..ఇంతేనా!"--నమ్మలేకపోయాడు నాయుడు.
" అంతేనన్నా ఇటిక మీద ఇటికనుకో.. ఇదే కయిత్వం కిటుకు!"
" గొప్ప మాట అనీసి నా మనుసుని గొప్ప ఖషీ సేసేసినావురా!"
" అదిగో..ఖషీ అనగానే మళ్లా గుర్తొచ్చీసీనాడు మనోడు!"
" ఒరేయ్.. ఎవరో చెబితే సేసే యాక్షను మనోడిది. మన పెదబాబుకి యాక్షనూ..డయిరెక్షనూ.. రెండూ తెలుసు.. ఒక ఏఎన్నార్.. ఒక ఎన్టీఆర్.. ఒక ఎస్వీఆర్.. అప్పుడప్పుడు గుమ్మడి.. ఒక్కడిలోనే అందరూ ఉన్నారు. విఠలాచార్య.. దాసరి.. రాజమౌళి వరకు.. ఆయన్లో అంశలు... సింహం సింగిల్ గా ఎళ్లడమంటే ఇదీ! సినిమా డైలాగులు సెప్పడం కాదు..ఎళ్లెళ్లు.. మొన్న భీమిలి ఎళ్ళినప్పుడు, కార్లో ఏదో కాస్ట్ లీ పెట్టించానన్నాడు నారాయణమూర్తి.. ఎల్లి పట్రా!"
" నారాయణ నీ నామం..ఎంతో రుచిరా!"-- పరిగెత్తాడు పరదేశి.
-' నల్లి ' కుట్టు








కామెంట్‌లు (0)