mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్యూబా సిద్ధంగా ఉంది

2 గంటల క్రితం

cuba
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 05:30 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

(నిన్నటి సంచిక తరువాయి)

క్యూబా తన రాజకీయ, ఆర్థిక విధానాలను మార్చుకోవాలని, తన సోషలిస్ట్ మార్గాన్ని వదులుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనికి క్యూబా నాయకత్వం "మీరు అలాంటి విషయాల గురించి ఆలోచించనే కూడదు" అని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు తాము లొంగిపోయేది లేదని క్యూబా తెలియచెప్పింది. క్యూబాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, దాని పరిణామాలు వెనిజులా విషయంలో జరిగిన వాటి కంటే భిన్నంగా ఉంటాయని సి.ఐ.ఎ కు పూర్తిగా తెలిసినట్లుంది.

కేవలం కోటి పది లక్షల జనాభా ఉన్న క్యూబా, నిరంతరం అమెరికన్ సైనిక ముఠాల దాడి ముప్పులో ఉంది. అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న యుద్ధ సదృశ్య ఆర్థిక దిగ్బంధనం ఈ చిన్న దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించింది. దీనికి తోడు, దాదాపు ఏడాది కాలంగా వివిధ స్థాయిల్లో తీవ్ర ఇంధన కొరత కొనసాగుతోంది. ప్రస్తుతం, క్యూబాలో రోజుకు దాదాపు 22 గంటల పాటు విద్యుత్ ఉండటం లేదు. ముఖ్యంగా ఆర్థికంగా క్లిష్టమైన జీవన పరిస్థితులను సృష్టించిన అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ క్యూబన్లు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ తిరుగుబాటు చేయలేదు. ఇక్కడ త్వరలోనే అధికార మార్పిడి జరుగుతుందని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ శక్తులు చాలా కాలంగా తప్పుడు అంచనాలు వేస్తున్నాయి. కానీ ఆ అంచనాలు పదే పదే విఫలమవుతున్నాయి. ఎందుకని?

ఆ దేశంలోని కార్మికులు, యువకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అక్కడ వున్న అన్ని వర్గాల ప్రజలలో కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ఓపికతో కూడిన బలమైన రాజకీయ ప్రతిఘటనా కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా క్యూబా అంతటా తొమ్మిది పేజీల బుక్‌లెట్‌ను పంపిణీ చేస్తున్నారు. అమెరికా అనుచిత జోక్యంతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య సైనిక దురాక్రమణ ఎదురైతే దానిని ఎదుర్కొనేందుకు ఆచరణాత్మక చర్యలతో కూడిన 'ఫ్యామిలీ గైడ్'ను సివిల్ డిఫెన్స్ ప్రచారం చేసింది. ఇందులో 'రక్షించడం, ప్రతిఘటించడం, మనుగడ సాగించడం, విజయం సాధించడం' కోసం ప్రతి క్యూబన్ చేపట్టాల్సిన విధులను వివరించింది. వైమానిక దాడి జరిగితే సురక్షిత ప్రాంతానికి ఎలా వెళ్ళాలి, ప్రథమ చికిత్స ఎలా అందించాలి, క్యూబా గడ్డపై అమెరికా దురాక్రమణకు పాల్పడితే ఎలా రక్షించుకోవాలి, అమెరికాను ఎలా ఓడించాలి అనే విషయాలపై వివరణాత్మక సూచనలు ఉన్నాయి.

​ రావుల్ కాస్ట్రో - ఒక విప్లవ పోరాట యోధుడు

​ కొంతమంది రావుల్ కాస్ట్రోను విప్లవ నాయకుడు ఫైడెల్ కాస్ట్రో తమ్ముడిగా మాత్రమే భావిస్తారు. నిజానికి, రావుల్ కాస్ట్రో క్యూబా విముక్తి కోసం జరిగిన అన్ని పోరాటాలలో ఫైడెల్ కు అండగా నిలబడిన ఒక గొప్ప విప్లవ పోరాట యోధుడు. ఆధునిక క్యూబా విప్లవం మొదటి దశ 1953 జులై 26న శాంటియాగో డి క్యూబా లోని 'మొంకాడా బ్యారక్స్' పై జరిగిన ఆకస్మిక దాడితో ప్రారంభమైంది. ఆ సమయంలో ఫైడెల్ వయస్సు 27 సంవత్సరాలు, రావుల్ వయస్సు 22 సంవత్సరాలు. మొంకాడా పోరాటాన్ని అణచివేసిన తర్వాత, ఇతరులతో పాటు ఫైడెల్, రావుల్‌లను అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఫైడెల్ స్వయంగా చేసిన వాదనలు ఇప్పుడు 'హిస్టరీ విల్ అబ్సాల్వ్ మి' (చరిత్ర నన్ను విముక్తుడిని చేస్తుంది) అనే ప్రపంచ ప్రసిద్ధ పుస్తకంగా అందుబాటులో ఉన్నాయి.

​ వారి విడుదల కోసం ప్రజా నిరసనలు వ్యక్తమవడంతో, సుదీర్ఘ జైలు శిక్ష తర్వాత ఫైడెల్, రావుల్ తదితర కామ్రేడ్లు విడుదలయ్యారు. క్యూబన్ బృందం తలదాచుకోవడానికి వెళ్ళిన మెక్సికో లోనే, ప్రపంచ యువతకు శాశ్వత స్ఫూర్తిగా నిలిచిన విప్లవ వేగుచుక్క చే గువేరాను వారు కలుసుకున్నారు. 'చే'ను ఫైడెల్ కు పరిచయం చేసింది రావుల్ కాస్ట్రోనే. ఆ తర్వాత జరిగింది అంతా చరిత్ర.

​ ఫైడెల్, రావుల్, చే గువేరా లు మరో 80 మందికి పైగా పోరాట యోధులతో కలిసి "గ్రాన్మా" అనే నావలో క్యూబాకు పయనమయ్యారు. విప్లవాన్ని విజయవంతం చేయడానికి వారు సియెర్రా మేస్త్రా పర్వతాల అడవులలో సాగించిన గెరిల్లా యుద్ధాన్ని, గ్రామీణ ప్రాంతాల ప్రజా నిరసనలతో మిళితం చేశారు. ఇందులో ఫైడెల్, చే, రావుల్, కామిలో సియెన్‌ ఫ్యూగోస్ ప్రధాన పాత్ర పోషించారు. రావుల్ కాస్ట్రో ఫైడెల్ కంటే ముందే మార్క్సిజంతో, కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయం కలిగి ఉన్నారు. ఆ సమయంలో క్యూబా లోని కమ్యూనిస్ట్ పార్టీని 'పాపులర్ సోషలిస్ట్ పార్టీ' అని పిలిచేవారు. దాని యువజన విభాగానికి నాయకుడిగా, రావుల్ కాస్ట్రో 1953లో వియన్నాలో జరిగిన ప్రపంచ యువ జనోత్సవంలో పాల్గొన్నారు.

ఆర్థిక దిగ్బంధనం

​ ధైర్యానికి మారు పేరైన క్యూబా అనే చిన్న దేశంపై నేరుగా దాడులు చేసే యుద్ధ ప్రణాళికను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో, క్యూబాతో ఎలాంటి ఆర్థిక, వాణిజ్య ఉమ్మడి భాగస్వామ్యాలు కలిగి ఉన్న దేశాలపై అయినా 'సెకండరీ' ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ ఆంక్షలు క్యూబాలోని పర్యాటకం, విమానయానం, షిప్పింగ్, మైనింగ్, ఇంధనం, ఆరోగ్యం, ఔషధ తయారీ రంగాలలో వర్ణించలేని సంక్షోభాన్ని, స్తబ్దతను సృష్టిస్తున్నాయి.

ఉదాహరణకు, కెనడాకు చెందిన ప్రముఖ బహుళజాతి మైనింగ్ సంస్థ 'షెరిట్ ఇంటర్నేషనల్' దశాబ్దాలుగా క్యూబాలో నికెల్, కోబాల్ట్ మైనింగ్ చేస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా అది క్యూబా నుండి తప్పుకుంటోంది. ఉమ్మడి భాగస్వామ్యంలో తాను పెట్టుబడి పెట్టిన 277 మిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వాలని ఆ కెనడియన్ కంపెనీ క్యూబాను కోరింది. అమెరికా ఆంక్షల వల్ల క్యూబా ఏటా రూ.66,775 కోట్ల నుండి రూ.76,314 కోట్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా. ఆరు దశాబ్దాలకు పైగా జరిగిన మొత్తం నష్టం రూ.152.63 లక్షల కోట్లు (160 బిలియన్ డాలర్లు). అమెరికా ఆంక్షలు క్యూబాకు పొరుగున ఉన్న వెనిజులా, మెక్సికోల నుండి ముడి చమురు రాకుండా కూడా అడ్డుకుంటున్నాయి.

క్యూబా విముక్తి పోరాటం తర్వాత జన్మించి, ఆ దేశ విప్లవానంతర తరానికి ప్రతినిధిగా నిలిచిన మిగెల్ డియాజ్-కానెల్ ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా, క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శిగా ఉన్నారు. ట్రంప్ బెదిరింపులపై ఆయన స్పందిస్తూ: "దేశ సార్వభౌమాధికారం చర్చల అంశం కాదు; మేము లొంగిపోము. మాకు యుద్ధం వద్దు. కానీ మేము సిద్ధంగా ఉంటాము. మా జీవితాలను విప్లవానికే అంకితం చేస్తాము" అని ప్రకటించాడు.

​ పార్టీ కాంగ్రెస్‌లో జరిగిన భావోద్వేగ ముగింపు ప్రసంగంలో, రావుల్ తన అన్న ఫైడెల్ లాగే వయస్సు పైబడటం వల్ల తాను పరిపాలనా నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. "కొత్త తరం ప్రధాన బాధ్యతలను స్వీకరించడానికి ఇది సమయం. నేను నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను. కానీ మన దేశం, విప్లవం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటే, మీతో కలిసి పోరాడటానికి నేను ఒక సాయుధ స్వచ్ఛంద సేవకుడిగా మీతో కలిసి ఉంటాను" అని శక్తివంతంగా, ధైర్యంగా ప్రకటించాడు.

​ ఇప్పుడు, ఆ పోరాట యోధుడి 95వ పుట్టినరోజు జరిగిన కొద్ది రోజుల్లోనే సామ్రాజ్యవాద డేగ ఆయనను లక్ష్యంగా చేసుకుంటుండగా, యువకులు, పిల్లలు, వృద్ధులు క్యూబాలోనే కాకుండా అమెరికాతో సహా ఇతర దేశాలలో కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. క్యూబాపై దాడి చేయాలనే అమెరికా ప్రభుత్వ ప్రణాళిక అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ ఖండించింది. అమెరికన్ ఉద్యమం 'పాస్టర్స్ ఫర్ పీస్' (శాంతి కోసం సువార్తికులు) క్యూబాకు సంఘీభావం ప్రకటిస్తూ ముందు వరుసలో నిలిచింది.

​ మే 22 నుండి 24 వరకు ఢిల్లీలో జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం క్యూబా సంఘీభావ కార్యక్రమాలను మరింత విస్తృత పరచాలని నిర్ణయించింది. ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన వెనువెంటనే ట్రంప్ క్యూబా మీద దృష్టి సారించే అవకాశాలు ఉన్న రీత్యా ఈ అంశానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలి. క్యూబాను వశం చేసుకోవడం తన కల అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. క్యూబా తీరానికి అమెరికన్ యుద్ధ వాహక నౌక నిమిట్జ్ ను పంపాడు. క్యూబా నాయకత్వం ఆ భయంతో దారికి వస్తారని పగటి కలలు కన్నట్లున్నాడు. సామ్రాజ్యవాదం తమ మీద దాడి చేస్తే క్యూబా వీరోచిత శక్తి ఏమిటో చవి చూపిస్తాం అని సోషలిస్టు క్యూబా నాయకత్వం ప్రకటించింది.

​ క్యూబా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఇవాళ క్యూబాకు కావలసింది బలమైన అంతర్జాతీయ సంఘీభావం. క్యూబా ఒంటరిది కాదు, ప్రగతిశీల మానవాళి దానికి అండగా నిలుస్తుంది. నేటి క్యూబన్ పోరాట యోధులు, జోస్ మార్టి, ఫైడెల్, చే, కామిలో సియెన్‌ ఫ్యూగోస్, ఫ్రాంక్ పాయిస్‌ ‌ల వారసులు తమ పూర్వీకుల వీరోచిత ఆదర్శాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉంటారని ఆశిద్దాం.

​ మలయాళ మేధావి, కథకుడు పాల్ జకారియా కొంతకాలం క్రితం క్యూబాను సందర్శించారు. అమెరికా ఆంక్షలు సృష్టించిన ఇబ్బందులు వున్నప్పటికీ, ఆయన అక్కడ చూసిన జీవిత విశేషాలను ప్రముఖంగా పేర్కొన్నారు: దొంగలు లేని సమాజం. సాధారణ సమానత్వం వర్ధిల్లుతోంది. నల్ల జాతీయులు, తెల్ల జాతీయుల మధ్య ఎలాంటి వివక్ష లేదు. పెట్టుబడిదారీ విధానంలోని కొన్ని అంశాలను సమర్థించే తాను, క్యూబాలో చూసింది నిజంగా సోషలిజమే అయితే, తాను కూడా సోషలిజంతో ఏకీభవిస్తానని ఆయన అన్నారు.

​ ప్రపంచంలో ఏ దేశం మీద అయినా వాణిజ్య సుంకాల యుద్ధం గానీ, ప్రత్యక్ష యుద్ధం గానీ చెయ్యగల ఏకైక శక్తిమంతుడిని తానని ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే క్యూబా మీద ప్రత్యక్ష జోక్యానికి ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అదే జరిగితే ప్రపంచ రాజకీయాలలో వివిధ తలాల్లో నిర్ణయాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇరాన్ తో ఒప్పందం కుదరగానే క్యూబాకు విముక్తి ప్రసాదించడం తన తదుపరి లక్ష్యం అని ట్రంప్ ప్రకటించాడు. క్యూబా లో సోషలిస్టు వ్యవస్థను నాశనం చెయ్యడమే అమెరికన్ సామ్రాజ్యవాదుల లక్ష్యం. వెనిజులా మాదిరి క్యూబాను నాటకీయంగా లొంగదీసుకోవచ్చని ట్రంప్, మార్కో రుబియో కలలు కంటున్నారు. కానీ క్యూబా ప్రజానీకం ఐక్యంగా ఇటువంటి ప్రయత్నాలను తుదికంటా ప్రతిఘటిస్తారు. ప్రపంచం క్యూబా ప్రజానీకానికి అండగా నిలుస్తుంది.

​ అందుకే ప్రతి పట్టణం, పల్లెలో, ప్రతి ఫ్యాక్టరీలో, కాలేజీలో, విశ్వ విద్యాలయంలో, ఆట స్థలాలలో, గ్రంథాలయాల్లో, పొలాల్లో, కళలు, సాంస్కృతిక రంగాల్లో క్యూబా ఒంటరి కాదు, క్యూబాలో వేలు పెట్టొద్దు, రావుల్ మీద చెయ్యి వెయ్యడానికి లేదు అన్న నినాదాలు మార్మోగాలి. ఎల్లెడలా క్యూబాకు సంఘీభావం ప్రకటించాలి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వేల వేల పిడికిళ్లు బిగవాలి. ​ సోషలిస్టు క్యూబా వర్ధిల్లాలి, అంతిమ విజయం సాధించాలి.

m.a baby

వ్యాసకర్త -సి.పి.ఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్