mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాటల్లోనే ప్రత్యేక మామిడి బోర్డు

3 గంటల క్రితం

mango
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ఉత్పత్తిదారుగా 40-45 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, అందులో సింహభాగం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంది. నేల స్వభావం మామిడికి అనుకూలం కావడంతో ఎక్కడ లేనన్ని మామిడి రకాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంటే, గిట్టుబాటు ధర అథఃపాతాళంలో ఉంది. ఏటా సీజన్ ప్రారంభంలో ఆశలు రేకెత్తించే ధరలు, కోత సమయానికి కిలో రూ.8 నుంచి 5 రూపాయలకు పడిపోవడం పునరావృతం అవుతోంది. ఈ ఏడాది సైతం ఏడాది పొడవునా పండించిన మామిడి పంటకు కేవలం కిలో రూ.7 ధర నిర్ణయించడం బాధాకరమని, వ్యవసాయ శాఖపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్పు ఫ్యాక్టరీలైతే రూ.5 కే కొనుగోలు చేసేందుకు దళారుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయి. కిలోకు రూ.15 ఇవ్వకపోతే రోడ్లపైనే పండ్లు పారబోసుకోవాల్సి వస్తుందని, భారీ చెట్లను నరుక్కోవాల్సిందేనని రైతులు లబోదిబోమంటున్నారు. రాయలసీమను 'ఉద్యానవన హబ్`గా తీర్చిదిద్దుతామని విజయోత్సవ వేడుకల్లో ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప, ఆచరణలో మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేని చేతగాని ప్రభుత్వమని, ఎవరిని నమ్మించడానికి ఈ విజయోత్సవ సభలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో70 వేల హెక్టార్లలో తోతాపురి, మరో 42వేల హెక్టార్లలో బంగినపల్లి, నీలం రకాలు సాగవుతున్నాయి. ప్రతి ఏటా సగటున 7.50 లక్షల టన్నుల మామిడి కాయలు మార్కెట్టుకు వస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 5 లక్షల టన్నులు తోతాపురి రకమే కావడం విశేషం. మిగిలిన 2.50 లక్షల టన్నులు ఇతర రకాలు. ఈ సాగుపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 4 లక్షల మంది కూలీలు, రవాణాదారులు, హమాలీలు ఆధారపడి బతుకుతున్నారు. వీరిలో మామిడి రైతులు 70 వేల మంది ఉన్నారు. ఇంతటి ఉపాధిని కల్పిస్తున్న సుసంపన్నమైన రంగాన్ని పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత

స్వయానా పూతలపట్టు ఎంఎల్ఎ, వామపక్షాలు సైతం మామిడి పల్పును అంగన్వాడీ సెంటర్లలోనూ, మధ్యాహ్న భోజనంలోనూ, తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ, అసెంబ్లీలోనూ సరఫరా చేయడం ద్వారా 'లోకల్`గానే పల్పు 'గిట్టుబాటు` అవుతుందని గత రెండేళ్లుగా చర్చ చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి.

సంక్షోభ నివారణకు చర్యలు?

మామిడి రైతు సమస్యను తాత్కాలిక ఉపశమనాలతో కాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ చూపి_ వ్యవస్థాగత మార్పులు చేపట్టాలి. రాష్ట్రంలో, ముఖ్యంగా చిత్తూరును కేంద్రంగా చేసుకుని ‘ప్రత్యేక మామిడి బోర్డు’ను ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ఉంటేనే సాగు విస్తీర్ణం, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఒక స్పష్టమైన నియంత్రణ, పరిశోధనలు సాధ్యమవుతాయి. దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే, ప్రభుత్వమే సహకార సంఘాల ఆధ్వర్యంలో మామిడి గుజ్జు పరిశ్రమలను స్థాపించి నిర్వహించాలి. దీనివల్ల లాభాలు నేరుగా రైతు ఖాతాకే చేరుతాయి. మామిడి అనేది త్వరగా కుళ్లిపోయే, పాడైపోయే పంట కావడం వల్ల దళారులు చెప్పిన తక్కువ ధరకే రైతు అమ్ముకోవాల్సిన నిస్సహాయ స్థితి ఉంది. ప్రధాన సాగు మండలాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తే, ధర బాగున్నప్పుడు అమ్ముకునే వెసులుబాటు రైతుకు కలుగుతుంది.

సీజన్ అంతా చర్చలతోనే...

రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ జూమ్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ 'వచ్చే వారం ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కరెక్టుగా కోత దశలో అధికార, పాలక యంత్రాంగం మేల్కొని తూతూ మంత్రంగా చర్చలు, సమావేశాలు జరిపి ఏటేటా మామిడి రైతును నట్టేట ముంచుతూనే ఉన్నాయి తప్ప, గిట్టుబాటు ధర కల్పించిన పాపాన పోవడం లేదు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి వరకూ తమ వద్ద నిల్వలు ఉన్నాయని కార్పొరేట్ స్థాయి కోకాకోలా ప్రతినిధులు చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం పండిన పంటకే గిట్టుబాటు ధర లేదని చెట్లను రైతులు నరికేస్తుంటే, ఉత్పాదకత పెంచాలని సమీక్షలు చేయడం ఎవరిని ఉద్ధరించడానికో అర్ధం కాని పరిస్థితి. గిట్టుబాటు ధర కల్పించలేని పాలకులు, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తూ సీజన్ ముగింపు వరకూ మామిడి రైతుకు అన్యాయం చేస్తూనే ఉన్నారు.

- అవనిగడ్డ వనజ,

సెల్‌: 9490099261​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్