mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లాకప్ డెత్ !

2 గంటల క్రితం

lockup death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

"జై భీమ్" సినిమాలో సెంగేణి తన భర్త రాజాకన్ను కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి దిగుతూ, 'నా మనిషి ఎక్కడ?' అని అడిగిన ప్రతి ప్రశ్న ప్రేక్షకుల గుండెలను తాకుతుంది. ఇది వాస్తవ కథే. అయినా సినిమా కథగానే మనకు తెలుసు. కానీ నిజ జీవితంలో నేడు విజయవాడలో ఓ తల్లి 'నా కొడుకు ఎక్కడ?' అని అడుగుతుంటే, తెరపై చూసిన ఆ దృశ్యమే వాస్తవ జీవితంలో మళ్లీ కళ్లముందు కదలాడుతోంది. తేడా ఒక్కటే... అక్కడ అది కథ, ఇక్కడ ఒక తల్లి కన్నీటి వ్యధ. ఆ తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వ్యవస్థ... 'నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో` అనే హేళనతో స్పందించిందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు, అది కేవలం ఒక కుటుంబం విషాదగాథ కాదు; ప్రజాస్వామ్య మనస్సాక్షిని కుదిపేసే ప్రశ్న. పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంటుంది. భారత రాజ్యాంగం ఇచ్చిన ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలది. న్యాయాన్ని రక్షించాల్సిన చేతులే ప్రాణాలు తీస్తే, ఆ సమాజం ఆటవిక రాజ్యంగా మారుతుంది. ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది నిర్ణయించేది పోలీసు స్టేషన్ కాదు; కోర్టు. శిక్ష విధించేది లాఠీ కాదు; న్యాయవ్యవస్థ. ఇదే నాగరిక సమాజానికి పునాది.​

విజయవాడ కృష్ణలంక పోలీసులు గత నెలలో స్టేషన కు తీసుకొచ్చిన గాదె సాయికృష్ణ అదృశ్యం కావడం, అతని తల్లి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలు హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే ప్రభుత్వం స్పందించి సీఐని సస్పెండ్ చేసింది. తద్వారా సాయికృష్ణది లాకప్ డెత్ అనే ఆరోపణలను పరోక్షంగా అంగీకరించినట్లయింది. ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో సీఐ వేధింపులు భరించలేక క్రాంతికుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ ఆత్మహత్య చేసున్న సంఘటన తెలిసిందే. ఈ విధంగా స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు యువకుల మరణాలకు కారణమైన సదరు సీఐపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కేవలం సస్పెన్షన్‌తోనే చేతులు దులుపుకోవడం వెనుక ఉన్న అసలు నిజాలు నిష్పక్షపాత విచారణతోనే బయటకు రావాల్సి ఉంది. 'రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యక్తులు మంచివారు కాకపోతే అది ఫలించదు` అని అంబేద్కర్ ఒక సందర్భంలో అంటారు. ఈ మాటలు నేడు మరింత ప్రాసంగికతను సంతరించుకున్నాయి. చట్టాన్ని కాపాడాల్సినవారే అతిక్రమించారనే అనుమానం కలిగితే ప్రజల విశ్వాసం కూలిపోతుంది. ఇటీవల తమిళనాడులో వెలుగుచూసిన అజిత్ కుమార్ కస్టడీ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడ కూడా ప్రశ్న ఒక్కటే… కస్టడీలో ఉన్న వ్యక్తి ప్రాణాలకు బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నకు ఇంకా దేశం సరైన సమాధానం వెతుకుతూనే ఉంది. రాష్ట్రాలు మారవచ్చు, పేర్లు మారవచ్చు; కానీ తల్లుల కన్నీటి రంగు ఒక్కటే, కడుపుకోతా ఒక్కటే. ​

ముద్దాయిపై కేసులు వుంటే చట్టబద్ధంగా వ్యవహరించి, శిక్షలు వేయించాల్సిన పోలీసులే... చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని లాకప్ డెత్‌లు చేస్తే, ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదు. నిందితుడిగా భావిస్తున్న సిఐ ను కాపాడుతూ ఎసిపి, ఎసిపి ని కాపాడుతూ కమిషనర్, కమిషనర్‌ను కాపాడుతూ డిజిపి... ఇలా అందరూ ఈ ఘటనలో భాగస్వాములైనట్లుగా ఆరోపణలొస్తున్నాయి. పోలీసులు చేయాల్సిన పని, న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని కూడా పోలీసులే చేసేస్తే, న్యాయాన్ని రక్షించేదెవరు? పౌరహక్కులను కాపాడేదెవరు? రేపు మరో తల్లి పోలీస్ స్టేషన్ ముందు నిలబడి “నా బిడ్డ ఎక్కడ?” అని అడిగే దుస్థితి రాకూడదు. బాధితులు హైకోర్టు దాకా వెళ్లకపోయింటే ఈ ఘటన వెలుగు చూసేది కాదని ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులపై పోలీసులే విచారణ జరిపితే బాధితులకు న్యాయం జరుగుతుందా? అన్నది ప్రశ్న. నిష్పక్షపాతమైన న్యాయ విచారణ జరిగితే తప్ప ఈ సంఘటనలోని నిజానిజాలు వెలుగులోకి రావు. శాఖపరమైన విచారణలో వాస్తవాలు వెల్లడికావని, తక్షణమే న్యాయ విచారణకు ఆదేశించాలని పలువురు మేధావులు, న్యాయనిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 'ఒక దేశం ఎంత నాగరికమో తెలుసుకోవాలంటే, అది బలహీనులను ఎలా చూస్తుందో చూడాలి` అంటారు గాంధీజీ. కస్టడీలో ఉన్న వ్యక్తి ఎంతటి నేరారోపణలు ఎదుర్కొంటున్నా, అతడు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులకు అర్హుడే. అతని ప్రాణ భద్రత కూడా ప్రభుత్వ బాధ్యతే. సాయికృష్ణ తల్లి కన్నీరు ఈరోజు ఒక కుటుంబ వేదన మాత్రమే కాదు; ప్రజాస్వామ్యాన్ని సవాలు చేసే ప్రశ్న. ఒక తల్లి తన బిడ్డ కోసం వెతుకుతున్నప్పుడు, ఆమెకు కావలసింది సానుభూతి కాదు-సత్యం. ఓదార్పు కాదు- న్యాయం. ఆ న్యాయం జరిగే వరకు ఈ కన్నీటి చరిత్ర ముగియదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్