mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రాంతీయ పార్టీలపై బిజెపి బుల్డోజర్‌

3 గంటల క్రితం

reginal politics
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 06:15 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

దేశంలో తమ ఒక్క పార్టీ మాత్రమే వుండాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుందని విమర్శించారు శివసేనలో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే. ఇటీవల వివిధ పార్టీలలో వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం, గతంలో చీలికలు, విలీనం తదితర చర్చలు ముందుకొస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్య చేయడం గమనించదగింది. బిజెపి, ఆరెస్సెస్‌ల వ్యూహం లోతుపాతులు తెలియాలంటే ఈ కోణంలో ఆలోచించక తప్పదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏక కాలంలో అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీల్లో ఒకేవిధమైన పరిణామాలు సంభవిస్తున్నాయంటే వాటి వెనక స్పష్టమైన వ్యూహాలు, పాలకవర్గ ప్రభావాలు తప్పక వుండి తీరతాయి. ఈ పరిణామాలకు ముందు పరిస్థితి, రానున్న రాజకీయ సవాళ్ళను దృష్టిలో వుంచుకుని చూస్తే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

పశ్చిమ బెంగాల్‌లో కేంద్రం పరోక్ష ఆశీస్సులతో అప్రజాస్వామిక, అరాచక పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శిష్యగణం ఆమెను వదిలేసి స్వంత దుకాణం తెరచుకోవడంతో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది గానీ నిజానికి ఈ ప్రక్రియ అంతకు ఏడాది ముందే సాక్షాత్తూ దేశ రాజధానిలోనే మొదలైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దాను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్‌ చేయడం, ఆ వెంటనే ఆయన మరికొంత మందిని తోడు చేసుకుని రాజ్యసభ పక్షం మొత్తాన్ని బిజెపి లో విలీనపర్చడం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. రాఘవ చద్దా చాలా కాలంగా బిజెపిపై విమర్శలు ఆపేసి సమోసాల వంటి అంశాలే మాట్లాడుతూ వచ్చారు. పరోక్షంగా మోడీకి వత్తాసునిచ్చే పనులు చేశారు (చెప్పాలంటే కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌ కూడా కొంతకాలం అలా వ్యవహరించి తర్వాత తగ్గారు). మీడియా దీనంతటికీ చాలా ప్రచారమిచ్చింది. వీటిపై ఆ పార్టీ నోటీసు ఇస్తే రాఘవ్‌ అడ్డం తిరిగారు. రాజ్యసభలో తగినంత బలం లేక నిరంకుశ బిల్లులు ఆమోదించుకోలేక సతమతమవుతున్న బిజెపి కి కాస్త ఊపిరి పోశారు. 2019లో ఓటమి తర్వాత టిడిపి రాజ్యసభ పక్షం కూడా దాదాపుగా ఇలాగే బిజెపిలో విలీనమై పోయింది. వైసిపి పక్షం విలీనం కాలేదుగానీ సభ్యుల రాజీనామాల వల్ల టిడిపి, బిజెపి లకే మేలు కలిగింది. ఆప్‌ సభ్యులు ఆ పద్ధతినే కొనసాగించారని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. పైగా బిజెపి కి ఒకప్పుడు కంచుకోట లాంటి ఢిల్లీలో దాన్ని ఒక దశాబ్దం పాటు సవాలు చేసిన ఆప్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వం ఇలా చతికిల పడటం చాలామందిని ఆశ్చర్యపరచింది. అంటే ఆ నేతలపై అంత బలమైన శక్తులు పని చేశాయన్నది ఇక్కడ అసలు విషయం.

బెంగాల్‌లో జరిగిందేంటి?

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మోడీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా కేంద్రం ఇతర చోట్ల వలె ఇక్కడ దూకుడు ప్రదర్శించలేదు. రెండోసారి మూడోసారి మమత విజయం సాధించేందుకు అనువైన వాతావరణం కల్పించడంలో కేంద్రం పాత్ర వుందనేది వాస్తవం. హ్యాట్రిక్‌ విజయం ముచ్చట ముగిశాక ఈసారి తామే నేరుగా వచ్చి కూర్చోవాలని కమల దళాధిపతులు నిర్ణయం తీసుకోబట్టే 'సర్‌' ప్రక్రియ చాలా దారుణంగా అమలు చేశారు. 27 లక్షల ఓట్లు ఎటూ తేల్చకుండా నిరాకరించడమేగాక బంగ్లాదేశీయుల చొరబాటు పేరిట తీవ్రమైన వేట సాగించారు. ప్రజల్లోనూ వ్యతిరేకతకు గురైన తృణమూల్‌ సర్కారు ఇవన్నీ కలసి ఓటమి పాలైంది. మమతపైన వ్యతిరేకత పెరిగిన సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన ఒంటెత్తు వ్యూహాలు కూడా బిజెపి కే దోహదం చేశాయి.

టిఎంసి తరపున గెలిచిన 89 మంది ఎమ్మెల్యేలలో 58 మందికి పైగా మమతకు అడ్డం తిరగడం అనూహ్య పరిణామంగా కనిపించినా అంత ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రిగా వున్న సువేందు అధికారితో సహా ఆ పార్టీ నేతలు చాలా మంది గతంలో మమత అనుయాయులే. మొదట్లో శారదా స్కాం నుంచి తాజా కుంభకోణాల వరకూ నిందితులుగా వున్న టింఎసి నాయకులు అనేకమంది బిజెపి లో చేరి రక్షణ మాత్రమే గాక పదవులు కూడా పొందారు. వామపక్ష కూటమిని రాకుండా చేయడం అనే ఒకే ఒక్క లక్ష్యంతో బిజెపి-టింఎసి లు కుమ్మక్కవడం బహిరంగ రహస్యమే. ఆ అవసరం ఇక లేదనుకోగానే బిజెపి ఆమెను పక్కనపెట్టి ఆమెతో వున్న వారిని కూడా లాగేసుకుంది. ప్రతిపక్ష నాయకుడుగా రితబ్రత ముఖర్జీ ఎంపికతోనే ఇది మొదలైంది. తర్వాత ఢిల్లీలోని ఆ పార్టీ ఎంపీలు 20 మంది కూడా కాకోలీ ఘోష్‌ దస్తీదార్‌ నాయకత్వంలో ఏవో సాకులు చెప్పి చీలిపోయారు. బెంగాల్‌ శాసనసభ స్పీకర్‌, లోక్‌సభ స్పీకర్‌ కూడా ఈ సభ్యులకు ఎలాంటి అనర్హత కలగకుండా ఓటు చేసే వీలు కలిగించారంటే ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిన కథేనని స్పష్టమవుతుంది. ఇప్పుడు టిఎంసి రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు.

మాయలు, మతలబులు

ఈ కథలో మరింత రసవత్తరమైన భాగం ఇంటర్వెల్‌ తర్వాత వచ్చింది. ఈ ఇరవై మంది ఎంపీలు బిజెపి లో చేరకుండా ఎన్‌సిపిఐ అనే నేషనల్‌ సిటిజన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరడం. పశ్చిమ బెంగాల్‌ లోనే పుట్టి, త్రిపురలో రెండు స్థానాలకు పోటీ చేసి నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నట్టు? ఆ పార్టీని నడిపే షుయేల్‌ కుందు, ఉత్తీయ కుందు సోషల్‌ మీడియాలో చూసి...ఈ ఎంపీలు తమ పార్టీలో చేరినట్టు తెలుసుకున్నామని చెప్పడం నమ్మశక్యమైన విషయమేనా? పైగా అతను సువేందు అధికారితో వున్న ఫోటోను షేర్‌ చేసి శుభాకాంక్షలు పెట్టాడు. 240 స్థానాలున్న బిజెపి తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్‌, 37 స్థానాలతో సమాజ్‌వాది పార్టీ వున్నాయి. 28 స్థానాలతో వున్న టిఎంసి స్థానంలో ఇప్పుడు ఈ 20 మంది చేరికతో ఎన్‌సిపిఐ ఒక్కసారిగా లోక్‌సభలో నాల్గవ పెద్ద పార్టీగా రూపొందింది. 22 మందితో అయిదో స్థానంలో వున్న డిఎంకె కూడా తాజా పరిణామాల తర్వాత గతంలో వలె కాంగ్రెస్‌తో కలసి వుండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

నాలుగో స్థానంలో తమకు అనుకూలమైన నవ్వులాట పార్టీని పెట్టుకున్నాక ఇప్పుడు బిజెపి చూపు మూడో స్థానంలోని ఎస్‌.పి పై పడింది. బెంగాల్‌లో మమతకు పట్టిన గతే యు.పి లో అఖిలేష్‌ యాదవ్‌ కూడా పడుతుందని యు.పి మంత్రి ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 28 మంది ఎస్‌.పి ఎంపీలు బిజెపి లో చేరడానికి సిద్ధంగా వున్నారని...బిఎస్‌పి చీలిక వర్గమైన 'సుహెల్‌ దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ' నాయకుడు రాజ్‌భర్‌ అంటున్నారు. తర్వాత యు.పి ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా అదేవిధమైన ప్రకటన ఇవ్వగా ఎస్‌.పి లోని బిసి ఎంపీలు మాత్రం ఆ అవకాశం లేదని ఖండించారు. అయితే వచ్చే ఏడాది యు.పి శాసనసభ ఎన్నికలపైనే సర్వశక్తులూ పెట్టిన బిజెపి నాయకత్వం ఏవేవో లోలోపల కుట్రలు చేస్తున్నదని పరిశీలకులు సందేహిస్తున్నారు. ఎస్‌.పి కి కూడా గండి పెడితే అప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్‌ మినహా మొదటి వరసలో పెద్ద పార్టీలన్నీ బిజెపి కి మద్దతునిచ్చే పరిస్థితి వస్తుంది.

అసలు పథకం ఇదే

వాస్తవానికి అంతకన్నా తక్కువ సంఖ్యగల పార్టీలను కూడా వదలిపెట్టడం లేదనడానికి మహారాష్ట్రలో శివసేన పరిస్థితి నిదర్శనం. మొదట దానితో కలసి అధికారం పంచుకున్న బిజెపి తర్వాత ఏక్‌నాథ్‌ షిండేను సి.ఎం ను చేసే హామీతో రెండుగా చీల్చింది, ఎన్నికలు కాగానే ఆయనను మళ్లీ ఉప ముఖ్యమంత్రిగానే మార్చింది. తాజాగా ఇప్పుడు ఉద్ధవ్‌ థాకరేతో వున్న తొమ్మిది మంది ఎంపీలలోనూ ఆరుగురిని చీల్చే ప్రయత్నం పూర్తయినట్టే కనిపిస్తుంది. అవసరమైతే తానే పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తానని ఉద్ధవ్‌ అన్నారంటే అర్థమదే. కానీ అధికార ప్రయోజనాలు ఆశ చూపి బిజెపి సేన ఎంపీలను చేర్చుకోవడం తథ్యంగా కనిపిస్తుంది. బహుశా ఉద్ధవ్‌ వర్గం బాగా పరిమితమై పోవచ్చు. ఇక శరద్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌సిపి కూడా గతంలో చీల్చబడింది. అజిత్‌ పవార్‌ బిజెపి తోనే వున్నారు. ఇక మిగిలిన వారు కూడా అటే వెళతారని కథనాలు సాగుతున్నాయి. అసలు పవార్‌ తోనే చేతులు కలుపుతారని మరికొన్ని వార్తలు. ఇందులో కొన్ని కావాలని వ్యాపింపచేస్తున్న పుకార్లుగా కొట్టివేయబడినా బిజెపి లక్షణం మాత్రం అదేనని మర్చిపోలేము. దాంతోపాటు ప్రాంతీయ పార్టీల అవకాశవాద ధోరణుల రీత్యా కూడా అలా జరిగే అవకాశం చాలా వుంటుంది. రాజ్యసభలో మూడింట రెండు వంతులు మెజార్టీ తెచ్చుకోవడానికిదే సరైన సందర్భమని కూడా బిజెపి, ఆరెస్సెస్‌లు భావిస్తున్నాయి. మొన్న మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌నే తిరస్కరించడం, జార్ఖండ్‌ నుంచి వ్యాపారవేత్త పరిమళ్‌ నత్వానీని గెలిపించుకోవడం వంటివి కూడా ఈ కారణంగా చేస్తున్నవే. ఇవన్నీ ముగిశాక జమిలి ఎన్నికలు, నియోజకవర్గ పునర్విభజన వంటి అతి పెద్ద రాజ్యాంగ సవరణలకు ఆమోద ముద్ర వేసుకోవాలనే వ్యూహం అందరికీ తెలిసిందే. 'సర్‌' ప్రక్రియ ద్వారా వ్యతిరేక ఓట్లను, కొన్ని తరగతుల-మతాల ఓట్లను తొలగించడం...విదేశీ చొరబాట్ల నివారణ, జనాభా పరిశీలన పేరిట అల్ప సంఖ్యాక వర్గాలలో భయాందోళనలు పెంచి లోబర్చుకోవడం ఇవన్నీ ఆ వ్యూహంలో భాగాలు. గతంలో కొమ్ముకాసిన టిఎంసి వంటి పార్టీలే గాక ఇప్పుడు మోస్తున్న తెలుగుదేశం, వైసిపి, జెడియు, జనసేన వంటి పార్టీలను, మిశ్రమంగా కొనసాగుతున్న బిఆర్‌ఎస్‌ వంటి పార్టీలను కూడా బిజెపి లక్ష్యంగా చేసుకుంటుందనేది నిస్సందేహం. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ను నిర్దాక్షిణ్యంగా తొలగించేసిన తీరే అందుకో ఉదాహరణ.

ధనమే శాసనం...

చాలామంది పరిశీలకులు, వ్యాఖ్యాతలు ఈ తరుణంలో ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలు 10వ షెడ్యూలు వివరాలు వంటివి ఏకరువు పెడుతున్నారు. కోట్ల ఓట్ల తొలగింపునకు దారితీస్తున్న 'సర్‌' వంటి ప్రక్రియపైనే జోక్యం చేసుకోని మన న్యాయ వ్యవస్థ చట్టసభల అధ్యక్షుల విచక్షణాధికారంపై ఆధారపడిన ఫిరాయింపుల చట్టం కచ్చితంగా అమలయ్యే చర్యలు తీసుకుంటుందని ఆశించడం కుదిరేపని కాదు. 1985 జనవరి 30న 400 పైగా స్థానాలు కలిగిన రాజీవ్‌ గాంధీ ఫిరాయింపుల చట్టం తేవడానికి కారణం తన బలం కాపాడుకోవాలనే తాపత్రయమే. తర్వాత 1993లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం వున్నప్పుడే అవిశ్వాస తీర్మానం నుంచి బయిటపడేందుకు టిడిపి, జెఎంఎం వంటి పార్టీలను చీల్చిన తీరు చూశాం. వీటిని చక్కదిద్దడానికే వాజ్‌పేయి హయాంలో మూడింట రెండు వంతులు సంఖ్యాబలం వుంటే విలీనం కావాలి తప్ప పార్టీ మారే అవకాశం వుండకుండా చట్టాన్ని సవరించారు. అయినా పార్టీ విలీనమా లేక శాసనసభా పక్షం విలీనమా వంటి విషయాల్లో సభాపతులు అప్పటి అవసరాలకు అనుగుణంగా తీర్పులు చెబుతుంటారు. ఎ.పి, తెలంగాణల్లోనే దశల వారీగా టోకున జరిగిన ఫిరాయింపులలో అనర్హత అంటూ వచ్చింది దాదాపు లేదు. నిజానికి రాజకీయాలను ధనబలం, కార్పొరేట్‌ శక్తులు శాసిస్తున్నప్పుడు ఈ పార్టీల తీరుతెన్నులనూ అవే నిర్దేశించడం కద్దు. నిజానికి ప్రజాస్వామ్యానికి నమూనాలుగా చెప్పబడే పాశ్చాత్య దేశాలలో ఫిరాయింపు నిరోధ చట్టాలు, విప్‌లు వుండనే వుండవు. వున్నా నిలవవు. దానికి వారి ఎన్నికల వ్యవస్థలు పాలనా పద్ధతులు కారణంగా కార్పొరేట్‌ వర్గాలు నేరుగా లాబీయింగ్‌ చేయడం తప్పు కాదు. నెమ్మదిగా మనం కూడా ఆ దశలోకి వెళుతున్నామనే సంకేతాలు ప్రస్తుత పరిణామాల వెనక దాగి వున్నాయని గమనించడం అవసరం.


telakapalli ravi

- తెలకపల్లి రవి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్