mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కష్టాల్లో కార్పొరేషన్లు

3 గంటల క్రితం

gvmc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 06:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చైర్మన్లకు జీతాల్లేవు... భవనాలకు అద్దె డబ్బుల్లేవు

విద్యుత్ బిల్లులకూ నిధుల కొరతే

వసతి కూడా లేని మరికొన్ని సంస్థలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అనేక కార్పొరేషన్లు కష్టాల కడలిలో కూరుకుపోతున్నాయి. అట్టహాసంగా చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం జరిగినప్పటికీ కనీసం వారికి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. చైర్మన్లకు మాత్రమే కాకుండా డైరెక్టర్లకు కూడా కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులు జరగడంలేదని కొంతమంది చైర్మన్లు వాపోతున్నారు. రాష్ర్టంలో దాదాపు 80 కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. రాజకీయ ఉపాధి పేరుతో ఈ నియామకాలు చేపట్టడంతో ఎంతో మంది సంతోషం వ్యక్తం చేసారు. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలవలేదని వారు వాపోతున్నారు.

గత ప్రభుత్వంలో కూడా పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లను ఏర్పాటు చేసారు. అయితే ఆ సంస్థలకు కనీస నిధులు ఇవ్వలేదని కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు భవనాలు కూడా లేకపోవడంతో ఆ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు ఆ సమస్యలనే అనేక సంస్థలు ఎదుర్కొంటుండడం విశేషం. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు సంక్షేమ అభివృద్ధి సంస్థలు ఉన్నాయి. వీటిల్లో రాజకీయ ఉపాథి నేపథ్యంలో అనేక మందిని చైర్మన్లుగా నియమించారు. వీరికింద మరికొంతమందిని డైరెక్టర్లుగా కూడా నియమించారు.

అయితే ప్రస్తుతం చాలా కార్పొరేషన్లలో చైర్మన్ లకు, డైరెక్టర్లకు కొన్ని నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని తెలిసింది. దీనిపై ఆయా శాఖల అధికారులకు, నేరుగా ముఖ్యమంత్రిగా కూడా ఫిర్యాదులు వెళుతున్నప్పటికీ జీతాలు చెల్లింపుల సమస్యలు మాత్రం తీరడం లేదని పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చైర్మన్లు, డైరెక్టర్లకు చెల్లించాల్సిన జీతాలు సమస్య మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అనేక కార్పొరేషన్లకు ఇప్పటికీ సరైన భవన సౌకర్యం కూడా లేదని అంటున్నారు, కొంతమంది చైర్మన్లు అద్దెకు తీసుకున్న భవనాల్లో తమకు కావలసిన, భవిష్యత్తులో ఈ పదవిలోకి వచ్చే వారికి కూడా అనుకూలంగా ఉండేలా అంతర్గత మౌలిక సౌకర్యాలు సిద్ధం చేసుకున్నారు. వీటికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో నిధులు విడుదల జరగలేదని ఉంటున్నారు.

అద్దెలు చెల్లించలేని పరిస్థితి

ఇక అనేక కార్పొరేషన్లకు కనీసం విద్యుత్తు బిల్లులకు కావలసిన విధులు కూడా రావడంలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే రాజకీయంగా కొంతమంది తమ పరపతి ఉపయోగించి విద్యుత్ కనెక్షన్లు తొలగింపునకు గురికాకుండా చూసుకుంటున్నారు. ఇక అద్దెకు తీసుకున్న భవనాలకు కొన్ని కార్పొరేషన్లు ఇప్పటికీ అద్దెలు కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వ నుంచి నిధులు వల్ల ఈ పరిస్థితి నెలకొంటుందని వారు అంటున్నారు. ఈ కారణంగానే చైర్మన్ లపై ఇంటి యజమానుల నుంచి తీవ్రమైన వత్తిళ్లు నెలకొంటున్నాయి. అందుకే కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు కార్యాలయానికి వెళ్లేందుకు కూడా వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా చైర్మన్ గా ఉన్న కార్పొరేషన్ కు ఇప్పటికీ ఎక్కడా వసతి సౌకర్యం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆ సంస్థకు వైస్ చైర్మన్ గా నిమతులైన ఓ వ్యక్తి మరి కొన్ని నెలల్లో తన పదవీకాలం కూడా ముగించనున్నారు. అయినప్పటికీ ఆ సంస్థకు భవన సౌకర్యం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ లకు కావాల్సిన ఆర్థిక సౌకర్యాన్ని, మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఓ కీలక సంస్థ చైర్మన్ విజ్ఞప్తి చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్