సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దక్షిణాది భాషల సాహిత్య సంభాషణ

1 గంట క్రితం

sass
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

బుక్‌బ్రహ్మ మూడో ఎడిషన్‌ ఆగస్టు 21–23 తేదీల్లో బెంగళూరులో గతంకన్నా విస్తృతంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సాహిత్య ఉత్సవాన్ని ‘సోల్‌ ఆఫ్‌ సౌత్‌’గా నిర్వహించారు. 2024 నుంచి జరుగుతున్న ఈ ఉత్సవంలో ఈ ఏడాది తొమ్మిది వేదికలపై 200కు పైగా సెషన్లు జరిగాయి. 400 మందికి పైగా రచయితలు, కవులు, విమర్శకులు, అనువాదకులు, ప్రచురణకర్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్‌ తదితర భాషల సాహిత్యంతో పాటు సమాజం, సంస్కృతి, చరిత్ర, అనువాదం, ప్రచురణ, కళలు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ప్రధాన వేదికను ‘మంటప’ పేరుతో నిర్వహించగా, అక్షర, మథన, ముఖాముఖి, న్యూజెన్‌, చిన్నారలోక, పోయెట్రీ తదితర వేదికలపై భిన్నమైన కార్యక్రమాలు జరిగాయి.

మూడు రోజుల ప్రధాన సాహిత్య కార్యక్రమాలకు ముందు ఆగస్టు 14 నుంచి 20 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శన కూడా నిర్వహించారు. మొదటి రోజు మంటప వేదికపై ‘భాషా ఆధిపత్యం: భారతీయ భాషలు–సమాఖ్య ఊహ’ అంశంపై ఓఎల్‌ నాగభూషణస్వామి, ఎంఎస్‌ ఆశాదేవి, ఎన్‌ఎస్‌ మాధవన్‌, కేశవ గుహ పాల్గొనగా దివ్య కలవాల మోడరేటర్‌గా వ్యవహరించారు. భారతీయ భాషల మధ్య సంబంధాలు, అనువాదం, ఆంగ్లం ప్రభావం, ప్రాంతీయ భాషల స్థానం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఓఎల్‌ నాగభూషణస్వామి అనువాదం చేసే క్రమంలో సహజమైన కన్నడ భాషలోకి అంతర్జాతీయ భాషను అనువదించడం సహజమైన దారిగా భావిస్తానని చెప్పారు. ఆంగ్లం ‘రిసీవింగ్‌ లాంగ్వేజ్‌’గా మారుతున్న పరిస్థితిని ప్రస్తావిస్తూ అనువాదం ఒక ప్రమాదకరమైన వ్యాపారం అన్నారు. కొన్ని పదాలను చేర్చడం లేదా మార్చడం వల్ల అసలు రచనలోని అర్థం, భావం మారిపోతున్నాయనే ప్రశ్నను ఎన్‌ఎస్‌ మాధవన్‌ లేవనెత్తారు. దక్షిణాది భాషల్లోని ఆధునిక సాహిత్య పరిణామాలపైనా విస్తృతంగా చర్చ జరిగింది. ఆధునిక తమిళ సాహిత్యంలో సామాజిక మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్న యువ రచయితల కృషి, మలయాళ కథా సాహిత్యంలో వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న యువ కథకుల పాత్ర చర్చకు వచ్చాయి. బెంగాలీ సాహిత్యంలో పాలకుల వైఖరిపై యువకులు కవిత్వం, కథల ద్వారా స్పందిస్తున్న తీరు, కన్నడ సాహిత్యంలో జరుగుతున్న కృషి, ఉద్యమాలపై యువకవుల్లో పెరుగుతున్న ఆసక్తి, ద్రావిడ భాషల్లో వస్తున్న కథలు, కవిత్వం చర్చకు వచ్చాయి. బాల సాహిత్యానికి కూడా ప్రత్యేక స్థానం కల్పించారు.

తెలుగు సాహిత్యంపై చర్చ

‘ఆధునిక తెలుగు సాహిత్యంలో తెలుగు నవలా వికాసం’ అంశంపై కె. శ్రీనివాస్‌, బండి నారాయణస్వామి పాల్గొనగా ఛాయా మోహన్‌బాబు మోడరేటర్‌గా వ్యవహరించారు. తెలుగులో నవల 2016 తర్వాత మళ్లీ పుంజుకుందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్త్రీ–పురుష సంబంధాలు, రాజకీయాలు, చరిత్ర, చారిత్రక నవలలు వస్తున్నప్పటికీ పాఠకులు సుదీర్ఘమైన వచనాన్ని చదవగలరా అనే ప్రశ్న చర్చకు వచ్చింది. ఈ తరంలో వ్యాపారాత్మక నవలలు లేవని బండి నారాయణస్వామి అన్నారు. అస్తిత్వ ఉద్యమాల తర్వాత నవలల సంఖ్య తగ్గిందనే అభిప్రాయంతో పాటు, 1980 తర్వాత టెలివిజన్‌ రావడం వల్ల కూడా నవలల ప్రాబల్యం తగ్గిందని కుప్పిలి పద్మ చెప్పారు. కె. శ్రీనివాస్‌ తెలుగు నవల పరిణామక్రమాన్ని దశలవారీగా వివరించే ప్రయత్నం చేశారు. అయితే నవలా వికాసంపై జరగాల్సిన చర్చ పూర్తిగా ఆ దిశలో సాగలేదు.

‘తెలుగు కవిత్వం – కొన్ని ఆలోచనలు’ సెషన్‌లో యాకూబ్‌, కొండేపూడి నిర్మల, నందిని సిద్దారెడ్డి పాల్గొనగా అనిల్‌ డ్యాని మోడరేటర్‌గా వ్యవహరించారు. స్త్రీవాదం స్త్రీల హక్కులను ప్రశ్నించడమేనని, ప్రాథమిక హక్కుల కోసం స్త్రీవాదం ఉందని కొండేపూడి నిర్మల చెప్పారు. పత్రికల ప్రచురణ నుంచి సామాజిక మాధ్యమాల విజృంభణ వరకు కవిత్వం సాగిన ప్రయాణం చర్చకు వచ్చింది. కవిత్వంలో అధ్యయనం లోపించిందని, నిర్మాణాత్మకమైన సాహిత్యం రావడం లేదని, విమర్శను స్వీకరించే స్థితిలో కవులు లేరని నందిని సిద్దారెడ్డి ప్రస్తావించారు. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కవిత్వంపైనా చర్చ జరిగింది. ‘పోయెట్రీ’ సెషన్లలో నరేష్‌కుమార్‌ సూఫీ, నందిని సిద్దారెడ్డి తమ కవిత్వ అనుభవాలను పంచుకున్నారు. ‘తెలుగు సాహిత్యం – మాండలికం’ అంశంపై అక్షర వేదికలో అల్లం నారాయణ మోడరేటర్‌గా వ్యవహరించగా నరేష్‌కుమార్‌ సూఫీ, ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు, ఉణుదుర్తి సుధాకర్‌ పాల్గొన్నారు. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటూ మాండలికాన్ని విభజించి గీతలు గీయడం కుదరదని, సామాజిక వర్గాలకు అనుగుణంగా మాండలిక భాషలో మార్పులు వస్తాయని ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు చెప్పారు. రెండో రోజు ‘స్త్రీవాద సాహిత్యం – నిన్న, నేడు, రేపు’ అంశంపై దొండపాటి నాగజ్యోతి, చల్లపల్లి స్వరూపరాణి, కుప్పిలి పద్మ, మాధురి పాలాజీ చర్చించారు. ‘సాహిత్యంలో నూతన ధోరణులు’పై శ్రీ దివ్య కవనమాలి, శ్రీ ఊహ మాట్లాడగా వివేక్‌ లంకమల మోడరేటర్‌గా వ్యవహరించారు.

భాషల మధ్య సంభాషణే బలం

మూడో రోజు ‘నడిరోడ్డుపై నగరకథలు’ అంశంపై కుప్పిలి పద్మ, మహమ్మద్‌ ఖాదర్‌బాబు, అపర్ణ తోట, అక్కిరాజు భట్టిప్రోలు చర్చించారు. నగర జీవితం, దాని అనుభవాలు కథా సాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయనే అంశాలు చర్చకు వచ్చాయి. ‘చారిత్రక నవలల పునర్జీవనం’పై గోపిని కరుణాకర్‌, మారుతి పౌరోహితం, ప్రసాద్‌ సూరి, శివ రాచర్ల పాల్గొని చారిత్రక నవలల ఆవశ్యకత, వర్తమాన సాహిత్యంలో వాటి ప్రభావంపై చర్చించారు. అనంతరం ‘సాహిత్య అనువాదం – సంస్కృతుల మధ్య వారధి’పై సమీర, మోహన్‌ తలారి, మాధురి చర్చించారు.

ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో దక్షిణాది భాషల సమకాలీన సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే బుక్‌బ్రహ్మ ఫెస్టివల్‌ ప్రధాన బలంగా కనిపించింది. ఒక భాషలో జరుగుతున్న సాహిత్య చర్చను మరో భాషకు పరిచయం చేయడం, అనువాదం ద్వారా భాషలు–సంస్కృతుల మధ్య సంబంధాలను పెంచడం ఫెస్టివల్‌ ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. అయితే తెలుగు సాహిత్యానికి సంబంధించిన చాలా సెషన్లలో ఒకే వక్త చేత మళ్లీ మళ్లీ మాట్లాడించడం వల్ల విస్తృతమైన సాహిత్య స్వరాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదనే అభిప్రాయం కలిగింది. కొన్ని సెషన్లు ప్రకటించిన అంశానికి అనుగుణంగా సాగలేదు. అయినప్పటికీ ద్రావిడ భాషల్లో వస్తున్న ఆధునిక సాహిత్య ధోరణులు, భాషా వైవిధ్యం, అనువాద సమస్యలు, అస్తిత్వ ఉద్యమాలు, స్త్రీవాద రచన, మాండలిక భాష, యువ రచయితల పాత్ర వంటి అనేక అంశాలు చర్చకు రావడం ఫెస్టివల్‌ ప్రాధాన్యాన్ని పెంచింది. భాషల మధ్య పరస్పర సాహిత్య పరిచయానికి అవకాశం కల్పించడంలో బుక్‌బ్రహ్మ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది.


నివేదిక : కెంగార మోహన్‌, 94933 75447

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్