లే నాయినా లే....!
లే నాయినా లే....!
లే నాయినా లే
మా కతల నెలవంకా
కవితల నెమలి పింఛమా..
కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు
కాశీకి పోయిన గాడిద
గంగి గోవుగా రాదని
అగ్గి మాలో రాజేసినవాడివి
నువ్వు ముసి మారిపోతే ఎలా?
లే.. నాయినా లే
లెగిసి గంజో గడుగో తాగు
....
మనవరాళ్లను చూడు
కన్నీరు మున్నీరవుతున్నారు..
నిన్నటినుండి ఏరులా జనం వస్తున్నారు
నెగిసి నీలో పాలో తాగు
....
జానకమ్మ లేదు
నీకు టీనీలు ఇవ్వడానికి
ముసలమ్మకు కాళ్లు రావు
నీకు బువ్వొండి పెట్టడానికి
అన్నిటికీ కోడలు పిల్లే
ఇంకా కన్నీటి చెరువై ఇంటికి చేరలేదు
నెగవా... నెగిసి మొఖం కడుక్కోవా!?
....
రెక్కలొచ్చి నీను ఎగిరిపోయినా...
ఇంకా నీ రెక్కలకింద
తలదాసుకున్న పిచ్చికల మాటేటి?
లే నాయినా లే...
....
వదినమ్మ కాలం అగ్గిలో
కాలి బూడిదయ్యింది
'దుక్క'పు నెగడులో దూరకుండా
పిల్లల్ని చెట్టై చేరదీయవా?
లే.. నాయినా లే..
....
కట్లిప్పని లేగల్లా
కలాలు జేబుల్లో కన్నీరు పెడుతున్నాయి
ఆటికీ కసింత కతల కుడితి పెట్టి కడుపు నింపవా?
ఇన్ని పచ్చగడ్డి పరకల్లాంటి
కవితల్ని ముందలేసి మురిపించవా..?
....
జానకమ్మ అరవై ఏళ్లకే
మూటా ముళ్లీ సర్దుకుని
మంజూరు దాటిపోయింది
అక్షరాల లోకంలో మరో ప్రపంచం
ఉందని నమ్మినవారము
మన పని మనము సేయమా...
లే.. నాయినా.... లే..
....
ఇతనాలు జల్లినట్టు, దుక్కి దున్నినట్టు
అప్పసం ఇరగదీసినట్టో
కొడవలి అందుకొని సేను కోసినట్టిగో..
నెగిసి కలం పట్టుకో
నీ ఎనకాల మునుం పాటెత్తుకొని మురిసిపోతాం!
(కవి గంటేడ గౌరునాయుడు సతీమణి జానకమ్మ లేరని తెలిసాక)
- చింతా అప్పలనాయుడు








కామెంట్‌లు (0)