చెన్నై : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బిల) సంఖ్య తగ్గడంపై ఆర్‌బిఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనం’ తన దృష్టిలో కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ఈచర్య స్థానిక, ప్రాంతీయ బ్యాంకుల స్వభావాన్ని దెబ్బతీసిందని, చివరికి అవి ‘యూనివర్శల్ బ్యాంకు’ల్లో విలీనం కావడానికి దారితీయవచ్చని పేర్కొన్నారు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 10వ వార్షికోత్సవం సందర్భంగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయంతో ఆర్‌ఆర్‌బిల సంఖ్య గణనీయంగా పడిపోయిందనది అన్నారు. స్థానికంగా గ్రామాల్లో రుణాలు మరింత సమానంగా పంపిణీ అవుతాయనే ఉద్దేశ్యంతోనే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్‌ఆర్‌బి) ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే బలహీన వర్గాలకు రుణాలు అందించే విధానం పరిణామ క్రమంలో బ్యాంకుల జాతీయీకరణ, ప్రాధాన్యతా రంగ రుణాల కల్పన , ఆర్‌ఆర్‌బిలు, స్థానిక ప్రాంత బ్యాంకులు, స్వయం సహాయ సంఘాలు తదనంతరం చిన్న ఆర్థిక బ్యాంకుల వంటి అనేక సంస్థాగత చర్యలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు.
రుణ అవసరాలను తీర్చడంలో ప్రస్తుతం ఉన్న చిన్న ఆర్థిక బ్యాంకుల సంఖ్య సరిపోదని రంగరాజన్ పేర్కొన్నారు. చిన్న ఆర్థిక బ్యాంకుల ఏర్పాటును ప్రోత్సహించే మార్గాలను పరిశీలించాలని ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)ను కోరారు. ప్రస్తుతం కేవలం 11 చిన్న ఆర్థిక బ్యాంకులు మాత్రమే ఉన్నాయని, ఈ రంగంలో రుణ అవసరాలను తీర్చడానికి ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదని ఆయన పేర్కొన్నారు. కేవలం మరిన్ని బ్యాంకులను ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారం కాదని, కొత్త సంస్థలు ఏర్పడినప్పటికీ సమస్యలు కొనసాగవచ్చని రంగరాజన్ పేర్కొన్నారు. ఆయా బ్యాంకుల యాజమాన్యం ఏ స్ఫూర్తితో, ఏ లక్ష్యంతో బాధ్యతలు చేపడుతుందన్నదే ముఖ్యమని అన్నారు. చిన్న ఆర్థిక బ్యాంకుల పనితీరు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి)ల పరిణామ క్రమం పట్ల కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వయం సహాయక సంఘం అంటే ఏమిటనే దానిపై స్పష్టమైన నిర్వచనం లేకపోవడం మరియు అవి సొసైటీలుగా నమోదు కాకపోవడం వల్ల, ప్రారంభంలో బ్యాంకులు వాటికి రుణాలు ఇవ్వడానికి వెనుకాడేవని ఆయన గుర్తుచేశారు. దాదాపు ఉమ్మడి హామీ తరహా పద్ధతిలో స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులను అనుమతిస్తూ 1993 లేదా 1994లో తాను ఒక సర్క్యులర్ జారీ చేశానని ఆయన తెలిపారు. అయితే, ఆ తర్వాత స్వయం సహాయక సంఘాల పాత్ర మారిపోయిందని ఆయన పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు కేవలం ప్రభుత్వ పథకాలను అమలు చేసే ‘సాధనాలు’గా మాత్రమే మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్వయం సహాయక సంస్థలను స్థాపించిన ఉద్దేశానికి, స్పూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు.
గతేడాది జులైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకిచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, మరియు భారీ స్థాయి కార్యకలాపాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందేందుకు, ప్రభుత్వం 2005 నుండి వాటిని దశలవారీగా విలీనం చేస్తూ వస్తోందని తెలిపారు. విలీన ప్రక్రియలో భాగంగా 2005- 2010 మధ్య జరిగిన మొదటి దశలో, ఆర్‌ఆర్‌బిల సంఖ్య 196 నుండి 82కి తగ్గిందని, తదుపరి దశలలో ఈ సంఖ్య మరింత తగ్గిందని పేర్కొన్నారు. తాజాగా 'ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బి' విధానం కింద, మే 1, 2025 నుండి అమల్లోకి వచ్చేలా వీటి సంఖ్యను 43 నుండి 28కి తగ్గించారని తెలిపారు.







కామెంట్‌లు (0)