రచయిత, కవి, సాహిత్య విమర్శకుడు కెంగార మోహన్ తన మొదటి కథాసంపుటి “బ్లాక్ రెయిన్ బో”ను ఇటీవల వెలువరించారు. ఈ రచయిత ... కరవు, వివక్ష, ఆధిపత్యాలకు నిలయమైన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందినవాడు. పెద్దతుంబలం అనే గ్రామంలో తన బాల్యం అంతా గడవడం వల్ల వివక్ష, ఆధిపత్య వర్గాల అణచివేతలకు ప్రత్యక్షంగా గురైన అనుభవాలు ఉన్నవాడు. అందుకే అతడి కథలు వాస్తవికతకు అద్దం పడతాయి. ఇప్పటికీ తన ఊరితో అనుబంధం ఉండడం వల్ల రూపం మార్చుకున్న వివక్షను, ఆధిపత్య భావజాలాన్ని తన ఈ కథల్లో అత్యంత సహజంగా చిత్రీకరించాడు. సామాజిక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకునే పరిశోధక విద్యార్థులకు ఈ కథలు సమకాలీన గ్రామీణ సమాజాల్లో వస్తున్న మార్పులను పరిశీలించడానికి చక్కగా ఉపయోగపడతాయి.
సామాజిక శాస్త్ర దృష్టితో చూసినప్పుడు “బ్లాక్ రెయిన్ బో” మూడు ముఖ్యమైన విషయాలను ప్రతిపాదిస్తుంది. ఒకటి, భారతీయ సమాజంలో కులవ్యవస్థ ఇప్పటికీ సామాజిక సంబంధాలను నిర్ణయించే ప్రధాన శక్తిగా కొనసాగుతోంది. రెండవది, విద్య, ఉద్యోగం, ఆధునికీకరణ వచ్చినప్పటికీ సామాజిక అసమానతలు కొత్త రూపాల్లో పునరుత్పత్తి అవుతున్నాయి. మూడవది, దళిత జీవితాన్ని కేవలం బాధతో కాకుండా ఆత్మగౌరవం, చైతన్యం, ప్రతిఘటన, సామాజిక మార్పు అనే కోణాల్లో కూడా చూడాలి. అందువల్ల ఈ కథాసంపుటిని సమకాలీన దళిత సమాజానికి సంబంధించిన సామాజిక శాస్త్ర పాఠ్యాంశంగా, గ్రామీణ భారతదేశ సామాజిక నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి విలువైన అధ్యయన గ్రంథంగా చూడాలి.
సామాజిక శాస్త్రవేత్త పియెర్ బోర్డ్యూ చెప్పిన సాంస్కృతిక మూలధనం, సామాజిక మూలధనాల లేమి దళిత కుటుంబాల సామాజిక పురోగతిని ఎలా అడ్డుకుంటుందో ఈ కథలు స్పష్టపరుస్తాయి. గ్రామాల్లో భూమి ఉన్నవారే అధికారాన్ని కలిగి ఉండడం, కులపెద్దల ఆధిపత్యం, రాజకీయ నాయకత్వం, వారికి పోలీసు, పాలనా వ్యవస్థల సహకారం వంటి అంశాలు గ్రామీణ అధికార నిర్మాణాన్ని తెలియజేస్తాయి. గ్రామీణ సమాజంలో భూమి, నీరు, దేవాలయం, రాజకీయాలు, విద్య వంటి ప్రతి రంగంలో కులాధిపత్యం ఎలా పనిచేస్తుందో కథలు కళ్లకు కట్టినట్లుగా చూపుతాయి.
భాగ్యమ్మ కథలో గ్లోబలైజేషన్ యుగంలో దళిత యువత ఉన్నత విద్యావంతులై అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నా, తమ మూలాలను, కన్నవారిని మరిచిపోయే వ్యక్తిగత స్వార్థాన్ని ఒక సామాజిక రుగ్మతగా ఈ కథలో చూపించారు. ఆర్థిక అభ్యున్నతి సాధించినా మలివయసులో తల్లిదండ్రులకు దక్కే సామాజిక అభద్రతను ఈ కథ తెలియజేస్తుంది. ఒక భాషపై మితిమీరిన అభిమానం సామాన్య మానవుడి ప్రాణాల మీదకు ఎలా వస్తుందో “కంచికి చేరని కథ” చూపిస్తుంది. అదే కథలో దళితుడైన కథానాయకుడు శైవమతాన్ని స్వీకరించి ప్రచారం చేసినా, స్థానిక దేవాలయాల్లో దళితులు ఎదుర్కొనే వివక్షను కూడా చర్చిస్తుంది. “మట్టిమనిషి” కథలో ప్రకృతి వైపరీత్యాలు, కరవు వల్ల దళిత రైతులు భూములను కోల్పోయి నగరాలకు కూలీలుగా వలసపోయే దుస్థితిని సామాజిక కోణంలో విశ్లేషించారు. కరవును ఆసరాగా చేసుకుని దళితుల భూములను లాక్కోవాలనుకునే భూస్వాముల కుతంత్రాలను బయటపెడతారు. కథ అంతటా రాయలసీమ భాష, యాస ఎంతో సహజంగా వాడారు.
“సమిధలు” కథలో భూస్వాములు తమ స్వార్థం కోసం ఎస్సీ, బీసీ వర్గాల మధ్య కుల ఘర్షణలు ఎలా సృష్టిస్తారో, ఆ రాజకీయాల్లో చివరకు దళితులు ఎలా బలవుతారో చెబుతుంది. ఆధిపత్య వర్గాల పన్నాగాలను, గ్రామీణ వాస్తవికతను తీవ్రమైన ఆక్రోశంతో, నాటకీయ శైలిలో చిత్రించారు. ఈ సంపుటిలోని కథలన్నింటినీ జరిగిన సంఘటనల ఆధారంగానే రాశారు. “వసంతం” కథ మతం మారినా (క్రిస్టియానిటీలోకి వెళ్లినా) కుల వివక్ష పోలేదని చెబుతుంది. బీసీ కురువ క్రిస్టియన్ అమ్మాయి, మాదిగ క్రిస్టియన్ అబ్బాయి ప్రేమించుకుంటే, కులాధిపత్యం వల్ల ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటాడు. సాంప్రదాయక ప్రేమకథలకు భిన్నంగా కుల వ్యవస్థలోని క్రూరత్వాన్ని ఎత్తిచూపేలా కథా ముగింపు మన హృదయాలను కదిలిస్తుంది. “నీ కృప నాకు చాలును” కథలో పట్టణాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో దళితులపై జరిగే అవినీతి కుట్రలు, తప్పుడు కేసుల ద్వారా వారిని వేధించే విధానాన్ని, తోటి దళితులే అసూయతో కంప్లైంట్లు ఇచ్చే నైజాన్ని సామాజిక మానసికశాస్త్ర కోణంలో చూపించారు.
“వానమెతుకులు”, “ఉరిదేవర” ఈ రెండు కథలు కూడా వ్యవసాయం కలిసిరాక దళిత కుటుంబాలు చితికిపోవడం, ఫ్యాక్షనిజం వల్ల చదువుకుంటున్న ఆడపిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయి బాల్యవివాహాలకు బలవుతున్న సామాజిక దుస్థితిని తెలుపుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పట్ల వివక్ష కొత్త రూపాలు దాల్చిన తీరును ఈ కథలు చెబుతాయి. “పైగేరి నారణప్ప”, “విషనాగు” కథలు ఆధునిక కాలంలో కులం రూపం మార్చుకుని దళితులను వేటాడటాన్ని విశ్లేషిస్తాయి. బీసీ వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నించినందుకు మాదిగ నారణప్ప సర్వనాశనమవడం, ప్రతిఘటన, ధిక్కారస్వరాన్ని వినిపిస్తూనే సమాజంలోని నయా వివక్షను ప్రతీకాత్మకంగా చిత్రించారు. ఈ కథల్లో రచయిత ఎక్కడా కృత్రిమ శైలికి తావివ్వకుండా, చెకోవ్ సూత్రాన్ని పాటిస్తూ కథలను క్లుప్తంగా, సహజమైన రాయలసీమ గ్రామీణ నుడికారంతో మలిచి, నీల్, లాల్‌ల ఐక్యత ఆవశ్యకతను తెలుపుతూ దళిత సాహిత్యానికి కొత్త దిశను చూపించారు.
- మారుతి పౌరోహితం







కామెంట్‌లు (0)