ఈ భూమ్మీద కొందరు వారు ఉన్న కాలానికి ప్రతినిధులుగా తమ కళల్ని జాతికి అంకితం చేసి చెరగని స్మృతి చిహ్నాలుగా, చిరయశస్సుగా నిలిచిపోతారు. వారు ఈ భూమ్మీద ఉన్నది కొద్దికాలమే కావొచ్చు. లేదా సుదీర్ఘ కాలం కూడా కావొచ్చు. కానీ, స్వచ్ఛమైన కళాకారులుగా వారు నిర్వహించిన కళాయజ్ఞం సామాజికులలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాది. మనకెందరో బాల మేధావుల గురించి తెలుసు. వారు తమ మేధాసంపత్తితో కవులుగా, చిత్రకారులుగా, సంగీతజ్ఞులుగా లలితకళా ప్రపంచంలో తటిల్లతల్లా మెరిసి మాయమైనా, మన మనోఫలకాల మీద చెరగని ముద్రవేసుకుంటారు. అలాంటి బాల మేధావి, తన ఏడేళ్ళ చిరుత ప్రాయంలోనే దేశం గర్వించదగ్గ అద్భుత రేఖాచిత్రాల్ని, నీటిరంగుల చిత్రాల్ని అందించేడు. తను వచ్చిన పని ముగిసినట్టుగా, తాను నిర్వహించాల్సిన చిత్రకళా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించి నిశ్శబ్దంగా నిష్క్రమించడమొక విషాదం... హృదయవిదారకం. ఆ ఏడేళ్ళ బాల చిత్రకారుడే 'క్లింట్'. ఎడ్మండ్ థామస్ క్లింట్ కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఒకానొక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టేడు. పుట్టుకతోనే చిత్రకళా పాఠాల్ని నేర్చుకువచ్చాడా అన్నంత ప్రతిభావంతుడు. ఆ పసి ప్రాయంలోనే ఇటుక ముక్కల్ని తెచ్చి వృత్తలేఖినితో గీసినట్టు వృత్తాలు గీసేడంటే ఆ ప్రతిభనేనాలి? చురుకైన కళ్ళతో ప్రతిదాన్నీ గమనించడం, గమనించినదాన్ని గుర్తుంచుకుని అలాగే కాగితమ్మీదికి తేవడం.. అతనికి లభించిన వరం అనుకోవాలి. ఏడేళ్ళ వయసులోనే పాతిక వేల రేఖాచిత్రాలు, నీటిరంగుల చిత్రాలు చిత్రించేడు. జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో బహుమతులు పొందేడు. ఉన్నట్టుండి ఒక రోజు నిశ్శబ్దంగా వెళ్ళిపోయేడు. ఆ పసి చిత్రకారుని చివరి ప్రయాణం పాఠకుల గుండెల్ని ముక్కలు చేస్తుంది. "ఏం లేదు మమ్మీ ... నేను సడన్‌గా నిద్రపోవచ్చు, నువ్వు పిలిచినప్పుడు నేను మేలుకోకపోవచ్చు, నేను నిద్రలో వున్నానంతే! నువ్వు బాధపడొద్దు, ఏడవొద్దు" అని తల్లితో అన్న క్లింట్ మరెప్పుడూ నిద్ర నుంచి మేల్కొనలేదు. తన మరణ సన్నివేశాన్ని ముందుగానే ఊహించి తల్లికి ధైర్యం చెప్పిన యోధుడు క్లింట్. కళ్ళు తడికాకుండా పుస్తకం ముయ్యడం మన తరంగాదు.
ఇదొక బాలమేధావి, మహాద్భుత బాల చిత్రకారుడు అయిన క్లింట్ కథ. కేరళలోని కొచ్చి నగరానికి చెందిన 'అమ్మూ నాయర్' ఆంగ్లంలో రాసి ప్రపంచానికి అందించిన 'ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ' పుస్తకాన్ని అద్భుతమైన శైలిలో స్వతంత్ర రచన అనిపించేలా గొప్ప ఆర్ద్రతతో తెలుగులోకి అనువాదం చేసింది 'స్వర్ణ కిలారి'. గతంలో 'మేకబతుకు' నవలను చదివి ఈ రచయిత్రిని అభినందించకుండా ఉండలేరు. ఇప్పుడీ పుస్తకాన్ని అంతకంటే గొప్పగా, అంతకంటే ఆర్తిగా, అంతకు మించి అందంగా తెచ్చిన 'స్వర్ణ' అభినందనీయురాలు. నేను పుస్తకంలోని ఇంకే విషయాల్నీ చెప్పదలుచుకో లేదు. ఈ పుస్తకం ఎవరికివారే చదివి అనుభూతి చెందాల్సిందే. ఈ పుస్తకంలో క్లింట్ గీసిన చాలా రేఖాచిత్రాలున్నాయి. నీటి రంగుల పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ బొమ్మల లోకంలోకి వెళితే ఒక మేధావి అయిన చిత్రకారుని మేథో మధనమే కాదు, ఆ పసి హృదయంలోని ఆలోచనా విస్తృతి అబ్బురపరుస్తుంది. అంత చిన్న వయసులో ఆ పరిణితి అతనికెలా సాధ్యపడిందో..? తనలో కలిగిన సందేహాలు, తనకు స్ఫురించిన సమాధానాలు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, ఆలోచింపజేస్తాయి.
ఈ పుస్తకం ఒక బాల మేధావి గురించి మాత్రమే అనుకుంటే పొరపాటే. పిల్లలూ, పిల్లల తల్లిదండ్రులూ, పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులూ గ్రహించాల్సిన సూక్ష్మాంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. అవి ఆలోచనల్లో పడేస్తాయి. క్లింట్ తల్లిదండ్రుల్లా మనం మన పిల్లలకోసం ఆలోచిస్తున్నామా? అని నిలదీస్తుందీ పుస్తకం. క్లింట్ గురించి చెప్తూ ఒక చోట రచయిత్రి వేసుకున్న ప్రశ్న చూడండి. "క్లింట్ ఇంతగా ఆరాధించబడడానికి, పాపులర్ కావడానికి కారణం ఏమిటి? కేవలం అతను బాలమేధావి అవడం ఒక్కటే కారణం కాదు. అతనిలో ఉన్న సున్నితమైన హాస్యమా? లేక అతనిలోని విషయ స్పష్టతా? ముక్కుసూటితనమా? తనపై తనకున్న ఆత్మ విశ్వాసమా? లేక అతనికి గల గాంభీర్యతా? లేక అతని పెద్ద పెద్ద కళ్ళ లోతుల్లోనుండి మెరిసే జ్ఞానమా?" ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలీ పుస్తకంలోనే ఉన్నాయి. ఒక చిత్రమేమిటంటే, బడిలో టీచర్ అడుగుతుంది. 'మీలో చర్చికి వెళ్ళేవాళ్ళెందరో నిలబడండి' అంటే కొందరు నిలబడతారు. 'గుడికి వెళ్ళేవారెందరు?' అంటే కొందరు పిల్లలు నిలబడతారు. క్లింట్ మాత్రం చర్చికి, గుడికి, మసీదుకి కూడా వెళ్తానని నిలబడతాడు.
'ఒక అద్భుత కథ' పేరుతో చినవీరభద్రుడు రాసిన ముందుమాటలో చిత్రలేఖనం గురించి అరుదైన చాలా మంచి విషయాలు, ముఖ్యంగా చిత్రకారులకు ఉపయుక్తమైన సంగతులు రాసేరు. 'మార్మిక బాలుని శాశ్వత విడిది' పేరుతో లిప్తకాలపు స్వప్నాన్ని అక్షరాల్లో స్వర్ణ శాశ్వతం చేసిందని మల్లీశ్వరి రాసిన మాట కూడా విలువైనదే. ఇక ఈ పుస్తకం తెలుగులోకి అనువాదం చేయడానికి ముందు ఇంగ్లీష్‌లో చదివేక తను ఎంత ఉద్వేగానికి లోనైందో... పుస్తకం తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కొచ్చి వెళ్ళి క్లింట్ తల్లిని, వారి బంధువుల్ని కలిశారు. క్లింట్ తిరుగాడిన చోట్లను దర్శించారు. తాను పొందిన అనుభూతిని పాఠకుల్లో కలిగించడానికి తాను పడ్డ శ్రమను 'లోకం కాన్వాసుపై చెరగని వర్ణం' అంటూ తన భావోద్వేగాలను మనతో పంచుకున్నారు రచయిత్రి స్వర్ణ కిలారి. ముందే చెప్పినట్టు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ చదవాల్సిన అరుదైన పుస్తకం 'లిప్తకాలపు స్వప్నం'.
- గంటేడ గౌరునాయుడు
94414 15182







కామెంట్‌లు (0)