మహాకవి గురజాడ దార్శనికత, ఆధునిక దృష్టి, దురాచారాల మీద ఆయన సాగించిన సంస్కరణోద్యమం వెలుగులోకి తేవడానికి సాహితీ స్రవంతి రాష్ట్రవ్యాప్తంగా మొదటినుంచీ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే గురజాడ వెంకట అప్పారావు జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహాకవి గురజాడ జయంతి సెప్టెంబర్ 21వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం.
గురజాడ జయంతిని నిర్వహించడం ఒక్కటే సరిపోదని, భోపాల్‌లో ఏర్పాటుచేసిన జాతీయ సాంస్కృతిక కేంద్రం తరహాలో గురజాడ అప్పారావు పేరుతో విజయనగరంలో జాతీయ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో శాసనమండలిలో పీడీఎఫ్ సభ్యులు చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో ఈ అంశాన్ని విస్మరించింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది డిమాండ్లపై వెంటనే స్పందించాలని కోరుతున్నాము.
1. గురజాడ అప్పారావు పేరుతో విజయనగరంలో జాతీయ సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పడానికి తగిన చర్యలు చేపట్టాలి.
2. లౌకిక అభ్యుదయ విలువలతో కూడిన గురజాడ దేశభక్తి గేయం ‘దేశమును ప్రేమించుమన్నా’ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఆలపించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి.
- తెలకపల్లి రవి, రాష్ట్ర గౌరవాధ్యక్షులు
- కెంగారమోహన్, రాష్ట్ర అధ్యక్షులు
- కె. సత్యరంజన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి







కామెంట్‌లు (0)