సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాసేవకు.. పరిపాలనలో కీలక పాత్రకు బాటలు...

59 నిమిషాల క్రితం

group
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 04:45 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

APPSC గ్రూప్– 1, 2026

ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న యువతకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మరో ముఖ్యమైన అవకాశాన్ని అందించింది. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన గ్రూప్‌–1 సర్వీసుల్లో 163 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఈ నెల 15న విడుదల చేసింది. అక్టోబరు 6 నుంచి 27వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తుది వివరణాత్మక నోటిఫికేషన్‌లో వయోపరిమితి, రిజర్వేషన్లు, విద్యార్హతలు, ఇతర నిబంధనలు పూర్తి స్థాయిలో ఉంటాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్‌–1 ఉద్యోగం అంటే కేవలం ఒక ప్రభుత్వ కొలువు మాత్రమే కాదు. ప్రజలకు చేరువగా ప్రభుత్వ పరిపాలనను నిర్వహించే అవకాశం. జిల్లాలు, రెవెన్యూ, పోలీసు, విద్య, పన్నులు, రవాణా, పంచాయతీరాజ్‌, పురపాలక, సహకార, ఆర్థిక తదితర రంగాల్లో ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో ఈ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమైనది.

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 13 రకాల పోస్టులకు 163 ఖాళీలుఉన్నాయి.

డిప్యూటీ కలెక్టర్లు 11

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ 14

డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) 36

డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌) 3

జిల్లా విద్యాశాఖాధికారులు 14

రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్లు 3

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి 1

డిప్యూటీ రిజిస్ట్రార్లు 15

మున్సిపల్‌ కమిషనర్లు గ్రేడ్‌–2 12

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ 2

జిల్లా ఉపాధి అధికారి 3

అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 14

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు 35

మొత్తం 163 పోస్టులు. పోస్టుల సంఖ్య సంబంధిత శాఖల నుంచి తుది నిర్ధారణ ఆధారంగా మారే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పోస్టులకు 14 ఖాఖాళీలు ఉన్నాయి. విద్యారంగంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రాధాన్యం కలిగించే అంశం. జిల్లా విద్యాశాఖాధికారి స్థాయిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పర్యవేక్షణ, పాఠశాలల నిర్వహణ, విద్యా కార్యక్రమాల అమలు, ఉపాధ్యాయులు–విద్యార్థులకు సంబంధించిన పరిపాలనా అంశాలు, విద్యా నాణ్యత పెంపు వంటి విస్తృత బాధ్యతలు ఉంటాయి. అందువల్ల విద్యారంగంలో పనిచేయాలనుకునే అభ్యర్థులు కేవలం పరీక్షలో మార్కులు సాధించడంపైనే కాకుండా విద్యా హక్కు, పాఠశాల విద్య, ఉపాధ్యాయ వ్యవస్థ, బాలల హక్కులు, విద్యా విధానాలు, సామాజిక న్యాయం, ప్రభుత్వ విద్యా సంస్థల పాత్ర వంటి అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలి.

ప్రజల జీవితాలతో ముడిపడిన పోస్టులు

గ్రూప్‌–1లోని ప్రతి పోస్టుకూ ప్రత్యేక బాధ్యత ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్‌ రెవెన్యూ, సాధారణ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తారు. డీఎస్పీ శాంతిభద్రతలు, నేర నియంత్రణ వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వ ఆదాయ వ్యవస్థలో పనిచేస్తారు.

రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌కు రవాణా వ్యవస్థ, వాహనాల నమోదు, లైసెన్సులు, పర్మిట్లు, రోడ్డు భద్రత తదితర అంశాలతో సంబంధం ఉంటుంది. మున్సిపల్‌ కమిషనర్‌ పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలు, పారిశుధ్యం, పట్టణ పరిపాలన వంటి బాధ్యతలను నిర్వహిస్తారు.

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాల పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లా ఉపాధి అధికారి ఉద్యోగార్థులకు సంబంధించిన ఉపాధి సేవలు, ఉపాధి మార్గదర్శక కార్యక్రమాలతో అనుసంధానమై పనిచేస్తారు.

అంటే గ్రూప్‌–1లో చేరే ప్రతి అధికారి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యక్ష బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు ఇవే...

నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం ఎక్కువ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సమానమైన అర్హత అవసరం. అయితే డీఎస్పీ (కమ్యూనికేషన్స్‌) పోస్టుకు సంబంధిత ఇంజినీరింగ్‌ విద్యార్హత అవసరం. డీఎస్పీ పోస్టులకు శారీరక ప్రమాణాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు కూడా వర్తిస్తాయి. తుది వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత అభ్యర్థులు తమకు సంబంధించిన అర్హతలను తప్పనిసరిగా పరిశీలించాలి.

పరీక్ష విధానంపై స్పష్టత అవసరం

గ్రూప్‌–1 ఎంపిక ప్రక్రియలో ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాథమిక పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో, ఓఎంఆర్‌ ఆధారంగా జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు ప్రతికూల మార్కు ఉంటుంది.

ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. సాధారణ అధ్యయనాలు, చరిత్ర–సంస్కృతి, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, భౌగోళిక అంశాలు వంటి విషయాలతో పాటు సామాన్య మానసిక సామర్థ్యం, విజ్ఞాన సాంకేతిక రంగాలు, పర్యావరణం, ప్రస్తుత వ్యవహారాలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

ప్రధాన పరీక్షలో తెలుగు, ఆంగ్లం అర్హత పత్రాలతో పాటు వ్యాసం, చరిత్ర–సంస్కృతి–భౌగోళికం, రాజ్యాంగం–పాలన–చట్టం–నైతికత, ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి, విజ్ఞాన సాంకేతికత–పర్యావరణ అంశాలకు సంబంధించిన పేపర్లు ఉంటాయి. ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు.

ప్రిపరేషన్‌ ఇలా..

గ్రూప్‌–1కు సిద్ధమయ్యే విద్యార్థులు మొదటి రోజు నుంచే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. పాఠ్యాంశాన్ని కేవలం కంఠస్థం చేయడం కాకుండా ప్రతి అంశాన్ని సమాజంతో అనుసంధానించి అర్థం చేసుకోవాలి.

రాజ్యాంగం చదివేటప్పుడు ప్రజల హక్కులు, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, స్థానిక సంస్థలు, సామాజిక న్యాయం వంటి అంశాలను పరిశీలించాలి. ఆర్థిక వ్యవస్థ చదివేటప్పుడు వ్యవసాయం, పరిశ్రమలు, పేదరికం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

చరిత్ర చదివేటప్పుడు తేదీలు, సంఘటనలు మాత్రమే కాకుండా సామాజిక సంస్కరణ ఉద్యమాలు, స్వాతంత్య్రోద్యమం, సమాజ పరివర్తన వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణ అంశాలను చదివేటప్పుడు వాతావరణ మార్పులు, సహజ వనరులు, జీవ వైవిధ్యం, కాలుష్యం వంటి అంశాలను ప్రస్తుత పరిణామాలతో అనుసంధానించాలి.

ప్రస్తుత వ్యవహారాలు కీలకం

గ్రూప్‌–1 అభ్యర్థికి రోజువారీ పరిణామాలు, తాజా అంశాలపై అవగాహన అత్యంత అవసరం. రాష్ట్రం, దేశం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సంక్షేమం, పరిశ్రమలు, స్థానిక సంస్థల పరిణామాలను ప్రత్యేకంగా గమనించాలి.

వార్తా పత్రికలను చదవటంతోపాటుగా చదివిన వెంటనే ఆయా అంశాలను పరీక్షా అంశంతో అనుసంధానించుకునే అలవాటు పెంచుకోవాలి. ఉదాహరణకు ఒక పర్యావరణ సమస్య కనిపిస్తే దాని కారణాలు, ప్రభావాలు, రాజ్యాంగపరమైన అంశాలు, ప్రభుత్వ చర్యలు, పరిష్కార మార్గాలను ఆలోచించాలి. ఈ పద్ధతి ప్రధాన పరీక్షలో వ్యాసరచనకు కూడా ఉపయోగపడుతుంది.

ప్రజాసేవకు తొలి మెట్టుగా చూడాలి

ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో అభ్యర్థులు మార్కుల కోసం మాత్రమే కాకుండా జ్ఞానం కోసం చదవాలి. గ్రూప్‌–1 అధికారి భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన వంటి అంశాలపై విద్యార్థులు లోతైన అవగాహన పెంచుకోవాలి.

గ్రూప్‌–1 లక్ష్యం కేవలం ఉద్యోగం కాదు.. ప్రజలకు మెరుగైన సేవ అందించే బాధ్యతను స్వీకరించే అవకాశం. ఆ దృక్పథంతో చదివినప్పుడే పోటీ పరీక్షకు సన్నద్ధతతో పాటు సమాజంపై అవగాహన కూడా పెరుగుతుంది.

అభ్యర్థులకు ఉపయోగపడే 10 ముఖ్యమైన చిట్కాలు :

1. సిలబస్, పరీక్ష విధానంపై పూర్తి అవగాహన:

ప్రిలిమ్స్ (Prelims), మెయిన్స్ (Mains) సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రతి సబ్జెక్టులో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవడం ప్రాథమిక సూత్రం.

2. ప్రిలిమ్స్ & మెయిన్స్ సమగ్ర ప్రిపరేషన్ :

ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటినీ వేర్వేరుగా చూడకుండా మొదటి నుంచే కలిపి ప్రిపేర్ అవ్వాలి. కాన్సెప్టులను అర్థం చేసుకుంటూ చదవడం వల్ల రెండు దశలకూ మేలు జరుగుతుంది.

3. ప్రామాణిక పుస్తకాల ఎంపిక :

ఎక్కువ పుస్తకాలను మార్చకుండా ప్రామాణికమైన సేకరించిన మెటీరియల్స్ (ఉదా: NCERT, తెలుగు అకాడమీ, లక్ష్మీకాంత్ పాలిటీ) మాత్రమే ఉపయోగించాలి.

4. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అంశాలపై దృష్టి :

AP చరిత్ర, AP ఆర్థిక వ్యవస్థ (AP Economy & Socio-Economic Survey), AP విభజన చట్టం (Reorganisation Act) రాష్ట్రాభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.

ఎక్కువ పుస్తకాలను మార్చకుండా ప్రామాణికమైన సేకరించిన మెటీరియల్స్ (ఉదా: NCERT, తెలుగు అకాడమీ తరచూ చదవాలి ).

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అంశాలపై దృష్టి :

AP చరిత్ర, AP ఆర్థిక వ్యవస్థ (AP Economy & Socio-Economic Survey), AP విభజన చట్టం (Reorganisation రాష్ట్రాభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.

5.కరెంట్ అఫైర్స్ నిరంతర అధ్యయనం :

రోజూ ప్రముఖ తెలుగు దినపత్రికలు, ఇంగ్లీష్ దినపత్రికలు చదవండి. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు AP రాష్ట్ర వార్తలకు ప్రాధాన్యత ఇవ్వండి.

6.సొంత నోట్స్ తయారీ :

ముఖ్యమైన కాన్సెప్ట్‌లు, డేటా, కరెంట్ అఫైర్స్‌ను సొంత మాటల్లో షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోవడం వల్ల చివరి నిమిషంలో రివిజన్ సులభమవుతుంది.

7. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ :

మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ కాబట్టి, రోజువారీగా కనీసం 2-3 ప్రశ్నలకు సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇది మీ ప్రెజెంటేషన్, సమయ నిర్వహణ (Time Management) నైపుణ్యాలను పెంచుతుంది.

8. పాత ప్రశ్నపత్రాల పరిశీలన :

గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను (PYQs) సాధించడం ద్వారా ప్రశ్నల సరళి, క్లిష్టత స్థాయిని సరిగ్గా అంచనా వేయవచ్చు.

9. మాక్ టెస్టులు, రివిజన్ :

క్రమం తప్పకుండా ప్రిలిమ్స్ మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా నెగెటివ్ మార్కింగ్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు చదివిన విషయాలను ప్రతివారం రివిజన్ చేయడం చాలా అవసరం.

10. సమయపాలన, క్రమశిక్షణ : రోజుకు 6-8 గంటల సమర్థవంతమైన స్టడీ ప్లాన్ అమలు చేయండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.

..................................................................................

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌–1లోని పోస్టులు రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన బాధ్యతలను కలిగి ఉంటాయి. పోస్టు పేరుతో పాటు హోదా, నియామక స్థాయి, ప్రధాన విధులు, అధికార పరిధి, ప్రజలతో సంబంధం తెలుసుకోవడం పరీక్షా దృష్ట్యా కూడా ఉపయోగకరం.


- కె.ఎస్. లక్ష్మణరావు

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు,

మాజీ శాసనమండలి సభ్యులు,

సెల్ : 8309965083


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్