సమాజంలో మహిళల హక్కులు, గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, అవకాశాలు వంటి అంశాలను శతాబ్దంన్నర క్రితమే ధైర్యంగా, స్పష్టంగా పలికిన మహానుభావుడు గురజాడ అప్పారావు. ఆయన రచనలు కేవలం సాహిత్య, భాషా వికాస పతాకాలు మాత్రమే కాదు. సమాజాన్ని కదిలించిన, మనుషులను మేల్కొలిపిన, మహిళాభ్యుదయానికి మార్గదర్శకమైన అభ్యుదయ కేతనాలు. గురజాడ గారి 'కన్యాశుల్కం' (1892) తెలుగు సాహిత్యంలోనే కాదు, భారతీయ సామాజిక చరిత్రలో కూడా ఒక మైలురాయి. ఈ నాటకం మహిళలకు జరుగుతున్న అన్యాయాలను చాకచక్యంతో కూడిన వ్యంగ్యంతో, ఘాటైన విమర్శతో, మానవతా దృక్పథంతో బహిర్గతం చేసింది. బాల్యవివాహం, కన్యాశుల్కం, పితృస్వామ్య ఆధిపత్యం, వేశ్యలపై ద్వంద్వ నైతికత వంటి సమస్యలను గురజాడ కేవలం ప్రస్తావించలేదు. మహిళకు విద్య, స్వేచ్ఛ, ఆత్మగౌరవం అవసరమని పాత్రల వ్యక్తిత్వ ప్రకటన ద్వారా నిరూపించారు. ఆయన పాత్రలు, ముఖ్యంగా మధురవాణి, సంప్రదాయ నైతికతను సవాలు చేస్తూ మహిళా స్వరాన్ని ప్రతిధ్వనింపజేస్తాయి. స్త్రీ విద్యావంతురాలయితే సమస్యలను ఎలా పరిష్కరించుకోగలదో, పరిష్కరించగలదో కమలిని, మధురవాణి పాత్రల ద్వారా చూపించారు గురజాడ. ఇక్కడ విద్యావంతురాలు అంటే డిగ్రీలు పొందిన మహిళ అని కాదు. విద్వత్తు, వినయంతో కూడిన వికాసం చెందిన స్త్రీ అని అర్థం. డిగ్రీలు ఉన్న ఎందరో మహిళలు ఈనాటి సమాజంలో ఆత్మాహుతి చేసుకోవడం చూస్తున్నాం.
గురజాడ రచనలు ఒక స్పష్టమైన మానవతా తత్త్వాన్ని ప్రతిబింబిస్తాయి. “సమాజం పురోగమించాలంటే మహిళ పురోగమించాలి” అన్నది గురజాడ శాస్త్రీయ ప్రతిపాదన. విద్యే విముక్తి. మహిళ చదువుకుంటే కుటుంబం, సమాజం, దేశం ఎదుగుతుందని ఆయన నమ్మకం. స్వేచ్ఛే శక్తి. మహిళ తన జీవితంపై నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగి ఉండాలి. సమానత్వమే సమాజ నైజం కావాలి. స్త్రీ, పురుషుల మధ్య సమాన హక్కులు అభివృద్ధికి హేతువు. ఇవి గురజాడ చెప్పిన ఆదేశసూత్రాలు. గురజాడ రచనల్లో మహిళలు బలహీనులు కాదు. ఆలోచించే వారు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ధైర్యం గలవారు. అన్యాయాన్ని ఎదిరించగలవారు. సమాజాన్ని మార్చగల చాతుర్యం గలవారు. మధురవాణి వంటి పాత్రలు నేటి మహిళా సాధికారతకు ప్రతీకలు. ఆమె ధైర్యం, ఆలోచనల్లో స్పష్టత, స్వతంత్రత, సామాజిక స్ఫూర్తి నేటి యువతికి కూడా ప్రేరణ. అవమానాలు, అసమానతలు అధిగమించి ఉత్తమ మానవులుగా ఎలా పరిణామం చెందగలరో నిరూపించే సామాన్య వనిత. గురజాడ సృష్టించిన మధురవాణి వేశ్య కాదు; ఒక చేతనాత్మక స్త్రీమూర్తిత్వానికి మూలవిరాట్.
లింగ వివక్ష, వేతన అసమానత, హింస, విద్య–ఉద్యోగాల్లో అడ్డంకులు, సామాజిక ఒత్తిళ్లు 21వ శతాబ్దంలో కూడా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు. ఇవన్నీ చూస్తే గురజాడ ఆకాంక్షలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని అనిపిస్తుంది. మహిళ వస్తువు కాదు, వ్యక్తి. ఆమె స్వేచ్ఛాజీవి. ఆమె నిర్ణయాలు ఆమెవే. ఇవి ఆయన చెప్పే రెండు శాశ్వత పాఠాలు. గురజాడ రచనలు మనకు ఒక శాశ్వత సత్యాన్ని గుర్తుచేస్తాయి. “దేశం అంటే భూభాగం కాదు; ప్రజలే దేశం. ప్రజల్లో సగం మహిళలు. వారిని గౌరవించని దేశం ఎదగదు.” నిష్ఠురమైనా, ఇబ్బందికరమైనా, కొన్ని విషయాలు నిష్పక్షపాతంగా ప్రస్తావించుకోవాలి. అప్రస్తుతమనిపించినా ప్రస్తావనకు సమంజసం అయిన విషయం ఏమంటే గురజాడ ఆశించిన స్త్రీ చైతన్యం, చలం ప్రతిపాదించిన విశృంఖలత్వం ఒకటి కాదు. విజ్ఞానంతో, విజ్ఞతతో కూడిన ఆలోచనల సారథ్యంలో క్లిష్ట సమస్యల పరిష్కారం వెదికే దిశగా పయనించే వనిత గురజాడ దర్శించిన ఆడపడుచు.
సమానత్వం అనే భావానికి వికృత భాష్యం గ్రహించి చరించే పడతులు నేటి ఆధునిక సమాజంలో ఎక్కువగా ఉండడం గమనార్హం. జీవించి జీవించనిచ్చే నియమం సకల జీవరాశులకు చెందినది. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులలో సద్భావనతో, సమభాగస్వామ్యంతో జీవించే ఉదాత్త భావన ఆధారంగా సమానత్వ భావన చెలామణీ అవుతున్నట్టుగా అనిపించడం లేదు. వికృత చేష్టలు, విశృంఖల ఆలోచనలలో స్త్రీ పురుష సమానత్వం గురజాడ సమాజ ఆశయం కాదు. గురజాడ దర్శించిన మహిళ ఉదాత్త వ్యక్తిత్వంతో కూడిన విశేష పయస్విని.
- ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ







కామెంట్‌లు (0)