కరువు సీమ రైతుల కలల సాకారం
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణా జలాలు విడుదల
వెలుగొండ రిజర్వాయర్ కు చేరుకున్న జలాలు
జలహారతి ఇచ్చి సిఎం సాష్టాంగ నమస్కారం
తొలి విడతలో 1.19 లక్షల ఎకరాల సాగునీరు
4 లక్షల జనాభాకు తాగునీరు
2028 నాటికి రెండో దశ పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు
ప్రజాశక్తి, మార్కాపురం: మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జల హారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కరవునేలను తాకిన కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా తరలించిన కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల మీదుగా గంటవానిపల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ వైపు పరుగులు తీశాయి. నల్లమల కొండలను చీల్చుకుని కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మకు స్థానిక మహిళలు, ప్రజలు పుష్పాలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పవిత్ర జలాలను సీఎం చంద్రబాబు అక్విడెక్టు వద్ద రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్విచ్ నొక్కి జలాలను దిగువకు వదిలారు.

30 ఏళ్ల క్రితం భూమిపూజ.. నేడు ప్రారంభం
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత 2026 ఆగస్టు 31న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తున్నానని చెప్పారు. సీఎం మాట్లాడుతూ.. "ఆ రోజు చేసిన సంకల్పం.. ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారింది. ఇది భగీరథ ప్రయత్నం. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం. కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం. శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మ.. మార్కాపురం చెన్న కేశవుడు కొలువైన నేలకు జలహారతి ఇస్తోంది. మాట ఇచ్చాం.. ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణమ్మను తరలించాం. ఇక సంపద సృష్టిస్తాం. మార్కాపురం గడ్డకు, కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్ బాధలు భరించిన కుటుంబాలకు, నీటి కోసం ఎదురు చూసి అలసిపోయిన తరాలకు కృష్ణా జలాలతో కొత్త ఊపిరి ఇస్తున్నాం."అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నిర్వాసితుల త్యాగాలకు పాదాభివందనం
వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం అన్నారు. రైతుల త్యాగం లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. "ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేవారు ఎంత సంతోషంగా ఉంటారో.. నిర్వాసితులు కూడా అంతే సంతోషంగా ఉండాలి. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్వాసితుల బాధలు, అవసరాలను గుర్తించి అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నాం. కటాఫ్ తేదీని పెంచి 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందించాం. రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి మొదటి దశను పూర్తి చేశాం. 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి అయ్యాయి. తొలిదశలో భాగంగా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తరలిస్తాం. 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలిగొండ పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలు, కడప జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాల్వ కింద 3.70 లక్షల ఎకరాల ఆయకట్టు సుస్థిరం అవుతుంది. కృష్ణమ్మ రాకతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ అనే పదం గత చరిత్రగా మిగిలిపోతుంది. వెలిగొండ అంటే ఫ్లోరైడ్ కష్టాలకు ముగింపు. కరువు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర." అని ముఖ్యమంత్రి అభివర్ణించారు.

వెలిగొండకు 2019లో గ్రహణం.. 2024లో విముక్తి
"2019లో గొడ్డలి పార్టీ అధికారంలోకి రావడంతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. విలువైన నిర్మాణ కాలాన్ని వృథా చేశారు. నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి అరకొరగా చెల్లింపులు చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పడం, రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగానే జాతికి అంకితం చేశామని ప్రకటించడం ప్రజలను మోసం చేయడమే. రెండు సొరంగాలు మొత్తం తిరిగానని చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎందుకు ఇవ్వలేదు. గొడ్డలి పార్టీ హయాంలో సొరంగాల్లో టీబీఎం యంత్రం ఇరుక్కు పోవడంతో పనులు పూర్తికాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సమస్యలను పరిష్కరించి పనులు పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జలాలను అందించింది. చరిత్రను ఎవరూ తిరగ రాయలేరు. ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడతాం. చెడును ఖండించాలి. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా ఉండాలి."అని సీఎం వ్యాఖ్యానించారు.

మార్కాపురంలోనూ 2028 కృష్ణా పుష్కరాలు
వెలిగొండ ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. వెలిగొండ ఫేజ్-2ను కూడా 2028 నాటికి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని, రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌లో మార్కాపురాన్ని భాగం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే ఎన్డీఏ విధానమని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యలకు నదుల అనుసంధానమే పరిష్కారమని చంద్రబాబు అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తరలిస్తున్నామని, తదుపరి వంశధార వరకూ తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి అనుసంధానం జరగాలని, మహానది-గంగానదులను అనుసంధానిస్తే దేశం సుభిక్షంగా మారుతుందని ఆకాంక్షించారు. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని చెప్పారు. ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి భూగర్భజలంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందామని చంద్రబాబు అన్నారు. గోదావరి జలాలు నల్లమల సాగర్ వరకూ రావాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు.

సంప్రదాయ పంచెకట్టుతో ఉల్లాసంగా..
తెలుగు సంప్రదాయ పంచె కట్టుతో వెలిగొండ సొంరంగాల ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు జల హారతి ఇచ్చారు. కృష్ణా జలాలు పసుపు కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర జలాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులపై చల్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫీడర్ కాలువ వద్ద కృష్ణమ్మ ప్రవాహానికి ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేశారు. సంప్రదాయ నృత్యాలతో కృష్ణా జలాలకు గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. బహిరంగ సభా వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంపుపై కండువా తిప్పుతూ రైతులకూ, ప్రజలకూ ముఖ్యమంత్రి అభివాదం చేశారు. దివంగత పూలసుబ్బయ్య కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పలకరించి సన్మానించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు పనిచేసిన అధికారులు, ఉద్యోగాలు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి. నారాయణ, కందుల దుర్గేష్, కొలుసు పార్ధసారధి, అనగాని సత్యప్రసాద్, గుమ్మిడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)