రాష్ట్రంలో ప్రైవేటు పరిశ్రమల్లో భూములు పోయిన ఏ ప్రాంతంలోనూ నిర్వాసితులు, స్థానిక యువతకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ, ఉపాధి లభించడంలేదు. ఉపాధి లేక పరిశ్రమల చుట్టూ తిరుగుతున్న నిర్వాసితుల గోడు ప్రభుత్వాలకు, ఆ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులకూ వినబడుతున్నట్లు లేదు. పరిశ్రమాధిపతులకు కావాల్సినంత భూమి, కోరినన్ని సదుపాయాలు, రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు స్థానిక యువతకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం కనీస దృష్టి పెట్టడంలేదు. 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్ యాజమాన్యం ఎకరా రూపాయి చొప్పున అచ్యుతాపురంలో వెయ్యి ఎకరాలు పొందింది. రెండు దశాబ్దాలు గడుస్తున్నా వెయ్యి రూపాయలకు పొందిన వెయ్యి ఎకరాల్లో సగం భూమి కూడా బ్రాండిక్స్ యాజమాన్యం వినియోగంలోకి తీసుకురాలేదు. 22 వేల మందికి మించి ఉపాధి కల్పించలేదు.
ఉత్తరాంధ్రలో గతంలో వలసలు, నిరుద్యోగం, వెనుకబాటుతనం వుండేవి. ఇక్కడ నుంచి ఇప్పుడు వలసలు కాదు, ఇక్కడికి వలసలొస్తారు' అని ఈ ఏడాది ఏప్రిల్ 28న తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలివి. ఉద్యోగాలొస్తాయో, రావోనని అనుమానాలున్న వారికి ఈ మాటలతో ఉద్యోగాలు ఖాయమన్న అభిప్రాయం కలుగుతుంది. చౌకగా భూముల కేటాయింపు, శంకుస్థాపనల గడబిడంతా చూస్తే పరోపకారానికి పారిశ్రామికాధిపతులంతా ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తున్నట్లు అన్పించినా ఆశ్చర్యంలేదు. గతంలో పరిశ్రమల్లో భూములు పోయి, ఉపాధి లభించక బతకడానికి తల మునకలవుతున్న దీనుల గాధలు వింటే ప్రభుత్వం చెబుతున్నవన్నీ వినసొంపు మాటలేనని తేలిపోతుంది.
రాజకీయాధికారం కోసం ఆడని అబద్ధం లేదు. తర్లువాడ, రాంబిల్లిలో అదానీ చేతుల మీదుగా నిర్మితమయ్యే గూగుల్ డేటా సెంటర్‌ను బిల్డింగ్ అండ్ కనస్ట్రక్షన్ ప్రాజెక్టు కింద...'ఏ' కేటగిరి పరిధి నుంచి తప్పించి ‘బి2’ కేటగిరీ కింద...ఇచ్చిన అనుమతులు వెనుక అదానీ లబ్ధి ఇమిడి వుందన్నది బహిరంగ రహస్యం. ఈ డేటా సెంటర్ దుష్ప్రభావాలు ప్రజలకు తెలీకుండా దాచిపెట్టడానికి పర్యావరణ ప్రభావ అంచనా, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించలేదు. పర్మినెంట్, కాంట్రాక్టు ఉద్యోగులు 1375 మందికి మించి అవసరం వుండరని గూగుల్ తన నివేదికలో పేర్కొంది. అయినా కూటమి ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలొస్తాయని ఊదర గొడుతోంది. వలస పాలకులు వనరులు తరలించుకు పోతున్నప్పుడు ఇప్పటి మోడీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం వలె మాట్లాడారు. జనుముతో స్థానికులకు ఉద్యోగాలొస్తాయని ఉత్తరాంధ్రంలోని చిట్టివలస, నెల్లిమర్ల జూట్ పరిశ్రమ యజమాన్యాలు విపరీతంగా రాయితీలు పొందాయి.
విశాఖ గూగుల్ డేటా సెంటర్‌తో 1.8 లక్షలకు పైగా ఉద్యోగాలొస్తాయని గొప్పగా చెప్పుకొనే ప్రభుత్వం, శంకుస్థాపన రోజు పత్రికలకు ఇచ్చిన మొదటి పేజీ అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ఉపాధి ఊసే ఎత్తలేదు. గిగావాట్ హైపర్ స్కేల్ ఏ.ఐ డేటా సెంటర్‌లో లక్షల ఉద్యోగాల డొల్లతనం ప్రభుత్వానికి తెలుసు కనుకనే ఈ అంశం ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకుంది. నక్కపల్లి ప్రైవేటు మిట్టల్ స్టీల్ ప్లాంట్‌లో భూములు, ఇళ్లు పోయిన వారికి పూర్తిగా పునరావాసమే కల్పించని ఈ ప్రభుత్వం, ప్రైవేటు మిట్టల్ స్టీల్, గూగుల్ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర గతి మారిపోతుందని చెబితే ఎవరు నమ్మతారు? ఈ భ్రమలతో యువతను ఎంత కాలం మోసగిస్తారు?
పరిశ్రమలకు భూములు కేటాయించినప్పుడు, రాయితీలు ప్రకటించినప్పుడు, ఉపాధి లభ్యతపై చెప్పిన, చెబుతున్న మాటలతో ప్రజలను ప్రభుత్వం మోసగిస్తున్నది తప్ప...విద్యార్హత కల్గిన నిర్వాసితులు, స్థానికులకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవడంలేదు. పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించేందుకు తెచ్చిన ‘ఉపాధి కల్పన చట్టం-2019’ ఈ రోజు వరకు అమలు కాలేదంటే స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పం ఈ ప్రభుత్వాలకు లేదని అర్ధమవుతోంది. నిర్వాసితులైన భూ యజమానుల కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన చట్టాలను ప్రభుత్వాలు నీరుగార్చుతున్నాయి. ఇప్పటికే ఆరంభమైన, చట్టం చేసిన తరువాత ప్రారంభించిన పరిశ్రమలన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుందని 2019 జులై 22న ఎ.పి శాసనసభలో ప్రవేశ పెట్టిన బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. జాయింట్ వెంచర్లు, పిపిపి విధానం కింద చేపట్టిన ప్రాజెక్టులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని వివరించింది. రాష్ట్రంలో స్థిర నివాసం కల్గిన వారిని స్థానికులని నిర్వచిస్తూ...ఉద్యోగ నియామకాల విషయంలో జిల్లా, జోన్‌ల ఆధారంగా స్థానిక అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వుందని తెలిపింది. స్థానిక ప్రాంతంలో అర్హులైన, తగినంతమంది అభ్యర్ధులు లేకపోతే మూడేళ్లలో పరిశ్రమలు తమ అవసరాలకు తగినట్లు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి నియమించుకోవాలి.
స్థానిక యువతకు, నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పన గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సర్వస్వమూ కోల్పోయిన కుటుంబాల్లోని పద్దెనిమిదేళ్లు నిండిన యువతకు ప్యాకేజీ ప్రకటించడానికి నోరు రావడంలేదు. పరిహారం చెల్లించడానికి ఈ ప్రభుత్వాలకు చేతులు రావడంలేదు. ఆదాయ పన్ను కట్టాల్సి వస్తుందని బ్రిటన్ నుంచి పరారై తన వ్యాపార కేంద్రాన్ని స్విట్జర్లాండ్‌కు, నివాసాన్ని దుబారుకు మార్చిన ప్రపంచ ఉక్కు వ్యాపారిగా పేరొందిన లక్ష్మీ నివాస్ మిట్టల్ వంటి అపర కుబేరులకు రూ.వేల కోట్లు రాయితీలు ఇస్తున్నాయి. ప్రజలిచ్చిన రాజ్యాధికారాన్ని కార్పొరేట్ల వ్యాపారావసరాల కల్పనకు ఉపయోగిస్తున్నాయి.
బంగారు బాతు లాంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దెబ్బ తీసి, పరిశ్రమ పెట్టని మిట్టల్‌కు రూ.20 వేల కోట్ల విలువైన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది. 8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కల్గిన మిట్టల్ స్టీల్ 2029 జనవరి నాటికి పూర్తవుతుందని చెప్పిన కొద్ది రోజులకే మాట మార్చి, తొలి దశ పనుల కాల పరిమితిని 2029 నుంచి 2031కు ప్రభుత్వం పెంచింది. మిట్టల్‌కు కేటాయించిన భూమిపై వంద శాతం యాజమాన్య హక్కు కల్పించింది. మిట్టల్‌కు రాయితీల రూపంలో ప్రజాధనం దోచిపెట్టినా తొలి దశలో ప్రత్యక్ష ఉపాధి మూడు వేల మందికి లభిస్తుందని ఇఐఎ నివేదికలో పేర్కొంది.
రాష్ట్రంలో ప్రైవేటు పరిశ్రమల్లో భూములు పోయిన ఏ ప్రాంతంలోనూ నిర్వాసితులు, స్థానిక యువతకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ, ఉపాధి లభించడంలేదు. ఉపాధి లేక పరిశ్రమల చుట్టూ తిరుగుతున్న నిర్వాసితుల గోడు ప్రభుత్వాలకు, ఆ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులకూ వినబడుతున్నట్లు లేదు. పరిశ్రమాధిపతులకు కావాల్సినంత భూమి, కోరినన్ని సదుపాయాలు, రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు స్థానిక యువతకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం కనీస దృష్టి పెట్టడంలేదు. 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్ యాజమాన్యం ఎకరా రూపాయి చొప్పున అచ్యుతాపురంలో వెయ్యి ఎకరాలు పొందింది. రెండు దశాబ్దాలు గడుస్తున్నా వెయ్యి రూపాయలకు పొందిన వెయ్యి ఎకరాల్లో సగం భూమి కూడా బ్రాండిక్స్ యాజమాన్యం వినియోగంలోకి తీసుకురాలేదు. 22 వేల మందికి మించి ఉపాధి కల్పించలేదు.
ఉపాధి లేక ఏడాది పొడవునా వలసలు పోతున్న వాస్తవాన్ని విస్మరించిన పాలకులు దార్శనికులవుతారా? రానురానూ జన జీవితాలు దారుణంగా తయారౌతున్నప్పటికీ, తామేదో సాధించామని వార్షికోత్సవాల్లో చెప్పి మురిసిపోయిన ప్రభుత్వాలకు, ఇవే మాటలతో దేశాన్ని దోచుకు తిన్న ఇంగ్లీషోడికి తేడా ఏముంది? పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో కల్పించిన ఉపాధిపై పరిశ్రమల వారీగా స్థానిక, నిర్వాసిత, ప్రాంతీయేతర ఉపాధి లభ్యతపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రభుత్వం తన జవాబుదారీతనం నిరూపించుకున్నప్పుడే యువతలో నెలకొన్న అనుమానాలు కొన్నైనా తొలగిపోతాయి.

/ వ్యాసకర్త సెల్: 94900 99487/
గుల్ల కాంతారావు









కామెంట్‌లు (0)