శనివారం, 28 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రమాద ఘంటిక !

2 గంటల క్రితం

food
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

​ ‘‘తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్’’ అన్నాడు గురజాడ. ఇటీవల ఐసిఎంఆర్‌, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) విడుదల చేసిన ‘‘సంపద’’ (ఎస్‌ఎఎంపిఎడిఎ) సర్వే ఫలితాలు ఆ మాటల అవసరాలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ సర్వే దేశంలో రక్తహీనత, పోషకాహార లోపాల తీరును స్పష్టంగా ఎత్తిచూపింది. 2023–25 మధ్య 183 జిల్లాల్లో, 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, 81 వేలకు పైగా కుటుంబాల నుంచి రెండు లక్షల మందిని పరిశీలించింది. ఫలితాలు గత జాతీయ సర్వేల కంటే తక్కువ రక్తహీనత స్థాయిలను చూపినా సమస్య తీవ్రంగానే ఉంది. 15–49 ఏళ్ల మహిళల్లో 55.9 శాతం మంది రక్తహీనతతో ఉన్నారు. పాలిచ్చే తల్లుల్లో ఇది 58.1 శాతం. కౌమార బాలికల్లో 46.3 శాతం, గర్భిణుల్లో 43.6 శాతం, ఏడాది నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో 41.8 శాతం. అంటే మన ఇళ్లలో సగం మంది మహిళలకి రక్తం తగినంత లేదు. వయోజన పురుషుల్లో 22 శాతంగా ఉంది.

దేశ సగటు అలా వుండగా ఆంధ్రప్రదేశ్ గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 12–59 నెలల పిల్లల్లో 57.5 శాతం మందికి రక్తహీనత ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. గుజరాత్ (56.5%), ఛత్తీస్‌గఢ్ (55.6%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు 41.8 శాతం కాగా, మనం దానికంటే దాదాపు 16 పాయింట్లు పైన ఉన్నాం. 5–9 ఏళ్ల పిల్లల్లో 32.0 శాతం (జాతీయ సగటు 31.3%), కౌమార బాలికల్లో 51.9 శాతం (జాతీయ సగటు 46.3%), బాలురలో 26.9 శాతం (జాతీయ సగటు 22.8%) మంది బాధితులు. వయోజన మహిళల్లో (20–59 ఏళ్లు) 68.2 శాతం, 15–49 ఏళ్ల మహిళల్లో 68.5 శాతం మంది రక్తహీనతతో ఉన్నారు. జాతీయ సగటులు 54.8, 55.9 శాతాలు. అంటే రాష్ట్రంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరికి పైగా బాధితులే. 20–59 ఏళ్ల పురుషుల్లో మాత్రం 21.3 శాతంతో జాతీయ సగటు (22.0) స్థాయిలోనే ఉన్నాం. అంటే సమస్య ప్రధానంగా మహిళల్లోనే ఉంది. ఇంకా తీవ్రమైనది వృద్ధ మహిళల పరిస్థితి. 60 ఏళ్లు దాటిన మహిళల్లో 81.7 శాతం మంది రక్తహీనతతో ఉన్నారు. జాతీయ సగటు 55.7 శాతం. ఇందులోనూ దేశంలో అత్యధికం మనదే. ఆ వయసులో నీరసం, పడిపోవడం, గుండె సంబంధిత సమస్యలకు రక్తహీనత మరింత ఆజ్యం పోస్తుంది. 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో కూడా 62.5 శాతం మందికి రక్తహీనత ఉంది (జాతీయ సగటు 44.7 శాతం). ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్నింటా జాతీయ సగటును మించగా, కేరళంలో వయోజన మహిళల్లో 28 శాతం, చిన్నారుల్లో 14.5 శాతమే ఉంది. కేరళం సాధించిన మెరుగుదల ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు సాధ్యం కాలేదు? లోపం వనరుల్లోనా, అమలులోనా, పర్యవేక్షణలోనా అన్నది ప్రభుత్వాలు సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రక్తహీనతను ఐరన్ లోపంతో మాత్రమే ముడిపెట్టలేం. కౌమార బాలికల్లో, 15–49 ఏళ్ల మహిళల్లో ఐరన్ లోపంతో కూడిన రక్తహీనత వరుసగా 26.9, 26.7 శాతమే. విటమిన్ బి12 లోపం మరింత ఆశ్చర్యకరం. కౌమార బాలికల్లో 65.4 శాతం, బాలురలో 66.1 శాతం, గర్భిణుల్లో 63.1 శాతం మందికి ఈ లోపం ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాదు. కౌమార బాలికల్లో గ్రామీణంలో 66.5, పట్టణంలో 61.7 శాతం; బాలురలో గ్రామీణంలో 65.3, పట్టణంలో 68.6 శాతం మందికి బి12 లోపం ఉంది. ఈ లోపం రక్తహీనత ఉన్నవారిలో, లేనివారిలో దాదాపు ఒకేలా ఉందని నివేదిక చెబుతోంది. అంటే హిమోగ్లోబిన్ సాధారణంగా ఉన్నవారిలోనూ పోషక లోపం పీడిస్తుంది. అయితే సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే చాలామందిని సాధారణ స్థితికి తేవచ్చు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టి తొలి దశలోనే పౌష్టికాహారం, వైద్య సంరక్షణ అందిస్తే సమస్యను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఐరన్ మాత్రలతోనే సమస్య పరిష్కారమవుతుందని భావించకుండా, ఇతర కారణాలనూ గుర్తించి తగిన చికిత్స అందించాలి. రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు పప్పుధాన్యాలు, వంట నూనె, చిరుధాన్యాలు వంటి పోషక విలువలున్న ఆహార పదార్థాలను సబ్సిడీపై అందించాలి. అలాగే జిల్లాల వారీగా, సామాజిక తరగతుల వారీగా రక్తహీనత మూలాలను అధ్యయనం చేయాలి. ఐరన్ లోపమా, బి12 లోపమా, మలేరియా, నులిపురుగులు, సికిల్ సెల్ ఎనిమియా, తలసేమియా వంటి వంశపారంపర్య కారణాలా అని తేల్చాలి. అన్నింటికీ ఒకే పరిష్కారం కాకుండా, ఎవరికి ఏ లోపం ఉందో పరీక్షించి చికిత్స అందించేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. అంగన్‌వాడీ, ఆశా వ్యవస్థలు చిన్నారులు, గర్భిణులకే పరిమితం కాకుండా 60 ఏళ్లు పైబడిన వారినీ పరిధిలోకి తీసుకోనే విషయం పరిశీలించాలి. ప్రత్యేకించి వయోవృద్ధుల ఆరోగ్య కేంద్రాలు నిర్వహించడమూ ప్రభుత్వ కర్తవ్యంగా వుండాలి. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ ఆహారంలో గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, బలవర్ధక ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజారోగ్య రంగానికి జిడిపిలో కనీసం 5 శాతం నిధులు కేటాయించాల్సిన అవసరముంది. పౌర సమాజ ఒత్తిడితోనే అది సాధ్యమవుతుంది.​

‘వికసిత భారత్’ అంటూ ఊదరగొడుతున్న దేశంలో సగం మంది మహిళలు నీరసంతో, రక్తం చాలక, శక్తి లేక జీవిస్తుంటే ఆ కల ఎలా నిలుస్తుంది? పాలకులు దీన్ని హెచ్చరికగా భావించాలి. పొలంలో పనిచేసే రైతు మహిళ, బడికి వెళ్లే బాలిక, ఇంటి పనుల్లో అలసిపోయే గృహిణి, ఒంటరిగా మిగిలిన వృద్ధురాలు... వీరందరిలో సత్తువ తగ్గిపోతుంటే సంపన్న దేశం ఎలా సాధ్యమవుతుంది? ఆరోగ్యవంతమైన పౌరులతోనే అది సాకారమవుతుందనేది స్పష్టం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్