శనివారం, 28 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాలం చెల్లిన కట్టుకథలు ఇంకానా?

3 గంటల క్రితం

modi fails
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 04:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

"కొంతమందిని అంతకాలం, అందరినీ కొంత కాలం మోసం చేయవచ్చు; కానీ అందరినీ అంతకాలం మోసం చేయగలగడం అసాధ్యం." అనేది ఒక పరమ సత్యమైనా, ప్రపంచవ్యాప్తంగా పరిపాలకులు ఎప్పటికీ దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధం కాలేరు. నరేంద్ర మోడీ కూడా అటువంటి పాలకులలో ఒకరనేది సుస్పష్టమే. హత్య చేసి కూడా తప్పించుకోగలనని, ఎటువంటి పరిణామాలు లేకుండా ఏ తప్పునైనా చేయగలననే అతివిశ్వాసం ఆయనది. ప్రజల దృష్టి దారి మళ్లింపు, అబద్ధపు ప్రచారాలు, వట్టి గొప్పలతో కాలం గడపడంలో సుదీర్ఘ కాలంగా పండిపోయి వుండటమే ఇందుకు కారణం.

మొన్న నవంబర్ 19న ప్రధానమంత్రి వస్తూత్పత్తి రంగాన్ని చీల్చిచెండాడారంటే ఈ గడుసుతనమే కారణం. కంపెనీలు ఉపాధిని, వేతనాలను పెంచడంలో విఫలమయ్యాయని, ఎగుమతిదారులు అత్యుత్తమ నాణ్యత కలిగిన వస్తువులను దేశం దాటించేస్తున్నారని, అలాగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి పరిశ్రమలు సిద్ధంగా లేవని ఆయన తీవ్ర విమర్శలే చేశారు. ఇదొక చార్రితాత్మక అవకాశం పోగొట్టుకోవడమేనన్నారు.

‘‘గత కొన్ని సంవత్సరాలలో భారత దేశం ప్రపంచవ్యాపితంగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకుంది.’’ అని మోడీ చెప్పారు. మరి ఫిక్కీలో మీరంతా ఎప్పుడైనా ఒకసారి కూర్చుని వీటి గురించి ఆలోచించారా? అని ఆయన అడిగారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులతో ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందంటే ద్వారాలు తెరచుకున్నాయని అర్థం. అయినా సరే నేనే మీ దగ్గరకు వచ్చి ఏం చేయాలో చెప్పాలా? అని మోడీ ప్రశ్నించారు.​

అయితే భారత్‌లో పేదరిక నిర్మూలనకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రపంచ బ్యాంక్ గుర్తించిందని పేర్కొనడం మాత్రం మోడీ మర్చిపోలేదు. అయితే, 'పీపుల్స్ డెమోక్రసీ' పత్రిక గణాంకపరమైన లోపాలను ఇప్పటికే వివరంగా ఎత్తిచూపించింది.

ఇంతకూ ప్రధాని భారతీయ కార్పొరేట్ సంస్థలపై ఇలా కృత్రిమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ కొత్త ప్రయత్నానికి ఎందుకు పూనుకోవాల్సి వచ్చింది?​

వైఫల్యాల ఒప్పుకోలు​

పెట్టుబడులను పెంచడంలో, ఉపాధి కల్పించడంలో, కార్మికుల వేతనాలను పెంచడంలో విఫలమైనందుకు ఆయన అక్కడ ఉన్న పారిశ్రామిక నాయకులను మందలించారు. ఫిక్కీ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలు వరుసగా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించినప్పటికీ ఇలా జరగడం, ఆయన ప్రభుత్వ ఆర్థిక విధానాల వైఫల్యానికి ఒక ముఖ్యమైన ఒప్పుకోలుగా నిలుస్తాయి. కార్పొరేట్ పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చినంత మాత్రాన అవి స్వయంచాలకంగా ఉత్పాదక పెట్టుబడులుగా మారవని, ఉపాధిని సృష్టించవని లేదా కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవని ఆయన అంగీకరించడం ద్వారా స్పష్టమవుతోంది.

ఆర్థిక గణాంకాలు ఈ వైరుధ్యాన్ని బయటపెడుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ లాభాలు జిడిపి లో 4.8 శాతానికి చేరుకున్నాయి. ఇది గత 15 ఏళ్లలో అత్యధికం. 22.3 శాతం ఎగబాకాయన్నమాట. అదే సమయంలో, ఉపాధి వృద్ధి కేవలం 1.5 శాతంగా మాత్రమే ఉంది. స్టాక్ మార్కెట్‌లో నమోదైన కంపెనీల ఉద్యోగుల వేతన వ్యయాలు అంతకు ముందు ఏడాది 17 శాతంగా ఉంటే ఈ ఏడాది కేవలం 13 శాతం మాత్రమే పెరిగాయి. ఇటీవల, నీతి ఆయోగ్ కూడా 2026 నవంబర్ లో 14 ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకా(పి.ఎల్‌.ఐ) లపై జరిపిన సమీక్ష ప్రకారం, 2026 మార్చి నాటికి ఇవి తమ పెట్టుబడి లక్ష్యంలో 76 శాతాన్ని, ఉత్పత్తి లక్ష్యంలో 64 శాతాన్ని సాధించాయి. కానీ, ఉపాధి కల్పన లక్ష్యంలో మాత్రం కేవలం 28 శాతాన్ని మాత్రమే చేరుకోగలిగాయి. సుమారు 30.18 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి గాను, కేవలం 8.49 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి.​

కార్పొరేట్లకే మూటలకొద్దీ... ​

2019లో కార్పొరేట్ పన్నులను తగ్గించడం వల్ల ఏటా సుమారు రూ. 1.45 లక్షల కోట్ల ఆదాయ కోత సంభవించింది. మరోవైపు, 2014–15 , 2022–23 మధ్య కాలంలో బ్యాంకులు భారీ పరిశ్రమలు, సేవా రంగాలకు ఇచ్చిన రూ. 7.41 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. దివాళా చట్టం నిబంధనల కింద (ఐ.బి.సి) తేల్చివేయబడిన కార్పొరేట్ కేసులలో, రుణగ్రస్తుల నుంచి రావలసిన దానిలో కేవలం 33 శాతం మాత్రమే తీసుకుని సరిపెట్టేశారు.​

ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండటం గ్రామీణ ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతోంది. కార్పొరేట్ సంస్థలకు పన్ను మినహాయింపులు కల్పించడం వల్ల, ప్రజావసరాల వ్యయానికి కేటాయింపులు చేసే సత్తా ప్రభుత్వానికి లేకుండా పోతున్నది. మరోవైపు భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌.టి.ఎ లు) కుదుర్చుకుంటోంది. వీటిని ప్రభుత్వం ఒక "చారిత్రాత్మక అవకాశం"గా అభివర్ణిస్తోంది.​

ఉపాధి కోత, ఉద్యమాల మోత​

" ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ వంటి పథకాలపై ఆగస్టు 9 నాటి అధికారిక గణాంకాలను పరిశీలిస్తే, కేవలం 7.67 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించబడినట్లు తేలింది. జులై లో వి.బి. గ్రామ్‌‌జీ పథకం కింద సృష్టించబడిన ఉపాధి దినాలు గత ఏడాది ఇదే నెలలో ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ కింద నమోదైన 15.33 కోట్ల ఉపాధి దినాలతో పోలిస్తే 49.94 శాతం తక్కువగా ఉన్నాయి.

గొప్ప ఆశలతో ఊరించిన 'వి.బి గ్రామ్‌జి ' పథకం ప్రారంభమైన మొదటి నెలలోనే గ్రామీణ ఉపాధి గణనీయంగా పడిపోవడాన్ని బట్టి చూస్తే అసమానతలను, గ్రామీణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి... మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించడమే పరిష్కారంగా కనిపిస్తుంది.

భరించలేని స్థాయిలో అసమానతలు, దారుణమైన నిరుద్యోగ సమస్య తీవ్ర నిస్పృహకూ అభద్రతా భావానికి కారణం అవుతున్నాయి. యువజనులు, జెన్‌ ‌జీ గత పన్నెండేళ్ల పాలనలో ఎన్నడూ లేనంత అసహనానికి లోనవుతున్నారు. ఈ ఆగ్రహం ఎంత స్పష్టంగా ఉందంటే, అధికార పక్షానికి చెందిన నీచ కుట్రల విభాగం, బిజెపి ఐటీ విభాగం నడిపించే చీలిక వ్యూహాలు, మతాలవారీ తదితర గుర్తింపు రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలూ పూర్తిగా విఫలమవుతున్నాయి.

ప్రస్తుతం సమాజం నుండి బలంగా వినిపిస్తున్న డిమాండ్‌ బాధ్యతాయుత పాలన ‌కావాలన్నదే. విద్య, ఆరోగ్యం వంటి కీలక సామాజిక రంగాలలో ప్రభుత్వ రంగాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యం చేయడం, ప్రైవేట్ సంస్థలు కేవలం లాభాపేక్షతో వ్యవహరించడం వల్ల ప్రజలకు సేవలు అందించడంలో విఫలం కావడం కారణంగా వారిలో సామూహిక నిరసన పెల్లుబుకుతోంది. ఈ బాధ్యతాయుత పాలన గురించిన డిమాండే, విద్యాశాఖ మంత్రి పదవి నుండి తొలగింపునకు దారితీసింది.

అత్యంత కర్కశమైన పద్ధతులతో అణచివేయ చూస్తున్నప్పటికీ ప్రతిపక్షాల ఊపును అడ్డుకోవడంలో, తగ్గించడంలో పాలక వ్యవస్థ విఫలమవుతున్నదంటే అదెంత బలహీనపడిపోయిందో స్పష్టమవుతోంది. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కునే కాలరాయడానికి ప్రయత్నించడం ద్వారా, ఈ పాలక వ్యవస్థ తన అసలు స్వరూపాన్ని మరింతగా బయటపెట్టుకుంటోంది.

కూలిన నియంతలు ​

ప్రపంచంలో ప్రస్తుతం కానవస్తున్న ధోరణుల నేపథ్యంలో, ప్రధాని మోడీలో నిరాశా నిస్పృహలు స్పష్టంగా బయిట పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మితవాద నిరంకుశ నాయకులు దారిపొడవునా కుప్పకూలిపోతున్నారు. హంగేరీలో ఓర్బన్, సెర్బియాలో వుచిచ్‌లు దీనికి ప్రధాన ఉదాహరణగా కనిపిస్తారు. ఎన్నికల్లో మట్టికరిచిన ఫ్లావియో బోల్సోనారో బ్రెజిల్ వదిలి పారిపోవాల్సి వచ్చింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా రోజురోజుకూ దిగజారిపోతున్నది. ‘సర్‌’ బాగోతాలు, అలాగే 2024 ఎన్నికలకు సంబంధించి బయిటపడుతున్న లోగుట్టులు, ఇతర వెల్లడింపులు మోడీ ప్రభుత్వ విశ్వసనీయతను, చట్టబద్ధత ఉనికినే సవాలు చేస్తున్నాయి.​

మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ చేయగలిగిందేమిటి? ఆయనకు బాగా తెలిసిన విద్యనే ప్రదర్శిస్తారు- కపట నాటకాలు, గావు కేకలతో హడావుడి మాత్రమే చేస్తారు. దాంతోపాటు 'కార్పొరేట్ సంస్థలపై విరుచుకు పడుతున్నట్టు' ఒక ఉత్తుత్తి నాటకం నడపడం. ఇది షేక్‌‌స్పియర్ చెప్పినట్లుగా, "అర్థంపర్థం లేని దండగమారి కోలాహాల ప్రదర్శన" మాత్రమే! ఫిక్కీ కార్యక్రమం ఇటువంటి నాటకానికి సరైన వేదికగా దొరికిందన్నమాట​

కానీ కాలం మారింది. పన్నెండేళ్ల చాలా సుదీర్ఘ కాలం తర్వాత కూడా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా వుండరు. నిజానికి, ప్రధానమంత్రిగా పన్నెండేళ్లు, అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మరో పదమూడేళ్లు- మొత్తం పాతికేళ్ల మోడీ 'ప్రజా సేవా ప్రహసనంలో, ' ఆశ్రిత కార్పొరేట్ ప్రీతి' లోతుగా వేళ్లూనుకుపోయింది. సర్కార్‌ ‌కార్పొరేట్‌ శక్తుల బంధం బలోపేతమైంది. ఇక్కడ 'ప్రజలు' అంటే గౌతమ్ అదానీ వంటి ప్రత్యేక మిత్రులు మాత్రమేననేది అసలైన అర్థం. ​

ప్రభుత్వ ఆస్తులను, వనరులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే 'గుజరాత్ నమూనా' నాటకం, ఇప్పుడు జాతీయ స్థాయిలో 'వికసిత్‌ భారత్' గా పరిపూర్ణంగా విప్పారింది! అయినా తన కట్టు కథనం శాశ్వతంగా కొనసాగుతుందని అనుకుంటున్నారా, ప్రధాని?​


(‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం-నవంబర్ 25 )

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్