శనివారం, 28 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కనీస వేతనాలు, పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ కోసం...

3 గంటల క్రితం

scheme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రావడానికి ముందు స్కీం కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. 2015లో భారత కార్మిక మహాసభ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ అమలు చేయాలని యాజమాన్యం, కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించాయి. అయినా నేటికీ వారికి కనీస వేతనాలు, పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ అమలు కావడంలేదు. ప్రమాద బీమా లేదు. పెన్షన్‌ లేదు. పదవీ విరమణ ప్రయోజనాలు లేవు. కార్మికులుగా గుర్తించకపోవడంతో సమిష్టి బేరసారాల హక్కు కూడా లేదు.

పథకాల బడ్జెట్‌ కోత

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో అంగన్వాడీ వర్కర్‌, హెల్పర్‌ (ఐ.సి.డి.ఎస్‌/సాక్షమ్‌ అంగన్‌వాడీ పోషణ) ఆశ కార్యకర్తలు, ఫెసిలిటేటర్లు (జాతీయ ఆరోగ్య మిషన్‌) మధ్యాహ్న భోజన కార్మికులు, (ఎం.డి.ఎం, పి.ఎం పోషణ), వెలుగు, వివోఏ, ఆర్‌.పి, జాతీయ ఆరోగ్య మిషన్‌, సమగ్ర శిక్ష, సెకండ్‌ ఏ.ఎన్‌.ఎం, ఉపాధి హామీ, అర్బన్‌ హెల్త్‌, 104, 108 తదితర సంక్షేమ పథకాల్లో దాదాపు కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 60 లక్షల మంది మహిళా కార్మికులు. వీరందరూ పేద ప్రజలకు ఆరోగ్యం, ఆహారం, విద్య, ఉపాధి వంటి అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఈ పథకాల వల్ల సమాజంలో చాలా మేలు జరిగింది. మాతా, శిశు మరణాలు తగ్గించడానికి హాస్పటళ్లలో డెలివరీ శాతం పెరగడానికి, స్కూల్లో డ్రాపవుట్‌ శాతం తగ్గించడానికి, విద్య, ఉపాధి అవకాశాలు పెంచడానికి కీలకంగా పని చేశాయని అనేక స్వచ్ఛంద సంస్థలు, ‌యునిసెఫ్‌, సుప్రీంకోర్టుతో సహా కితాబిచ్చాయి. ఈ పథకాలను బలహీనపరచడానికి బడ్జెట్‌ తగ్గించారు. ఐ.సి.డి.ఎస్‌ లో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి సెంటర్లని కుదించే పని వేగవంతం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర, ఇస్కాన్‌ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి కార్మికులను తొలగించే పని చేస్తున్నారు.

ఆచరణలో లేని వికసిత భారత్‌

మోడీ ప్రభుత్వం చెబుతున్న వికసిత్‌ భారత్‌, విశ్వగురు బేటీ బచావో, బేటీ పఢావో...అన్నీ నినాదాలకే పరిమితమైనాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మన దేశంలో 50.6 శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడంలేదు. 79 కోట్ల మంది ప్రజలు ఆహారం కోసం రోజుకి 350 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి లేదు. వేతనాలు తగ్గిపోవడం, నిత్యవసర సరుకుల ధరలు పెరగడం, విద్యా వైద్యం కోసం తమ ఆదాయంలో అత్యధిక భాగం ఖర్చు చేయాల్సి వస్తుండడంతో ఆరోగ్యాన్ని కాపాడుకోలేని స్థితి పెరుగుతున్నది.

కనీస వేతనాల అమలులో నిర్లక్ష్యం

స్కీం వర్కర్లకు గౌరవ వేతనం, పనికి తగ్గ పారితోషకం, ప్రోత్సాహకం రకరకాల పేర్లతో అతి తక్కువ వేతనం ఇస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.1000 (సంవత్సరంలో 10 నెలలకు) అంగన్‌వాడీ వర్కర్లకు రూ.4,500, హెల్పర్లకు రూ.2250, ఆశా కార్యకర్తలకు 2 వేలు మాత్రమే ఇస్తున్నారు. వీరికి 2014 నుండి పారితోషకాలు పెంచలేదు. అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.1500, హెల్పర్‌కు రూ.750, మినీ వర్కర్లకు రూ.1250 పెంచాము. దీపావళి కానుకగా అమలుచేస్తామని 2018లో ప్రకటించినా ఇంతవరకు అమలు కాలేదు. ఆశా కార్యకర్తలకు పారితోషకాన్ని నెలకు 3,500కు పెంచుతామని 2025 జులై లో పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించినా అది కూడా అమలు కాలేదు. రకరకాల యాప్‌లు తెచ్చి ఆన్‌లైన్‌ వర్క్‌తో పనిభారం పెంచారు. రోజుకు 10-12 గంటలు పని చేస్తున్నప్పటికీ అధిక శాతం స్కీమ్‌ ‌వర్కర్లకు ప్రసూతి సెలవులు కూడా లేవు. అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని 2022లో సుప్రీంకోర్టు చెప్పినా నేటికీ అమలవడంలేదు.

కార్మికులకు నెలకు రూ.42 వేలు ఇవ్వాలి

మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులకు నష్టం చేసే లేబర్‌ కోడ్లను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల కనీస వేతనం రోజుకు రూ.178 నిర్ణయించారు. అంటే నెలకు రూ.4628 మాత్రమే. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, కరంట్‌ బిల్లులు, ఇంధనం ధరలు నిరంతరం పెరిగినా కనీస వేతనాల్లో మార్పు లేదు. కార్మికుడు రోజుకు 2700 క్యాలరీల పోషకాహారం, నలుగురు సభ్యులున్న కుటుంబానికి సంవత్సరానికి 66 మీటర్ల క్లాత్‌, ఇంటి అద్దె, విద్యా, వైద్యం, వినోదం, పండుగలు, వృద్ధాప్యం, వివాహం తదితర అవసరాల కోసం కనీస వేతనంగా సుప్రీంకోర్టు సూచన మేరకు రూ.42 వేలు నిర్ణయించాలి. దీన్ని అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ కార్యక్రమం జరుగుతున్నది.

లేబర్‌ కోడ్స్‌ ప్రమాదం

కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేసి 2026 ఏప్రిల్‌ నుండి 4 లేబర్‌ కోడ్స్‌ అమలుకు పూనుకున్నది. ఈ లేబర్‌కోడ్స్‌ వలన కనీస వేతనాలు తగ్గించడంతో పాటు, 8 గంటల పని విధానానికి మంగళం పాడుతున్నారు. ఉద్యోగ భద్రత కాలరాశారు. సమ్మె చేయకుండా ఆటంకాలు విధిస్తున్నారు. కోట్లాదిమంది కార్మికులను కార్మిక చట్టాల వెలుపలికి నెట్టివేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మోడీ భజన చేస్తూ రాత్రిపూట కూడా మహిళలు పని చేయవచ్చని అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. పని హక్కుని కాలరాస్తూ ఉపాధి హామీ చట్టానికి నిధులకు కోత పెట్టారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం

ఇటీవల మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, పౌరసత్వ హక్కులను తొలగించే ప్రయత్నంలో ఉంది. ‘సర్‌’ ప్రక్రియ వల్ల అన్యాయంగా 13 కోట్ల మంది ఓటు తొలగించారు. ఈ నిరంకుశ పాలనకు అంతం పలకడానికి ఢిల్లీలో పెద్ద పోరాటమే జరుగుతున్నది. నీట్‌ నిర్వహణలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువతరం చేసిన మిలిటెంట్‌ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘అగ్నివీర్‌’ సర్వీసు కాలాన్ని అదనంగా రెండు సంవత్సరాలు పెంచారు. ‘సర్‌’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్ద పోరాటాలు నిర్వహిస్తున్నాయి. అదే స్ఫూర్తితో లేబర్‌ కోడ్స్‌ రద్దు కోసం, స్కీం వర్కర్ల రెగ్యులరైజేషన్‌ కోసం, కనీస వేతనం రూ.42,000, పెన్షన్‌, పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ అమలు, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి, భూమి నీరు అడవిని రక్షించుకోవడానికి, ‘సర్‌’ రద్దుతో పాటుగా ఇతర సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 1,2,3 తేదీల్లో ఢిల్లీని ఆక్రమిద్దాం. హక్కుల్ని సాధించుకుందాం. ​

( వ్యాసకర్త సి.ఐ.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్ష‍ురాలు)

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్