మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయ వ్యవస్థ భిన్న కోణాలు ...

2 గంటల క్రితం

Different Facets of the Judicial System
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 08:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

గత కొద్ది రోజులుగా దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ నుంచి భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఒక వైపు, తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, కార్మిక చట్టాల పరిధిని కుదించే దిశగా ఒక కీలక తీర్పు వెలువరించింది. మరో వైపు, ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎల్‌యు) స్నాతకోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్యం, భిన్నాభిప్రాయ హక్కు, న్యాయవాద వృత్తి గురించి న్యాయమూర్తులు స్వతంత్ర అభిప్రాయాలు బలంగా వినిపించారు. ఈ రెండు ఘటనలు న్యాయ వ్యవస్థలోని భిన్న దృక్పథాలకు సంకేతాలు. జస్టిస్‌ వి.ఆర్.కృష్ణ అయ్యర్ నేతృత్వంలో 1978లో ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన బెంగళూరు వాటర్ సప్లై తీర్పును, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం 5:4 మెజారిటీతో పరిశ్రమ పరిధిని కుదించి వేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం కింద 'పరిశ్రమ' అనే పదానికి జస్టిస్‌ కృష్ణ అయ్యర్ విస్తృత అర్థం కల్పించి, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు చట్టపరమైన రక్షణ కల్పించారు. ఆ ‘ట్రిపుల్ టెస్ట్’ సూత్రాన్ని ఇకపై కొత్త పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020) వ్యాఖ్యానానికి ప్రామాణికంగా తీసుకోబోమని తాజా తీర్పు స్పష్టం చేయడం, కార్మిక వర్గానికి తీరని దెబ్బ. ఇది ఏకగ్రీవ తీర్పు కాదన్న సంగతి గమనార్హం. నలుగురు న్యాయమూర్తుల మైనారిటీకి నేతృత్వం వహించిన జస్టిస్ బి.వి నాగరత్న, ఈ కేసును 2005లో అత్యున్నత ధర్మాసనానికి రిఫర్ చేయడం సముచితమేనా అన్న దానిపైనే ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తారు. అంటే, తీర్పు సారాంశానికే కాక, ఈ రిఫరెన్స్ చెల్లుబాటుపైనే గట్టి భిన్నాభిప్రాయం ఉందని స్పష్టమైంది.

​ ఈ తీర్పును కేవలం చట్టపరమైన వ్యాఖ్యానంగా కాక, విస్తృత సామాజిక, ఆర్థిక సందర్భంలో కూడా చూడాల్సి వుంది. నలభైనాలుగు కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించడం మొదలుకొని, రక్షణల పరిధిని తగ్గించే దిశగా సాగుతున్న సంస్కరణల పరంపరలో ఇది కూడా ఒక భాగంగా కనిపిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు 30 కోట్ల మంది కార్మికులు పాల్గొన్న దేశవ్యాప్త సమ్మె ఈ దిశలో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పడుతుంది. చట్టపరమైన రక్షణలను విస్తరించాల్సిన తరుణంలో వాటిని కుదించడం ఎంతవరకు సబబు అన్నది చర్చనీయాంశం. అదే సమయంలో, విద్యాసంస్థల్లో భావప్రకటనా స్వేచ్ఛపై కూడా ఆందోళనకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కన్వొకేషన్‌లో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థులను నమోదు చేసుకోవద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) ఆగస్టులో ఆదేశం జారీ చేసింది. అయితే, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో బిసిఐ ఆ ఆదేశాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఉదంతం నేపథ్యంలోనే, జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్ ఎన్‌ఎల్‌యు వేదికపై మాట్లాడుతూ, విద్యార్థులు ప్రశ్నలు అడగడాన్ని, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడాన్ని శిక్షార్హమైన చర్యగా చూడటం రాజ్యాంగ విరుద్ధమని, అధికార దుర్వినియోగమని స్పష్టం చేశారు. ​

మాజీ న్యాయమూర్తి ఎస్. మురళీధర్ దీనికి మరో కోణాన్ని జోడించారు. ప్రధాని నరేంద్ర మోడీ వాడిన ‘‘దిమాగీ నక్సల్’’ అనే విమర్శనాత్మక పదజాలానికి జెన్-జీ తరం భయపడకుండా, జులై నిరసనల ద్వారా ప్రశ్నించే తత్వాన్ని ప్రదర్శించిందని ఆయన అభిప్రాయపడ్డారు. శాంతియుత నిరసనలను నేరపూరిత చర్యలుగా చిత్రీకరించడం, వ్యక్తిగత ఎంపికలను శిక్షార్హంగా మార్చే చట్టాలు, రాజకీయ, ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవడం వంటివి ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన హెచ్చరించారు. సభ్యుల గౌరవాన్ని పొందని బార్ కౌన్సిల్ న్యాయవృత్తికి మంచి సూచన కాదని జస్టిస్‌ బివి నాగరత్న హెచ్చరించారు. మాజీ జస్టిస్‌ మురళీధర్ మాటల్లో చెప్పాలంటే, న్యాయ వ్యవస్థలో పితృస్వామ్య, భూస్వామ్య అవశేషాలు ఇంకా కొనసాగుతున్నాయి. గత 12 ఏళ్లలో న్యాయమూర్తుల నియామకాల్లో కార్యనిర్వాహక జోక్యం చేసుకోవడమే దీనికి నిదర్శమని ఆయన స్పష్టం చేశారు. ఉత్తమ న్యాయమూర్తులను నియమించడంలో కొలీజియం పారదర్శకతను కొల్పోయిందని నర్మగర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, న్యాయమూర్తులను కేసులు పరిష్కరించే యంత్రాలుగా చూడటం, ఫిర్యాదుదారుల వాస్తవ అవసరాలను విస్మరించడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. జిల్లా కోర్టుల్లో 5.1 కోట్లు, హైకోర్టుల్లో 65 లక్షలు, సుప్రీంకోర్టులో 93 వేల కేసులు పెండింగ్‌లో ఉండటం కేవలం న్యాయమూర్తుల సంఖ్య పెంచడం వల్ల పరిష్కారం కాదని, ఇది లోతైన వ్యవస్థాగత సంస్కరణ అవసరాన్ని సూచిస్తుందని మాజీ జస్టిస్‌ మురళీధర్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు, అరాచక రాజ్యాధికారానికి మధ్య రక్షణ కవచంగా నిలవడంలో న్యాయవ్యవస్థ రికార్డు ఆశించినంత సంతృప్తికరంగా లేదని ఆయన తేల్చి చెప్పారు. జస్టిస్ చంద్రు ఒకసారి కృష్ణ అయ్యర్ తీర్పు రచనా శైలిని వర్ణిస్తూ, ఆయన నిర్ణయాల్లో నిఘంటువును, తీర్పులను, రాజ్యాంగ స్ఫూర్తిని మేళవించుకున్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తి నేటి న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా నిలవాలి. నిర్ణయాల్లో రాజ్యాంగాన్ని హృదయంగా చేసుకోవాలే తప్ప, పారిశ్రామిక, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదు.

కార్మిక చట్టాల పరిధి కుదింపు, విద్యార్థుల నిరసన హక్కుపై సందిగ్ధత, న్యాయవ్యవస్థ అంతర్గత సంస్కరణలపై చర్చ నేటి తక్షణావసరం. ఈ మూడు పరిణామాలు వేర్వేరుగా కనిపించినా, వాటి మధ్య ఒక ఉమ్మడి సారూప్యం ఉంది: రాజ్యాంగ విలువలు వేదికలపై ప్రసంగాలకే పరిమితం కాకుండా, శ్రామిక జనావళి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే తీర్పుల్లో కూడా ప్రతిఫలించాలి. అట్టడుగు వర్గాల పక్షాన నిలవడమే నిజమైన రాజ్యాంగ నైతికత అని న్యాయమూర్తులే స్వయంగా వేదికలపై చెబుతున్నప్పుడు, ఆ నిబద్ధత తీర్పుల్లో కూడా అంతే స్థిరంగా కనిపించాల్సిన అవసరం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్