- 10 వేల మందితో రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ
- ర్యాలీని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర : డి.రాజా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ‘మార్పు అవసరం’ నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మంగళవారం ‘ఢిల్లీ చలో’ ర్యాలీ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సుమారు 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతోపాటు జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు సభలో పాల్గొంటారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, యువతకు ఉపాధి కల్పించాలని, ప్రజారోగ్యం, విద్యా రంగాలను బలోపేతం చేయాలని, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. అయితే, ర్యాలీకి ముందుగానే అనుమతి ఇచ్చినప్పటికీ దానిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు పాల్పడుతోందని సిపిఐ విమర్శించింది. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో సిపిఐకి చెందిన పది మంది జిల్లా కార్యదర్శులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పేర్కొంది. కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, అరెస్టులను నిరసిస్తూ డి.రాజా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ర్యాలీ జరిగే రామ్‌లీలా మైదాన్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
సమీపంలోని మెట్రో స్టేషన్లను మూసివేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ర్యాలీలో పాల్గొనేందుకు కేరళ సహా ఐదు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి కార్యకర్తలు ప్రయాణించేందుకు ముందుగా బుక్ చేసుకున్న ఐదు రైళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని సిపిఐ విమర్శించింది. ఉత్తర భారత రాష్ట్రాల్లో సంఘ్ పరివార్ కార్యకర్తలు కూడా సిపిఐ కార్యకర్తలను ర్యాలీలో పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొంది. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. అయినప్పటికీ కార్యకర్తలు కొన్ని రోజుల ముందుగానే ఢిల్లీకి చేరుకుని ర్యాలీకి సిద్ధమయ్యారు.







కామెంట్‌లు (0)