సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

939కి చేరిన నేపాల్‌ మృతులు

1 గంట క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 01:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 4వేలమందికి పైగా గల్లంతు

- అనూహ్యమైన విపత్తును ఎదుర్కొంటున్నామన్న నేపాల్‌ ప్రధాని

- సొరంగాల్లో చిక్కుకున్న వారి కోసం ఆక్సిజన్‌ పంపుతున్న సహాయక బృందాలు

ఖాట్మండు : వరుసగా మృతదేహాలు బయటపడుతుండడంతో నేపాల్‌ ‌మెరుపు వరదల మృతుల సంఖ్య సోమవారానికి 939కి చేరుకుంది. కాగా గత వారం ఆకస్మికంగా విరుచుకుపడిన జల ప్రళయం నేపథ్యంలో గల్లంతైన 4,247మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. వీరిలో 99మంది భద్రతా సిబ్బంది కాగా, 591మంది విదేశీయులు. వీరంతా 39 దేశాలకు చెందిన వారు. ఇప్పటివరకు చిత్వాన్‌ ‌జిల్లా నుండి 272 మృతదేహాలను, నవలపరసి ఈస్ట్‌ ‌నుండి 207, నవల్‌‌పరసి వెస్ట్‌ ‌నుండి 151, గోర్ఖా జిల్లాల నుండి 62 మృతదేహాలను వెలికితీసినట్లు జాతీయ విపత్తు నిర్వహణా కేంద్రం ఎన్‌‌డిఆర్‌ఆర్‌ఎంఎ తెలిపింది. ప్రస్తుతం దేశం అనూహ్యమైన రీతిలో హృదయవిదారకమైన విపత్తును ఎదుర్కొంటోందని ప్రధాని బాలేంద్ర షా వ్యాఖ్యానించారు. వందల సంఖ్యలో మరణాలకు కారణమైన జల విలయం సృష్టించిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని, విధ్వంసాన్ని అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోందన్నారు.

సొరంగాల్లో చిక్కుకుపోయిన వందలాది మంది...

నేపాల్‌వ్యాప్తంగా 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల కింద ఉన్న సొరంగాల్లో దాదాపు 933 మంది ఇప్పటికీ చిక్కుకుపోయారని అంచనా. వీటిలో చాలా వరకు ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలతో ధ్వంసమైన భోటేకోశి-త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. అధికారులు డ్రోన్ సాయంతో ఒక సొరంగంలో గాలింపు చేపడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, అందులో ప్రాణాలతో ఉన్నవారు కనిపించకపోవడం అందోళన కలిగిస్తుంది. ఈ ప్రాజెక్టుల్లో చాలా వరకు టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ఆ జిల్లాలోనూ, పొరుగునే ఉన్న న్యువాకోట్ జిల్లాలోనూ ఉన్నాయి. తప్పిపోయిన వారిలో చాలామంది బురదతో నిండిన సొరంగాల్లో చిక్కుకుపోయి ఉంటారని లేదా నదీ ప్రవాహంతో పాటు కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే, అప్పర్ త్రిశూలి-1 ప్రాజెక్టు నుంచే 570 మందికిపైగా, అప్పర్ త్రిశూలి-3బి ప్రాజెక్టు నుంచి మరో 122 మంది చిక్కుకుపోయారని అంతర్జాతీయ మీడియా నివేధించింది. నేపాల్ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధి మోహన్ శాక్య ఆదివారం మాట్లాడుతూ, ఆక్సిజన్ సరఫరా, ఆహారం, నీరు అందించేందుకు కొన్ని సొరంగాల్లో రంధ్రాలు వేసినట్టు తెలిపారు.

సొరంగాల్లోకి చేరుకోవడమే పెద్ద సవాలు..

భారత్, చైనా నిపుణుల సహకారంతో వీలైనంత ఎక్కువ మందిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు సమయంతో పోటీ పడుతున్నాయి. లోయ గుండా కొట్టుకువచ్చిన బురద, బండరాళ్ల గోడ కారణంగా సొరంగాల్లో కుప్పకూలిన ప్రాంతాలు ఏర్పడటంతో, వాటిలోకి చేరుకోవడమే పెద్ద సవాలుగా మారింది. రెస్క్యూ బృందాలు పంచుకున్న చిత్రాలు, వీడియోల్లో భారీ యంత్రాలు టన్నుల కొద్దీ బురద, రాళ్లను తొలగిస్తూ రాత్రంతా పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో మోహరించిన నేపాల్ సైనికులు, సొరంగంలోకి పాకుతూ వెళ్లేందుకు తవ్విన గోతిలోకి టార్చిలైట్లు వేస్తున్న దృశ్యం సోషల్‌ ‌మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉధృతంగా సహాయక చర్యలు

నేపాల్‌‌లో సహాయక చర్యలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. సత్వరగతిన సాయమందించేందుకు వీలుగా నిపుణులను, అధునాతన పరికరాలను, టన్నుల కొద్దీ మానవతా సాయాన్ని అనేక దేశాలు పంపుతున్నాయి. భారత్‌, చైనాలు సొరంగాల్లో తవ్వకాలు జరిపేందుకు అవసరమైన నిపుణులు, సామాగ్రితో కూడిన సహాయక బృందాలను పంపించాయి. నేపాలీ జల విద్యుత్‌ ‌ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకుపోయిన వారిని చేరేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. లాంగ్‌‌టాండ్‌ ‌జల విద్యుత్‌ ‌ప్రాజెక్టు సొరంగంనుండి ఒక మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోపల చిక్కుకున్నవారు ఊపిరి పీల్చుకోవడానికి గానూ త్రిశూలీ-3ఎ సైట్‌ ‌వద్ద ఆక్సిజన్‌‌ను సొరంగంలోకి పంపిస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున ఆ సొరంగ ప్రాంతం వద్ద నియంత్రిత పేలుడును కూడా నిర్వహించారు. బురదను, శిధిలాలను తొలగించడానికి సహాయక సిబ్బంది అహరహం శ్రమిస్తున్నారు. ఇదిలా వుండగా,టిబెట్‌ ‌వైపు మరణించిన వారి సంఖ్య 16కి చేరింది. 546మంది గల్లంతయ్యారని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్