- సెప్టెంబర్ 1నుంచి 10వరకు నిరసనలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆందోళన వ్యక్తం చేసింది. ధరల పెరుగుదలకు నిరసనగా సెప్టెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిలు కె శ్రీదేవి, పి సావిత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పు, పప్పులు, వంట నూనెలు, పంచదార, బియ్యం, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగాయని వారు పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా వ్యయాలు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందని తెలిపారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో ధరల పెరుగుదల ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల ప్రభావం మహిళలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతోందని తెలిపారు. కుటుంబ ఖర్చులు పెరగడంతో మహిళలు కుటుంబ పోషణ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, పప్పులు, వంట నూనెలు, పంచదార తదితర నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నిల్వదారీ, అక్రమ వ్యాపారం, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పది రోజుల పాటు జరిగే ఆందోళలను విజయవంతం చేయాలని మహిళలు, ప్రజలకు వారు పిలుపునిచ్చారు.







కామెంట్‌లు (0)