మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​మా భూములు మాకిచ్చేయండి

54 నిమిషాల క్రితం

land iss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 01:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్న అగనంపూడి రైతులు

  • ‘సొంతదారులకు ఇస్తారా’ కథనంపై స్పందన

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : తాము గతంలో ఎపి రిఫ్రాక్టరీస్‌ పరిశ్రమ కోసం ఇచ్చిన భూములను తిరిగి తమకు ఇచ్చేయాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ‘ప్రజాశక్తి’ పత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘సొంతదారులకు ఇస్తారా..’ అన్న కథనంపై తాజాగా విశాఖ జిల్లా అగనంపూడి సమీప ప్రాంతానికి చెందిన భూములు కోల్పోయిన రైతులు స్పందించారు. ప్రజాశక్తితో మాట్లాడారు. ‘1980వ దశకంలో పరిశ్రమ వస్తుందని మా వద్ద ప్రభుత్వం కారుచౌకగా భూములు తీసుకుంది. పరిశ్రమ పెట్టినట్టే పెట్టి తక్కువ కాలంలోనే బోర్డు తిప్పేయడంతో మేమంతా భూములు, ఉపాధి కోల్పోయాం’ అని వాపోయారు. ఎపి రిఫ్రాక్టరీస్‌ ‌పరిశ్రమ కోసం కేటాయించిన 174.43 ఎకరాల్లో తమ తండ్రి లక్కరాజు పైడియ్య 30 ఎకరాలను ఎకరా రూ.1200కే ఇచ్చారని ఆయన కుమారులు లక్కరాజు రమణ, నాగేశ్వరరావు, గోవిందరాజులు తెలిపారు. ఏళ్లతరబడి భూములు కోల్పోవడం మిగిలింది తప్ప తమకేమీ ఒరగలేదని, కనీసం పరిశ్రమ అయినా కొనసాగి ఉంటే ఉపాధి లభించేదని వారంతా ఆవేదన చెందారు. ‘ఈ పరిశ్రమ కోసం 1979లో భూసేకరణ చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు.

మా భూమి మాకు ఇచ్చేయండి’ అంటూ పరిశ్రమ కోసం15 ఎకరాలు ఇచ్చిన రైతు వెంకటరమణ చెప్పుకొచ్చారు. ఇప్పటికి మూడో తరం తమ గ్రామాల్లో తయారైందని, భూములిచ్చినందుకు ఫలితం దక్కలేదని, ఉద్యోగాల్లేక తమ పిల్లలు, మనవళ్లు బయట ఊర్లకు వలస వెళ్లిపోయారని ఆవేదన చెందారు. పరిశ్రమ ఏర్పాటు చేసి ఉంటే ఉపాధి దొరికి వారు తమ వద్దే ఉండేవారని తెలిపారు. ఈ భూమంతా అగనంపూడి సమీప తలారివానిపాలెం, లక్కరాజుపాలెం ప్రాంతలవారిదేనని చెప్పారు. భూమి తమకు చెందాలని గతంలో కేసు వేశామని, హైకోర్టులో పెండింగ్‌‌లో ఉండడం, న్యాయం జరగకపోవడంతో తమకు బాధే మిగిలిందని వాపోయారు. రూ.రెండు వేల కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని కాపాడతామంటూ ఇటీవల అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌ ‌రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఆ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే, టిడిపి రాష్ర్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఆ సమావేశం తరువాత ఈ భూ వ్యవహారం మళ్లీ చర్చకు వచ్చింది.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్