శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అనంత’ కరువుకు అంతేది!

1 గంట క్రితం

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎల్‌‌నినోతో కకావికలం

- 3.85 లక్షల ఎకరాలు బీడు

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సమైక్య రాష్ట్రంలోనే నిత్యక్షామ పీడిత ప్రాంతంగా దేశమంతా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లా రైతాంగం ఎల్‌‌నినో ప్రభావంతో కకావికలమవుతోంది ఈ జిల్లా రైతాంగానికి కరువు కష్టాలు కొత్త కాదు. కానీ, ప్రతి ఏడాది వాన చినుకులు కొన్ని యైనా కురవక పోతాయా.. ఏదో విధంగా గట్టెకకపోతామా.. అన్న ఆశ వుండేది! ఈ ఏడాది ఆ ఆశ కూడా ప్రారంభంలోనే చచ్చిపోయింది. దీంతో సాగు విస్తీర్ణం ప్రారంభంలోనే గణనీయంగా తగ్గింది. తెగించి పంటలు వేసిన రైతాంగం పరిస్థితి ఘోరంగా మారింది. సాగెందుకు చేశామా అని తలలు పట్టుకుంటున్నారు. 'మూడు ఎకరాల్లో వేరుశనగ వేసి, లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను.. ఇప్పుడు కళ్ల ముందే పంట ఎండిపోతుంటే ఏంచేయాలో పాలుపోవడం లేదు' అంటూ శింగనమల మండలం సోదనపల్లి గ్రామానికి చెందిన రైతు వీరనారప్ప వ్యక్తం చేసిన ఆవేదన జిల్లాలోని కరువు పరిస్థితులకు అద్దం పడుతోంది.

ఎల్‌‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో జిల్లా వ్యాప్తంగా 55 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. మిగతా 45 శాతం భూమి బీటలువారింది. వేసిన పంటలు కూడా ప్రస్తుతం ఎండిపోతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం జూన్‌ ‌నుంచి ఆగస్టు ఆఖరు వరకు 208 మిల్లీమీటర్లు కాగా 121.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 41.8 శాతం వర్షపాతం లోటు ఉంది. 20 మండలాల్లో వర్షాభావం, ఆరు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది.

తుంగభద్ర సాగు లేనట్టే!

తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ కింద అనంతపురం జిల్లాలో 1.59 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు వస్తే కేవలం 40 వేల ఎకరాల్లో ఆరుతడికి మాత్రమే నీరిస్తామని ఇటీవల సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రతిపాదించారు. ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌ముగుస్తుండడంతో అది కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా ఆయకట్టు ప్రశ్నార్ధకంగా మారింది. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ పంటల సాగు 8.48 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధాన పంట అయిన వేరుశనగ 3.64 లక్షల ఎకరాలు. ఈ ఏడాది 1.70 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. సాధారణ సాగులో ఇది 30 శాతం. కంది పంట సాధారణ సాగు 1.93 లక్షల ఎకరాలు కాగా 2.24 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణ సాగుతో పొలిస్తే 116 శాతం అధికంగా సాగైంది. మొక్కజొన్న సాధారణ సాగు 53,519 ఎకరాలయితే 29,204 ఎకరాల్లో సాగైంది. ఆముదం 43,217 ఎకరాలకు గానూ సాగైంది 20,259 ఎకరాలు సాగైంది, వరి 56,505 ఎకరాలు కాగా 10,299 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి పంట సాధారణ సాగు 1.04 లక్షల ఎకరాలకు గానూ 60 వేల ఎకరాల్లో సాగైంది. ఇతర పంటలు 33,610 ఎకరాలకు గానూ 9277 ఎకరాల్లో సాగయ్యాయి. ఇలా అన్ని రకాల పంటలు సాధారణం కంటే తక్కువగానే సాగయ్యాయి. మొత్తంగా పరిశీలిస్తే 8.48 లక్షల ఎకరాలకు గాను 4.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 3.85 లక్షల ఎకరాల్లో ఇంకా విత్తనం కూడా పడలేదు.

​రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వం తక్షణం కరువు మండలాలు ప్రకటించి వర్షాభావంతో పంటలను కోల్పోయిన రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌‌రెడ్డి అన్నారు. ప్రజాశక్తితో ఆయన మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం లేదని అన్నారు. ఈసారైనా రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్