శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టిటిడి బోర్డు సమావేశాలు కొండపైనే ఎందుకు?

52 నిమిషాల క్రితం

ttd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 04:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి సమావేశాలు తిరుమల కొండపై నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఈ ఆనవాయితీని ఇప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఉంది.

టిటిడి ప్రధాన పరిపాలనా కార్యాలయం తిరుపతిలోనే ఉంది. ఇ.ఒ కార్యాలయం, జె.ఇ.ఒ కార్యాలయాలు, విజిలెన్స్ పరిపాలన వ్యవహారాలు నుంచి ఇంజనీరింగ్, ఎస్టేట్స్, విద్య, వైద్యం, మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్, ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక వ్యవహారాలే కాకుండా 15 రకాల ట్రస్టులు, ఎస్‌.వి భక్తి ఛానల్ తదితర ప్రధాన శాఖలన్నింటి పరిపాలనా వ్యవస్థ తిరుపతిలోనే కేంద్రీకృతమై ఉంది. అలాంటప్పుడు పాలకమండలి సమావేశాలను తిరుమలలో నిర్వహించాల్సిన అవసరం ఏమిటన్నది టిటిడి స్పష్టంగా చెప్పాలి.

పాలక మండలి సమావేశం ఉందంటే ముందురోజు నుంచే తిరుమలలో ఏర్పాట్లు మొదలవుతాయి. బోర్డు సభ్యులు, అధికారులు, ఆహ్వానితులు, వారి వెంట వచ్చే వారికి వసతి కల్పించేందుకు అనేక గదులు కేటాయించాల్సి వస్తుంది. పద్మావతి నగర్ ప్రాంతంలోని గదులతో పాటు, సన్నిధానం లాంటి ఇతర అతిథి గృహాలను బ్లాక్ చేస్తున్నారు. సాధారణ భక్తులకు కేటాయించాల్సిన గదులు పరిమితమవుతాయి. రవాణా, భద్రత, దర్శన ఏర్పాట్లపై అదనపు భారం పడుతుంది. పాలకమండలి సభ్యులకు సమావేశానికి ముందు, సమావేశం రోజు లేదా అనంతరం దర్శనాలు ఏర్పాటు చేయడం కూడా ఒక సాధారణ పద్ధతిగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి.

అధికార యంత్రాంగం మొత్తం కొండపైకి ఎందుకు?

టిటిడి పాలకమండలి సమావేశం ఒక చిన్న సమావేశం కాదు. టిటిడి పరిధిలో అధికారికంగా అనేక శాఖలు ఉన్నాయి. స్విమ్స్, చిన్నపిల్లల ఆసుపత్రి, విద్యాసంస్థలు, ట్రస్టులు, స్థానిక ఆలయాలు, ఇంజనీరింగ్ విభాగాలు, ఆరోగ్య సంస్థలు కలిపి చూస్తే ఇది ఒక సచివాలయం తరహాలో పనిచేసే విస్తృత వ్యవస్థ.

పాలకమండలి ఎజెండాలో ఇంజనీరింగ్ అంశం ఉంటే చీఫ్ ఇంజనీర్ నుంచి సంబంధిత అధికారులు హాజరవ్వాల్సి ఉంటుంది. కొనుగోళ్లపై అంశం ఉంటే మార్కెటింగ్, ప్రొక్యూర్‌మెంట్ అధికారులు రావాలి. విద్యాసంస్థలపై చర్చ ఉంటే విద్యాశాఖ అధికారులు, ఆసుపత్రులు, ఆరోగ్య అంశాలపై చర్చ ఉంటే వైద్య విభాగం అధికారులు రావాలి. ఎస్టేట్ వ్యవహారాలు, భూములు, ఆలయాల నిర్మాణం, శ్రీవాణి ట్రస్టు ద్వారా చేపట్టే ఆలయ నిర్మాణాలు, ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు, పోస్టుల సృష్టి, వేతనాలు, ప్రభుత్వ పే స్కేళ్ల అమలు, అనామలీస్, సంక్షేమ పథకాలు ఇలా అనేక అంశాలకు సంబంధించిన ఫైళ్లు, అధికారులు సమావేశానికి అవసరమవుతారు. ఇవన్నీ తిరుపతిలోని పరిపాలనా భవనంలోనే అందుబాటులో ఉండగా, అధికారులు ఫైళ్లతో సహా తిరుమలకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి?

పరిపాలనా భవనమే సరైన వేదిక

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో బోర్డు సమావేశాలను నిర్వహిస్తే... అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు. అవసరమైన ఫైళ్లను వెంటనే తెప్పించుకోవచ్చు. ఒక అంశంపై అదనపు సమాచారం కావాలంటే సంబంధిత అధికారిని వెంటనే పిలిపించుకోవచ్చు. సాంకేతిక వివరాలు, ఆర్థిక గణాంకాలు, పాత తీర్మానాలు, ప్రభుత్వ ఉత్తర్వులు వంటి సమాచారాన్ని సులభంగా పరిశీలించవచ్చు. దీంతో సమావేశాల్లో లోతైన చర్చకు అవకాశం ఉంటుంది. అధికారులకు కూడా తిరుమలకు ప్రయాణం, అక్కడ వసతి, వాహనాలు, ఇతర ఏర్పాట్ల అవసరం తగ్గుతుంది.

బోర్డు సభ్యుల సంఖ్యపై కూడా సమీక్ష అవసరం

గతంలో టిటిడి పాలక మండళ్లు పరిమిత సంఖ్యలో గరిష్టంగా 12 మందితో ఉండేవి. కాలక్రమేణా రాజకీయ పునరావాసంలో భాగంగా పాలకమండలి సభ్యత్వాలను ఉపయోగిస్తున్నారనే విమర్శలు పెరిగాయి. ప్రస్తుతం చైర్మన్ సహా అధికారిక సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు, ఇ.ఒ తదితరులను కలిపితే బోర్డు సంఖ్య దాదాపు 29కు చేరుతోంది. ఇంత పెద్ద బోర్డు నిజంగా సమర్థవంతమైన పరిపాలనకు అవసరమా? లేక రాజకీయ సమతుల్యత కోసం సంఖ్యను పెంచుతున్నారా? అనే అంశంపై కూడా చర్చ జరగాలి.

సమావేశం ఒక ‘తంతు’గా మారకూడదు

టిటిడి వార్షిక బడ్జెట్, కోట్ల రూపాయల కొనుగోళ్లు, నిర్మాణాలు, భూములు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఉద్యోగుల సమస్యలు, ఆలయాల నిర్వహణ వంటి అత్యంత ముఖ్యమైన అంశాలు బోర్డు ముందు వస్తాయి. ప్రతి అంశంపై సమగ్ర పరిశీలన జరగాలి. సంబంధిత శాఖల అభిప్రాయం తీసుకోవాలి. ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయాలి. ప్రజా ప్రయోజనం, భక్తుల ప్రయోజనం, ఉద్యోగుల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అయితే సమావేశానికి రావడం, దర్శనం చేసుకోవడం, కొన్ని ఎజెండాలకు ఆమోదం తెలపడం, సంతకాలు చేసి వెళ్లిపోవడం వంటి పరిస్థితి ఏర్పడితే పాలకమండలి అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది.

అనుబంధ సంస్థల సమావేశాల పరిస్థితి కూడా మారాలి

స్విమ్స్ వంటి పెద్ద వైద్య సంస్థలకు, గవర్నింగ్ కౌన్సిల్ కు ఛైర్మన్ గా టిటిడి చైర్మన్ ఉంటున్నారు. ఇలాంటి సంస్థలకు సంబంధించిన సమావేశాలను కూడా టిటిడి బోర్డు సమావేశాలకు అనుబంధంగా అరగంటో, గంటో నిర్వహించి ముగించడం సరైన పద్ధతి కాదు.

ఆసుపత్రుల అభివృద్ధి, వైద్య పరికరాలు, నియామకాలు, రోగుల సేవలు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రత్యేక సమయం కేటాయించి సమగ్రంగా చర్చించాలి. అదే విధంగా ట్రస్టులు, విద్యాసంస్థలు, ఇతర అనుబంధ సంస్థలకు సంబంధించిన సమీక్షలు కూడా వాటి ప్రాధాన్యతకు తగిన విధంగా నిర్వహించాలి.

టిటిడి తీసుకోవాల్సిన నిర్ణయాలు

తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి. తిరుపతి పరిపాలనా కేంద్రంగా పనిచేయాలి. టిటిడి పాలకమండలి సమావేశాలను సాధారణంగా తిరుపతిలోని పరిపాలనా భవనంలోనే నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టాలి. అత్యంత ప్రత్యేకమైన లేదా తిరుమలకు నేరుగా సంబంధించిన అంశం ఉన్నప్పుడు మాత్రమే అవసరమైతే తిరుమలలో సమావేశం నిర్వహించవచ్చు. బోర్డు సభ్యుల సంఖ్యను కూడా ప్రభుత్వం పునఃసమీక్షించాలి. పరిపాలనకు అవసరమైన మేరకు మాత్రమే సభ్యత్వాలను పరిమితం చేయాలి. బోర్డు సభ్యులతో పాటు సమావేశాలకు వచ్చే వారి సంఖ్యకు స్పష్టమైన పరిమితులు విధించాలి. సమావేశాల కారణంగా భక్తులకు కేటాయించే వసతి గదులను బ్లాక్ చేయకుండా చూడాలి. ప్రత్యేక దర్శనాల విషయంలో కూడా నియంత్రణ అవసరం. పాలకమండలి సమావేశం ఒక పరిపాలనా బాధ్యతగా ఉండాలి తప్ప ప్రత్యేక దర్శనాల అవకాశంగా మారకూడదు. ప్రతి పాలకమండలి సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలు, వాటి ఆర్థిక ప్రభావం, అమలు గడువు వంటి వివరాలను పారదర్శకంగా ప్రజలకు వెల్లడించాలి.


- వ్యాసకర్త: కందారపు మురళి,

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్