న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, రాంచీ, ముంబాయి, పాట్నా ఇలా దేశవ్యాపితంగా యువత వీధుల్లో తమ గళాన్ని వినిపిస్తున్నారు. బిజెపి నుండి కాంగ్రెస్ వరకు రాజకీయ పార్టీలు తమను సంప్రదించేలా ఒత్తిడి చేయగలుతున్నారు. ప్రస్తుత చట్ట సభల్లో 40 లేదా అంతకంటే తక్కువ వయసు వున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 384 మంది ఉన్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం విశ్లేషించింది. వీరిలో ముగ్గరిలో ఒకరు వంశపార్యపరంగా ఈ పదవుల్లోకి వచ్చిన వారే అని ఈ కథనం తెలిపింది. ఉపాధి, విద్య కోసం లక్షల మంది యువత పోరాడుతుంది. కొతమంది యువత మాత్రం ఆస్తితో పాటు, రాజకీయాలను వారసత్వంగా పొందుతున్న స్థితిని ఈ కథనం వెలుగులోకి తెచ్చింది.
లోకసభలో..
జెన్ జెడ్ అంటే 1997 మరియు 2012 మధ్య జన్మించినవారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు కావున 40 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిని జెన్ డి గా ఈ కథనం పరిశీలించింది. వీరు చట్టసభల్లో 384 మంది వున్నారు. అయితే వీరిలో 145 మంది (37.8 శాతం) వంశపారంపర్యంగా ఈ పదవుల్లోకి వచ్చినవారే. బిజెపికి వున్న 240 మంది లోక్‌సభ ఎంపీలలో, 40 ఏళ్లలోపు వయసున్న వారు తొమ్మిది మంది ఉండగా, వారిలో ఐదుగురు వంశపారంపర్యంగా వచ్చినవారు. కాంగ్రెస్‌కు వున్న 98 మంది ఎంపీల్లో 40 ఏళ్లలోపు వారు ఏడుగురు కాగా, నలుగురు వంశపారంపర్యంగా వచ్చారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 37 మంది లోక్‌సభ ఎంపీలలో ఏడుగురు వుండగా, ఆరుగురు వంశపారంపర్యంగా వచ్చినవారే. తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎంపీలలో 40 ఏళ్లలోపు వయసున్న వారు నలుగురు ఉండగా, వారందరూ వంశపారంపర్యంగా వచ్చినవారే. 40 ఏళ్లలోపు 11 మంది మహిళ ఎంపీలు ఉన్నారు (27.5 శాతం). ఇది మొత్తం లోక్‌సభలో మహిళల వాటా అయిన 14 శాతం కంటే చాలా ఎక్కువ. అయితే, వీరిలో ఎనిమిది మంది రాజవంశీకులు కావడం విశేషం.
శాసనసభల్లో
22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యక్షంగా లేదా పొత్తులో భాగంగా అధికారంలో ఉన్న బిజెపికి 1,811 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 121 మంది 40 ఏళ్లలోపు వయస్సు వారు కాగా, 41 మంది రాజకీయ కుటుంబాలనుండి వచ్చిన వారసులు వున్నారు. వారసత్వ రాజకీయాలను నిత్యం విమర్శించే బిజెపి తనకింది నలుపును మాత్రం ఎవరూ చూడరనుకుంటుంది. ప్రత్యక్షంగా 4 రాష్ట్రాల్లో, మిత్రులతో కలిసి ఒక రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌కు 662 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 52 మంది 40 ఏళ్లలోపు వారు కాగా, 23 మంది వంశపారంపర్యంగా వచ్చారు.
ఈ కథనం చూపిన కొన్ని ఉదాహరణలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుత ఎంపీల్లో అతి చిన్న వయసు వున్న యదువీర్ వాడియార్ (34), మైసూరు పూర్వపు రాజకుటుంబానికి చెందిన బిజెపి ఎంపీ. ఈయన మాజీ ఎంపీ శ్రీకాంతదత్త నరసింహరాజ వాడియార్ దత్తపుత్రుడు. కరణ్ భూషణ్ సింగ్ (35), భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ మరియు మాజీ బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు. తెలుగుదేశం పార్టీ జీఎం హరీష్ బాలయోగి (35), మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు. మరో టిడిపి ఎంపీ భరత్ (37), మాజీ ఎంపీ మనవడు, నందమూరి కుటుంబ అల్లుడు. ఉత్తరప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి నారాయణ్ సింగ్ మనవడైన రాష్ట్రీయ లోక్ దళ్ కు చెందిన చందన్ చౌహాన్ ( 37 ). సమాజవాది పార్టీ చెందిన ఆదిత్య (38) మరియు అక్షయ్ యాదవ్ (39), యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మేనల్లుళ్లు, ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బంధువులు. అభిషేక్ బెనర్జీ (38), తృణమూల్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ మరియు బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు.
31 శాసనసభల పరిధిలో 40 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న ఎమ్మెల్యేలు 344 మంది ఉండగా, వారిలో 121 మంది, అంటే 35.2 శాతం మంది వంశపారంపర్యంగా వచ్చినవారే అని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం తెలిపింది.







కామెంట్‌లు (0)