సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో భారత్
హామిల్టన్ : భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మూడో వన్డేకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు సిరీస్‌పై పట్టును కొనసాగిస్తోంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందే హామిల్టన్‌లో వర్షం మొదలవడంతో టాస్ ఆలస్యమైంది. మధ్యలో వర్షం తగ్గడంతో మైదాన సిబ్బంది కవర్లు తొలగించి ఆటకు ఏర్పాట్లు చేశారు. అయితే టాస్ నిర్వహించే సమయంలో మళ్లీ వర్షం మొదలైంది. కొంతసేపటి తర్వాత వర్షం విరామం ఇవ్వడంతో టాస్ నిర్వహించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వెల్లడించాడు. మాథ్యూ ఫిషర్‌కు చోటు కల్పించి బ్లెయిర్ టిక్నర్‌ను పక్కనపెట్టాడు.
అయితే టాస్ ముగిసిన వెంటనే మరోసారి వర్షం మొదలవడంతో ఆటకు బ్రేక్ పడింది. పిచ్‌ను కవర్లతో కప్పి వర్షం తగ్గుతుందేమోనని అంపైర్లు, ఆటగాళ్లు చాలాసేపు వేచి చూశారు. పలుమార్లు వర్షం తగ్గినప్పటికీ తిరిగి జోరందుకోవడంతో మైదానంలో నీరు చేరింది. ఆట నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మూడో వన్డే రద్దయినప్పటికీ సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచినా సిరీస్‌ను 2-2తో మాత్రమే సమం చేయగలదు. సిరీస్ విజయం మాత్రం భారత జట్టు ఖాతాలోనే ఉండనుంది. మరోవైపు తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే భారత్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకోనుంది.







కామెంట్‌లు (0)