బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తిలక్‌ ధనాధన్‌.. ఫైనల్లో సౌత్‌జోన్‌

1 గంట క్రితం

Tilak's explosive knock... South Zone in the final.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 05:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్‌జోన్‌పై 7 వికెట్ల విజయం


బెంగళూరు : దులీప్‌ ట్రోఫీ-2026లో సౌత్‌జోన్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. నార్త్‌జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్‌జోన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సౌత్‌జోన్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సత్తాచాటుతూ మొత్తం 167 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మైదానంలో బుధవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో నార్త్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్‌కు లభించిన 117 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని చూస్తే.. ప్రత్యర్థి ముందు 182 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది.


లక్ష్య ఛేదనకు దిగిన సౌత్‌జోన్‌కు రికీ భుయ్‌, నారాయణ్‌ జగదీషన్‌ మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అయితే 102 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో సౌత్‌జోన్‌పై కాస్త ఒత్తిడి పెరిగింది.


ఈ దశలో కెప్టెన్‌ తిలక్‌ వర్మ బాధ్యత తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులతో శతకం బాదిన తిలక్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో విన్నింగ్‌ ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.


ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ తొలి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేయడంతో మొత్తం 167 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్‌తో పాటు నాయకత్వం కూడా సౌత్‌జోన్‌ విజయానికి దోహదపడింది.


ఫైనల్లో ఇషాన్‌తో ఢీ ...


దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా మారింది. ఇషాన్‌ కిషన్‌ సారథ్యంలోని ఈస్ట్‌జోన్‌ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా.. తాజాగా తిలక్‌ వర్మ నేతృత్వంలోని సౌత్‌జోన్‌ కూడా తుది పోరుకు అర్హత సాధించింది.


టీమిండియా టీ20 జట్టులో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న తిలక్‌ వర్మ.. 2027 వన్డే ప్రపంచకప్‌ రేసులో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడనుంది. మరోవైపు భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవాలని చూస్తున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా కీలకమైన ఫైనల్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.


దీంతో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌లో తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ మధ్య జరిగే పోరుపై క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్