సోషల్ మీడియా స్క్రోలింగ్.. వరుసగా వచ్చే నోటిఫికేషన్లు.. 24 గంటల వార్తలు.. పని ఒత్తిడి.. చుట్టూ అంతులేని సమాచార ప్రవాహం.. ఇవన్నీ కలిసి మన మెదడును నిరంతరం అలసిపోయేలా చేస్తున్నాయి. ఒకప్పుడు సులభంగా పుస్తకం చదవగలిగిన మనకు ఇప్పుడు కొన్ని పేజీలు చదవడమే కష్టంగా అనిపిస్తోంది. ఏకాగ్రత తగ్గడం, తరచూ ఆందోళనకు గురికావడం, కారణం తెలియని అసంతృప్తి లేదా భయాందోళన వెంటాడటం వంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతున్నాయి. ఇవన్నీ కేవలం మనలో సంకల్పబలం తగ్గడం వల్లే కావని ‘బిహేవియరల్ సైన్సు జర్నల్‌లో ప్రచురితమైంది. ఇప్పుడు మనం ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం. కానీ పరిణామ క్రమంలో అలవాటుపడిన జీవన పరిస్థితులకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో మన మెదడు మనుగడ సాగిస్తోంది. ఈ పరిస్థితే అసలు సమస్య కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంటే.. మన మెదడు ఒక రకమైన ప్రపంచం కోసం తయారైంది. కానీ మనం ఇప్పుడు మరో రకమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరమే మనలో ఒత్తిడి, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలకు కారణమనేది కొత్త సిద్ధాంతం.
గత కొన్ని సంవత్సరాల్లో స్క్రీన్ వినియోగం విపరీతంగా పెరిగింది. రోజులో ఎక్కువ సమయం ఏదో ఒక స్క్రీన్ ముందే గడిచిపోతోంది. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని గుర్తించిన చాలామంది మార్పులు చేసుకుంటున్నారు. ఎక్కువ సమయం తీసుకునే యాప్‌లను తొలగించడం, ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, పుస్తకాలు చదవడం, బయటకు వెళ్లడం, ప్రకృతిలో గడపడం, ఆఫ్‌లైన్ హాబీలు అలవాటు చేసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటివల్ల కొంత ఉపశమనం లభించినా.. చాలామందికి పూర్తిగా ప్రశాంతత మాత్రం రావడం లేదు. మెదడు ఏదో రకంగా గందరగోళానికి గురైనట్లుగా, నిరంతరం ఒత్తిడిలో ఉన్నట్లుగా అనిపిస్తూనే ఉంటుంది.
సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్, జేమ్స్ కుక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దీనికి గల కారణంపై కొత్త వివరణను ముందుకు తెచ్చారు. ఈ పరిశోధన ‘బిహేవియరల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సమస్య కేవలం టెక్నాలజీ కంపెనీలు రూపొందిస్తున్న ఆకర్షణీయమైన ఉత్పత్తులు, మనల్ని ఎక్కువసేపు యాప్‌లలో ఉంచే అల్గారిథమ్‌ల వల్ల మాత్రమే కాదు. అసలు సమస్య చాలా లోతైనదిగా ఉంది. మనిషి మెదడు వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఒక నిర్దిష్టమైన వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చెందింది. కానీ ఆధునిక ప్రపంచం ఆ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉంది.
పూర్వం మనుషులు చిన్నచిన్న సమూహాలుగా జీవించేవారు. చుట్టూ ఉన్నవారు ఎక్కువగా తెలిసిన వ్యక్తులే. ఎవరు స్నేహితులు? ఎవరు ప్రమాదకారులు? ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? ఎవరు తమకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు? వంటి సామాజిక సంకేతాలను గమనించడం జీవించడానికి ఎంతో అవసరం. అందుకే మన మెదడు స్థాయి, ప్రమాదం, నమ్మకం, పోటీ వంటి సంకేతాలకు అత్యంత సున్నితంగా స్పందించేలా పరిణామం చెందింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియాలో వేలాది మంది జీవితాలను మనం చూస్తున్నాం. వారి విజయాలు, సంపద, అందం, ప్రయాణాలు, ఉద్యోగాలు.. అన్నింటినీ నిరంతరం మన జీవితంతో పోల్చుకుంటున్నాం. 24 గంటల వార్తా చక్రం ప్రపంచంలోని ప్రతి సంక్షోభాన్ని మన ముందుకు తీసుకొస్తోంది. దీంతో మన మెదడుకు ‘నేను వెనుకబడిపోతున్నానేమో’ అనే భావన నిరంతరం కలుగుతోంది.
“పోటీ కొత్త విషయం కాదు. అయితే ఆధునిక జీవితం దాన్ని నిరంతరం జరుగుతున్న ప్రక్రియలా అనిపించేలా చేస్తోంది. చిన్న సామాజిక సమూహంలోని వ్యక్తుల నుంచి కాకుండా అపరిచితులు లేదా స్క్రీన్‌ల నుంచి వచ్చే సంకేతాలకూ మనం ఎందుకు ఇంత బలంగా స్పందిస్తున్నామో అర్థం చేసుకోవడానికి పరిణామ దృక్పథం ఉపయోగపడుతుంది” అని పరిశోధన సహ రచయిత జోస్ యోంగ్ పేర్కొన్నారు. మనం ఆదిమసమాజం నుండి అభివృద్ధి చెందిన వారం. ప్రకృతిలో మమేకమై జీవించాం. మన ఇంద్రియ వ్యవస్థ కూడా ప్రకృతి వాతావరణానికి అనుగుణంగానే పరిణామం చెందింది. అందుకే అడవులు, పచ్చిక బయళ్లు వంటి సహజ వాతావరణాల్లో ఉండే దృశ్యాలు, శబ్దాలు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా మనల్ని ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి.
ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచం నియాన్ లైట్ల నుండి జంక్ ఫుడ్, ట్రాఫిక్, భారీ శబ్దాలు, రకరకాల కొత్త కొత్త మార్పులతో నిండిపోయింది. ఇవన్నీ మన ఇంద్రియాలపై ఒకేసారి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు గంటల తరబడి ఆఫీసు గదుల్లో, తరగతి గదుల్లో కూర్చోవాల్సి వస్తోంది. పరిశోధకుల మాటల్లో చెప్పాలంటే.. “పరిణామ క్రమంలో మన ఇంద్రియ వ్యవస్థకు అలవాటైన వాతావరణానికీ, నేటి ప్రపంచంలోని ఇంద్రియ వాతావరణానికీ మధ్య ఉన్న ఈ వ్యత్యాసం...” “ఒకవైపు మన ఇంద్రియాలను అతిగా ఉత్తేజితం చేస్తూ, మరోవైపు వాటికి అవసరమైన సహజమైన ఉత్తేజాన్ని దూరం చేస్తోంది.”
‘సోషల్ మీడియాను తొలగించుకోవడం, ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం, పుస్తకాలు చదవడం వంటి వ్యక్తిగత ప్రయత్నాలు ఉపయోగపడతాయా?’ అంటే.. ‘సమస్య చాలా లోతైనదైతే ఇవి మాత్రమే సరిపోవ’ని పరిశోధన సూచిస్తోంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎంతగా మార్చుకున్నా.. అతను నివసించే నగరం, పనిచేసే కార్యాలయం, చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థ, డిజిటల్ ప్రపంచం మాత్రం అలాగే ఉంటాయి. పరిశోధన సహ రచయిత సారాచాన్ చెబుతున్న దాని ప్రకారం.. ‘ఒత్తిడి, ఒంటరితనం, ఆందోళనలను సాధారణంగా వ్యక్తిగత లేదా జీవనశైలి సమస్యలుగా చూస్తాం. కానీ మనిషి జీవించే వాతావరణానికి, మన మనసు-శరీరం పరిణామ క్రమంలో అలవాటుపడిన పరిస్థితులకు మధ్య ఉన్న అసమతుల్యత కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు నగరాలు, సమాజాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో కూడా ఆలోచించాలి’ అని ఆమె అంటున్నారు.
వ్యక్తి నుంచి సమాజం వరకు
మన మెదడుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం వ్యక్తిగత బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతగా కూడా ఉండాలని పరిశోధకులు భావిస్తున్నారు. ‘పచ్చదనం ఎక్కువగా ఉండే నగరాలు.. తక్కువ రద్దీ ఉన్న ప్రదేశాలు.. ప్రకృతితో అనుసంధానమయ్యేలా రూపొందించిన కార్యాలయాలు.. మెరుగైన సామాజిక సంబంధాలకు అవకాశం కల్పించే సమాజాలు మన మానసిక ప్రశాంతతకు మరింత ఉపయోగపడవచ్చ’ని అభిప్రాయపడుతున్నారు. అంటే.. డెస్క్‌పై ఒక చిన్న మొక్క పెట్టుకోవడం లేదా మధ్యాహ్నం పది నిమిషాలు పార్కులో నడవడం ఉపయోగకరమే. కానీ నగరాల్లోనే పచ్చదనం లేకపోతే, కార్యాలయాలు పూర్తిగా ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉంటే వ్యక్తిగత ప్రయత్నాల ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.








కామెంట్‌లు (0)