mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడిటిఒను బలిగొన్న బొగ్గు లారీ

2 రోజుల క్రితం

ganapuram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 01:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కార్యాలయం ముందే తీవ్ర గాయాలతో వెంకన్న మృతి

  • ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ సిఎం ఆదేశం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తన కార్యాలయం ముందే విధులు నిర్వహిస్తున్న జిల్లా రవాణా అధికారి (డిటిఒ)ని బొగ్గు లారీ కబళించింది. వాహనాలు తనిఖీ చేస్తున్న భూపాలపల్లి డిటిఒ వెంకన్నను బొగ్గు లారీ ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ఆర్టిఒ కార్యాలయం ముందు సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్కపల్లి ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న డిటిఒ వెంకన్న ఒక హార్వెస్టర్‌ను కాగితాలు లేకపోవడంతో పట్టుకున్నారు. ఆ వాహనాన్ని ఆర్టిఒ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి ఆర్టిఒ కార్యాలయానికి చేరుకున్న వెంకన్న... కార్యాలయం ముందు రహదారిపై ఇసుక, బొగ్గు లారీలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో తాటిచెర్ల నుంచి అతివేగంగా వస్తున్న బొగ్గు లారీ ఆయనను ఢీకొట్టింది. దీంతో, వెంకన్న నడుము కింది భాగం నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. కుట్ర కోణం ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయన 15 రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నుంచి బదిలీపై భూపాలపల్లికి వచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన వెంకన్న 2012లో రవాణా శాఖలో ఇఎంవిఐగా ఉద్యోగంలో చేరి ఉద్యోగోన్నతిపై డిటిఒగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటూ రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టిఒ కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్నకు భార్య ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

​సిఎం రేవంత్‌, మంత్రి పొన్నం దిగ్ర్భాంతి

డిటిఒ వెంకన్న మృతిపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిగ్ర్భాంతి ‌వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సంఘటన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడును ఆయన ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్