పాత పద్ధతిలోనే రైతులు, కౌలు రైతులకు పంపిణీ
సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : యాప్ ద్వారా ఎరువుల పంపిణి విధానం ఉపసంహరించుకోవాలని, పాత పద్ధతిలోనే రైతులు, కౌలు రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విజయవాడలో ఆది, సోమవారాల్లో జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి హాజరయ్యారు. ఈ సమావేశం ఏకగ్రీవంగా పలు తీర్మానాలను ఆమోదించింది. రాష్టంలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభంతో యూరియా, ఎరువుల కోసం రైతులు, కౌలు రైతులు ఆర్‌ఎస్‌కెల చుట్టూ, ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని ప్రభుత్వం రైతులకు కల్పించిందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన యాప్‌లో ఎరువుల పంపిణీ అనే విధానం రైతులను కొత్త ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొంది. అసలే ఎరువుల ధరలు పెరిగి ఆందోళనతో ఉన్న రైతాంగానికి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ విధానం కొత్త సమస్యలను తెచ్చిపెట్టిందని పేర్కొంది. ఎరువులు దొరక్క వ్యవసా యోత్పత్తి దెబ్బతినే ప్రమాదం ఉందని, రాష్ట్రాభివృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తీర్మానం వివరించింది. ఆర్‌ఎస్‌కేలలో ఎరువుల కోసం వెళ్ళిన రైతులకు వారి భూమి రికార్డులు ఆన్‌లైన్‌లో లేవని, భూమికి గత సంవత్సరం ఇక్రాప్ కాలేదని ఎంత ఎరువులకు అవకాశం ఉందో యాప్‌లో చూపించడం లేదని, సర్వర్ పనిచేయడం లేదని వివిధ కారణాలతో ఎరువుల పంపిణీని తిరస్కరిస్తున్నారని పేర్కొంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, భూమి ఆధారంగా ఎరువుల పంపిణీ విధానాన్ని ప్రభుత్వం చేపట్టడంతో, భూమిలేని కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయిందని పేర్కొంది. పంటల అవసరాన్ని బట్టిగాక ఎకరాకు ఎన్ని బస్తాలు కావాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, మూడు దఫాలుగా ఎరువులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపింది. ఈ విధానంలో ఎరువులు కొనలేక వ్యవసాయం చేయాలా ? వద్దా అన్న సందేహంలో రైతులు, కౌలు రైతులు కొట్టుమి ట్టాడుతున్నారని వివరించింది. ఎరువుల దుర్విని యోగానికి పాల్పడుతున్న బడా వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెటర్లను ఒదిలిపెట్టి రైతులను శిక్షింపడం న్యాయం కాదని తీర్మానంలో పేర్కొంది. దీన్ని అరికట్టేందుకు అనేకమార్గాలు ఉండగా వాటిని అనుసరించకుండా, రైతులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే యాప్ విధానాన్ని ఉపసంహరించు కోవాలని, పాత పద్ధతిలోనే పంటలకు అవసరాన్ని బట్టి యూరియా, డిఏపి వంటి ఎరువులను రైతులకు, కౌలురైతులకు అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానంలో డిమాండు చేసింది.









కామెంట్‌లు (0)