న్యూఢిల్లీ : బహిష్కృత ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది తిరిగి బంగ్లాదేశ్‌కి వస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం జాతీయ మీడియాలో ప్రచురితమైన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు మరణ భయం లేదని, తనపై వచ్చిన తీర్పు ‘చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన, రాజకీయ కుట్ర’ అని అన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని, కానీ ఆ కుట్రల వలయాలన్నింటినీ చేధించుకుని, ప్రజల ఓట్లతో ఐదుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యాయనని, దేశ అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. మరణశిక్ష విధించినందున దేశానికి తిరిగి వస్తారా అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ప్రతి అడ్డంకిని, కుట్రను అధిగమించి ఈ ఏడాది తాను తన దేశానికి తిరిగి వస్తానని స్పష్టం చేశారు.
విద్యార్థుల నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో 2024లో ఆమె దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి బహిరంగంగా ఆమె కనిపించలేదు. అయితే జనవరిలో న్యూఢిల్లీలో జాతీయ మీడియాలో ప్రసంగించారు. నిరసనలను అణచివేసేందుకు చంపమని ఆదేశించడం, రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై హసీనాను గతేడాది నవంబర్‌లో ఢాకా కోర్టు దోషిగా నిర్థారించి, ఉరిశిక్ష విధించింది.








కామెంట్‌లు (0)