mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంజిఎన్‌ఆర్‌ఇజిను రద్దు చేయడం.. కార్మికులు, పేదలపై దాడి : ఖర్గే

1 గంట క్రితం

kharge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 03:59 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విబిజి రామ్‌ ‌జి కొత్త పథకం పేరుతో ఎంజిఎన్‌ఆర్‌‌జిను కేంద్రం రద్దు చేస్తోంది. ఈ చర్య కార్మికులు, పేదలపై దాడిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. జూలై 1 నుంచి విబి-జి రామ్‌ జి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నప్పటికీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద పలు రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో పోస్టు చేశారు. ‘నరేంద్ర మోడీజీ మీరు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను నిర్వీర్యం చేసి, గ్రామీణ భారతం యొక్క పని హక్కును హరించారు. అయితే రాష్ట్రాలకు చెల్లించాల్సిన ఎంజిఎన్‌ఆర్‌ఇజి బకాయిలను మీరు చెల్లించలేదన్నది వాస్తవం కాదా? లోకసభలో సమర్పించిన సమాచారం ప్రకారం మార్చి 2026 నాటికి 7,846 కోట్ల రూపాయల వేతనాలతో సహా 34 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 17,144.13 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అంటే దీనర్థం కార్మికులకు దక్కాల్సిన చెల్లింపుల్ని ఇంకా చెల్లించలేదెందుకు? జూలై 1 నుండి మీరు కొత్త పథకం (విబి-జి రామ్‌ ‌జి) రుద్దబోతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ బకాయిల్ని విడుదల చేయలేదు. కర్ణాటక రూ. 700 కోట్లు, జార్ఖండ్‌ ‌రూ. 900 కోట్లు బకాయిలు ఉన్నాయి. అలాగే తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు కూడా రావాల్సిన నిధులు ఇంకా అందలేదు అని ఖర్గే ఎక్స్‌ ‌పోస్టులో మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పథకంలో వేతన వ్యయాలను కేంద్ర ప్రభుత్వమే వంద శాతం భరించేది. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్న కొత్త పథకంలో 40 శాతం మేర వ్యయ భారాన్ని కేంద్రం రాష్ట్రాలపైనే వేసింది. భారీ ఆర్థిక భారాన్ని కారణంగా చూపుతూ బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బీహార్‌లతో పాటు జార్ఖండ్ కూడా నిధుల కేటాయింపు విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం తన పట్టు వీడడం లేదెందుకు? ఆర్‌‌టిఐ సమాచారం ప్రకారం అత్యంత కీలకమైన వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు పనులను నిలిపివేసే 'బ్లాక్‌అవుట్' (Blackout) నిబంధనను అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, కార్మిక వ్యతిరేకమైన ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రైతులు, గ్రామీణ కార్మికులపై ఎందుకు బలవంతంగా రుద్దుతోంది? అని ఖర్గే ప్రశ్నించారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడం ద్వారా కేంద్రం గ్రామీణ ఉపాధిని బలహీనపరుస్తోందని ఖర్గే ఆరోపించారు. అల్ప వర్షపాతం, ఖరీఫ్ సాగు తగ్గడంపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో, కేంద్రం తీసుకున్న ఈ చర్య రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుందని, కార్మికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఖర్గే ఆరోపించారు.

విబిజి రామ్‌‌జి పథకం కింద 125 రోజులు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీనిస్తోంది. ఈ హామీ వల్ల మధ్యప్రదేశ్‌‌లో 20,037 కోట్లు, బీహార్‌ ‌రూ. 15,939 కోట్లు అదనంగా భారం పడుతోంది. కేవలం తన అనుకున్న పథకాన్ని అమలు చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాలని చూస్తోందా? అని ఖర్గే ప్రశ్నించారు. కనీసం ఐదు రాష్ట్రాలు వేతనాల పెంపు కోసం విజ్ఞప్తి చేశాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ రోజువారీ వేతనం రూ. 400 ఉండాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌ ‌రోజువారీ వేతనాలను రూ. 255 నుండి రూ. 413కి, జమ్మూ కాశ్మీర్‌ ‌రూ. 272 నుండి రూ. 311కి పెంచాలని ప్రయత్నిస్తుండగా.. కార్మికులకు గౌరవప్రదమైన వేతనాన్ని అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? ఈ జూన్‌లో వర్షపాతం 42 శాతం తక్కువగా నమోదైంది. ఖరీఫ్ పంటల విత్తన సాగు 22.7 శాతం తగ్గింది. 300కు పైగా జిల్లాలు కరువు బారిన పడే అవకాశం ఉంది. దీనివల్ల గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను రద్దు చేయడం అనేది కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు పేదలపై చేసే దాడి కాదా? మోడీ జీ, దీనికి మీరు సమాధానం చెప్పండి అని ఖర్గే ఎక్స్‌ ‌పోస్టులో ప్రధానిని నిలదీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్