mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

' ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది ` : అసెంబ్లీలో విజయ్‌

23 జూన్, 2026

That pain will haunt me for the rest of my life': Vijay in the Assembly
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై : కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలను కోల్పోయారు.. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అని సిఎం విజయ్ అన్నారు. మంగళవారం తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్‌ పలు కీలక అంశాలపై మాట్లాడారు. హిందీ భాష వివాదం, నీట్‌ పరీక్ష, కరూర్‌ తొక్కిసలాట ఘటనతో పాటు రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలకు కూడా సమాధానం ఇచ్చారు.


అధికారంలోకి రావడం అంత సులభం కాదని పేర్కొన్న విజయ్‌, ప్రజల విశ్వాసాన్ని సంపాదించేందుకు తాను, తన పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘‘మాది నటుడి పార్టీ అని, సినిమా సెట్స్‌ నుంచి నేరుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానని చాలామంది విమర్శించారు. అయితే అలాంటి వ్యాఖ్యలను నేను పట్టించుకోలేదు. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు వెళ్తారు. కానీ నేను ముందుగా ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు పొందిన తర్వాతే పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశాను. ప్రజలు నాపై నమ్మకం ఉంచి గెలిపించారు’’ అని అన్నారు.


నీట్‌ విధానం విద్యా వ్యవస్థలో అసమానతలకు దారితీస్తోందని విమర్శించిన సిఎం, దానిని రద్దు చేయాలని మరోసారి డిమాండ్‌ చేశారు. అలాగే తమిళనాడు ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను రాష్ట్రం ఎప్పటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు.


ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన కరూర్‌ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ విజయ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి ఘటన విషయంలో కూడా మాపైనే విమర్శలు చేయడం బాధాకరం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని అనిపించింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


వారసత్వ రాజకీయాలపై మాట్లాడిన విజయ్‌ .... ‘‘ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం మా రాజకీయ విధానం కాదు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవలందించడమే మా లక్ష్యం. అదే మా రాజకీయ తత్వం, అదే మా పాలనా విధానం’’ అని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్