పూణె : సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) సవరణలను రద్దు చేయకుంటే జులై 5 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నాహజారే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దరఖాస్తులకు ఫీజుల పెంపునకు సంబంధించి తగిన వివరణ గానీ, ఆర్థిక విశ్లేషణ గాని అందించలేదని పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంగళవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర సమాచార హక్కు నిబంధనలు -2026’ ఆర్‌టిఐ చట్టాన్ని నీరుగారుస్తోందని, ప్రజలను సమాచారానికి దూరం చేస్తుందని తెలిపారు. జూన్ 12న ప్రవేశపెట్టిన ఈ సవరణలు ఆర్‌టిఐ చట్టం-2005 స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, అలాగే పారదర్శకతను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఫీజుల పెంపుపై స్పందిస్తూ.. ఆర్‌టిఐ అనేది ఆదాయాన్ని సమకూర్చే చట్టం కాదని, 20 ఏళ్ల తర్వాత ఫీజులను పెంచుతున్నట్లయితే, సమాచారాన్ని నిరాకరించే అధికారులకు విధించే జరిమానాలను కూడా పెంచాలని అన్నారు. గుర్తింవు పత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 6(2) ప్రకారం, దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను లేదా సమాచారం కోరడానికి గల కారణాలను వెల్లడించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నిబంధన ప్రజావేగులకు, కార్యకర్తలకు ప్రమాదం కలిగిస్తుందని సూచించారు. ‘ఒక విషయం-ఒక దరఖాస్తు’ నిబంధన అనవసరమైనదని, ఆర్థిక భారం కలిగిస్తుందని విమర్శించారు. పునరావృత దరఖాస్తులను తక్షణమే మూసివేసే నిబంధన పూర్తి లేదా నవీకరించిన సమాచారాన్ని పొందకుండా అడ్డుకుంటుందని అన్నారు. ఎందుకు సమాచారం కోరుతున్నారో వివరించాల్సిందిగా దరఖాస్తుదారులను కోరడం, ఒకవేళ వారు హాజరుకాకపోతే అప్పీళ్లను కొట్టివేయడం, దరఖాస్తుదారుడు మరణించినపుడు కేసులను స్వయంచాలకంగా మూసివేయడం, సమాచార కమిసన్ ముందు విచారణల సమయంలో న్యాయ సహాయాన్ని నిరాకరించడం వంటి నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యవస్థాగత వైఫల్యాలను అరికట్టడానికి బదులుగా, ఈ నిబంధనలు పౌరులపై భారాలను మోపుతున్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులు ముందుగానే సమాచారం వెల్లడించాలని నిర్దేశించిన ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 4 ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ నిబంధన సరిగ్గా అమలు కాకపోవడంతో, ప్రజలు దరఖాస్తులు దాఖలు చేయాల్సి వస్తోందని అన్నారు.1998లో మహారాష్ట్రలో ఆర్‌టిఐ చట్టం కోసం అన్నాహజారే అనేక ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ చట్టం కోసం ముంబయిలో, పూణెలో నిరాహార దీక్షలు చేపట్టారు. తాజాగా జూన్ 12న ప్రకటించిన సవరణలను వెంటనే రద్దు చేయకుంటే, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినా సరే, జులై 5న రాలేగావ్ సిద్ధిలోని యాదవ్ బాబా ఆలయంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని లేఖలో హెచ్చరించారు. దరఖాస్తుదారులపై కొత్త ఆంక్షలు విధించడానికి బదులు, ముందుగానే సమాచారం వెల్లడించేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్‌టిఐ సవరణలను రద్దు చేయకుంటే నిరవధిక నిరాహారదీక్ష : అన్నాహజారే
23 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)