న్యూఢిల్లీ: దేశీయ అవసరాలకు ఇంధన కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తలెత్తే ఇంధన అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని.. పెట్రోల్, డీజిల్,విమాన ఇంధనం ఎగుమతులపై ప్రత్యేక అదనపు సుంకాలను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి అమలులోకి రానున్న ఈ నూతన రేట్ల ప్రకారం.. పెట్రోల్ ఎగుమతిపై లీటరుకు రూ. 4, డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 8.5, అలాగే విమాన ఇంధనంపై లీటరుకు రూ. 7.5 చొప్పున ఎగుమతి సుంకాన్ని వసూలు చేయనున్నారు.
అయితే, పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు మారిషస్, మాల్దీవులకు చేసే ఇంధన ఎగుమతులకు ఈ సుంకం నుండి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కేవలం ఎగుమతులపైనే ఈ అదనపు భారాన్ని మోపిన కేంద్రం.. దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది. తద్వారా దేశంలోని సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడబోదని కేంద్రం హామీ ఇచ్చింది.









కామెంట్‌లు (0)