ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి కొడాలి నానిపై 2021లో నమోదైన కేసులో తాజాగా ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన జిఓ 801తో పాటు, దానికనుగుణంగా కృష్ణా జిల్లా కలెక్టరు జారీ చేసిన తదుపరి చర్యలను నిలిపివేస్తూ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మూడేళ్ల శిక్ష మాత్రమే విధించే కేసుల్లో మూడేళ్లు దాటిన తర్వాత కోర్టు విచారణకు స్వీకరించడంపై సిఆర్‌పిసిలో స్పష్టమైన నిషేధం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో 2021 కేసులో 2026లో ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వడం, అనంతరం చార్జిషీట్ దాఖలు చేయడం చట్టబద్ధతపై సందేహాలు కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. హైకోర్టులో పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరిన పోలీసులు, ఆ గడువు ముగియకముందే కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కోర్టు ధిక్కారాన్ని తలపిస్తోందని వ్యాఖ్యానిస్తూ, పోలీసులు, జిల్లా కలెక్టరు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా నాని తరపున సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు వాదిస్తూ.. రాజకీయ కక్షతోనే ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ తరపున జిపి అడుసుమిల్లి జయంతి చార్జిషీట్ దాఖలైనందున తదుపరి అంశాలను ట్రయల్ కోర్టే పరిశీలిస్తుందని వాదించగా, అధికరణ 226 కింద హైకోర్టు అధికారాలకు విస్తృత పరిధి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సహకరించే అధికారిగా వ్యవహరించాలని, ప్రభుత్వ మౌత్‌పీస్‌గా కాకూడదని కూడా జస్టిస్ లక్ష్మణరావు వ్యాఖ్యానించారు.
కొడాలి నానిపై ప్రభుత్వ ప్రాసిక్యూషన్ అనుమతిపై స్టే
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 10:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)