ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి హెచ్ రాయుడు
ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం 3 న 'హలో రైతన్న.. చలో ఏలూరు కార్యక్రమం పోస్టర్లు విడుదల చేశారు. ముఖ్యఅతిథి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి హెచ్ రాయుడు మాట్లాడుతూ .... రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో చేసిన చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని కార్యక్రమం నిర్వహించారు. 'వ్యవసాయాన్ని కాపాడండి, రైతాంగాన్ని రక్షించండి' అంటూ నినాదాలు చేశారు. విత్తన చట్టం, నూతన ఎరువుల విధానం, విద్యుత్ చట్టం, మార్కెటింగ్ ప్రేమ్ వర్క్ చట్టం వంటి అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ చట్టాలు రైతాంగానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్పొరేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల వల్ల రైతాంగం మరింత తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఎటువంటి సుంకాలూ లేకుండా అమెరికా నుండి పాలు, పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, గోధుమ, బియ్యం, పత్తి, కోడి కాళ్లు, సోయాబీన్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోకి దిగుమతి అయ్యి దేశ రైతాంగం దివాలా తీస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని పంటల ధరలు దిగనాసిగా ఉన్నాయని, ధాన్యం, మొక్కజొన్న మొదలు పొగాకు వంటి వ్యాపార పంటలకు మార్కెట్ లేదని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించాల్సిందిపోయి కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకొంటుందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలో రైతాంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జులై మూడున 'హలో రైతన్న - చలో ఏలూరు' అంటూ భారీ రైతు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నామని, రైతాంగం పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ వంటి జాతీయ రైతు నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుకార్యదర్శిలు జయ్యమ్మ సువర్ణమ్మ స్థానిక రైతు సంఘం మండల నాయకులు దేవయ్య నారాయణ రెడ్డి చిన్నప్ప క్రిష్ణరెడ్డి ఓబులేసు అవజ్ వలి, తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)