గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

లిక్కర్‌ కంపెనీలకు సహాయం అందించడమే యుడిఎఫ్‌ ప్రభుత్వ ఉద్దేశ్యం : పినరయి విజయన్‌

3 గంటల క్రితం

Pinarayi Vijayan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 01:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తిరువనంతపురం : లిక్కర్‌ కంపెనీలకు సహాయం అందించడమే యుడిఎఫ్‌ ప్రభుత్వ రహస్య ఉద్దేశ్యమని కేరళం అసెంబ్లీ ప్రతిపక్ష‍ నేత విజయన్‌ మండిపడ్డారు. ప్రతిపక్ష‍ం వ్యతిరేకిస్తున్నప్పటికీ.. అసెంబ్లీ నిబంధనలు, సాంప్రదాయాలను విస్మరించి యుడిఎఫ్‌ ప్రభుత్వం బుధవారం ఆర్థిక బిల్లును ఆమోదించిందని అన్నారు. దీంతో అవినీతికి అండగా నిలవడమే యుడిఎఫ్‌ ప్రభుత్వ నిజ స్వరూపమని రుజువైందని అన్నారు. గురువారం తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో సవరించిన బడ్జెట్‌ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టినపుడు, అందులో ఆర్థిక బిల్లు చేర్చబడలేదని అన్నారు. ఆ దశలో ఎటువంటి కొత్త పన్ను ప్రతిపాదనలు పరిశీలనలో లేవని, ప్రభుత్వం కూడా ఈవిషయాన్ని స్వయంగా స్పష్టం చేసిందని అన్నారు. సలహా సంఘం సమావేశంలో కూడా ప్రభుత్వం ఇదే వైఖరిని పునరుద్ఘాటించిందని అన్నారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల రెండవ దశలో.. లిక్కర్‌ కంపెనీలకు పన్ను రాయితీని ఆమోదించేందుకు వీలుగా ఆర్థిక బిల్లును అజెండాలో రహస్యంగా చేర్చారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్ష‍ం సహకార వైఖరిని అవలంబించిందని, కానీ సభను తప్పుదోవ పట్టించడానికి, తప్పుడు సమాచారాన్ని అందించడానికి యుడిఎఫ్‌ ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటరీ విధానాలను ఉల్లంఘించి, అక్రమ పద్ధతిలో ఆర్థిక బిల్లును ఆమోదించడానికి హడావిడిగా ప్రయత్నం జరిగిందని, కేవలం స్వప్రయోజనాల కోసం , ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా బిల్లును అజెండాలో చేర్చారని అన్నారు. ఇది దొడ్డిదారిన చొప్పిడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని లిక్కర్‌ కంపెనీలకు లబ్థి చేకూర్చేందుకే ఒక రహస్య అజెండా ఉందని, దీనిని ప్రతిపక్ష‍ం వ్యతిరేకించిందని అన్నారు. బిల్లును ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం తొందరపాటును, మొండితనాన్ని ప్రదర్శించిందని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఈబిల్లును ముందుకు తీసుకువెళ్లాలని పట్టుబట్టారని, ఏవిధంగానైనా లిక్కర్‌ కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తక్కువ ధరకు లిక్కర్‌ అందుబాటులోకి వస్తే, సమాజంలో లిక్కర్‌ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను బడ్జెట్‌లో చేర్చినప్పటికీ, తుది నిర్ణయం యుడిఎఫ్‌ తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఇంతకు ముందు చెప్పారని అన్నారు. అయితే ఆ వాదనలన్నీ ఇప్పుడు ప్రహసనంగా మారాయని విజయన్‌ మండిపడ్డారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్