గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలోచనలను అక్షరాలుగా మార్చే ఏఐ

1 గంట క్రితం

ai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 12:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- శస్త్రచికిత్స లేకుండా అభివృద్ధి చేసిన మెటా

న్యూఢిల్లీ: మెటా మానవ మెదడులోని సంకేతాలను నేరుగా టెక్స్ట్‌గా మార్చగల కొత్త కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేసింది. ‘బ్రెయిన్2క్వెర్టీ వి2’ (బ్రెయిన్2క్వెర్టీ వి2)గా పిలుస్తున్న ఈ వ్యవస్థకు మెదడులో చిప్‌లు అమర్చే శస్త్రచికిత్స అవసరం లేకపోవడం విశేషం. ఈ సాంకేతికత ప్రమాదాలు, పక్షవాతం లేదా ఇతర కారణాలతో మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి ఉపయోగపడుతుందని మెటా వెల్లడించింది. శస్త్రచికిత్స ద్వారా మెదడులో చిప్‌లు అమర్చే 'న్యూరాలింక్' వంటి విధానాలతో పోలిస్తే, ఇది పూర్తిగా బాహ్య పరికరాల సహాయంతో పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

ప్రత్యేక సెన్సార్లతో కూడిన హెల్మెట్‌ను ధరించిన వ్యక్తి మనసులో అక్షరాలు లేదా వాక్యాలను ఊహించినప్పుడు మెదడులో ఏర్పడే సూక్ష్మ అయస్కాంత సంకేతాలను ఈ పరికరం గుర్తిస్తుంది. అనంతరం ఏఐ వ్యవస్థ వాటిని విశ్లేషించి కంప్యూటర్ తెరపై అక్షరాలు, పదాలుగా మారుస్తుంది. మెదడు సంకేతాల్లోని అస్పష్టతలను సరిచేయడానికి ‘ఆటోకరెక్ట్’ తరహా అధునాతన భాషా నమూనాను కూడా ఇందులో వినియోగించారు.

మెటా తెలిపిన వివరాల ప్రకారం, గతంలో శస్త్రచికిత్స లేకుండా మెదడు సంకేతాలను చదివే పద్ధతులు సుమారు 8 శాతం కచ్చితత్వానికే పరిమితమయ్యాయి. అయితే కొత్త ‘బ్రెయిన్2క్వెర్టీ వి2’ వ్యవస్థ సగటున 61 శాతం కచ్చితత్వాన్ని సాధించింది. పరీక్షల్లో పాల్గొన్న ఒక వాలంటీర్ 78 శాతం కచ్చితత్వంతో వాక్యాలను రూపొందించగలిగినట్లు సంస్థ వెల్లడించింది. ఈ వ్యవస్థకు తొమ్మిది మంది వాలంటీర్లపై 10 గంటలకు పైగా శిక్షణ ఇచ్చి, 22 వేలకుపైగా వాక్యాలను విశ్లేషించినట్లు మెటా తెలిపింది. శస్త్రచికిత్స ద్వారా ఎలక్ట్రోడ్‌లు అమర్చే ‘ఇన్వాసివ్’ పద్ధతులకు సమానమైన ఫలితాలను ఈ సాంకేతికత అందించే దిశగా పురోగతి సాధించామని పేర్కొంది. ఈ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత కోడింగ్ డేటాను ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులకు అందుబాటులో ఉంచినట్లు మెటా వెల్లడించింది. భవిష్యత్తులో ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే మాట్లాడలేని రోగులు తమ ఆలోచనలను సులభంగా ఇతరులకు తెలియజేసే అవకాశం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్