ఎస్ఐఆర్ మ్యాపింగ్ పక్కాగా చేయాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో ఉంటారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా గృహ మ్యాపింగ్ పక్కాగా చేయాలని ఆయన ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాంతినగర్ 181 పోలింగ్ కేంద్రం, అంకమ్మ నగర్ 179 పోలింగ్ కేంద్రాల పరిధిలో గురువారం వివేక్ యాదవ్ పరిశీలించారు. బిఎల్‌ఒలతో మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియను ఏ విధంగా చేపడుతొందని అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఎఇఆర్‌లతో చర్చించి ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అపార్టుమెంట్ల వద్ద ఓటరు నమోదుకు అపార్టుమెంట్ల అసోసియేషన్‌లతో సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారితో బుక్‌ఎకాల్ వ్యవస్థ ద్వారా ఓటర్ల సందేహాలను నివృత్తి చేయుటకు కృషి చేయాలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్షంగా లేనివారు (ఆబ్సెంట్), ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు (షిఫ్టెడ్), మరణించినవారు (డెడ్), డూప్లికేట్, ఇతర దేశస్థులు (ఫారినర్‌లు) క్రింద ఉన్న ఓటర్లు మినహా అందరూ ఓటరు జాబితాలో ఉండాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలని ఆదేశించారు. కార్పొరేషన్ కమిషనర్ కె మయూర్ అశోక్, ఆర్‌డిఒ కె శ్రీనివాసరావు, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి సాంబశివరావు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వి విజయలక్ష్మి పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)